ధీరుడి స్వభావాన్ని నొక్కిచెప్పిన భగవద్గీత!!

ప్రతి మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు సహజం. అయితే ధైర్యంగా ఉన్నవాడు దేన్నైనా ఎదుర్కోగలడు. ఇక్కడ ధైర్యం అంటే ఏదో సమస్యకు ఎదురుగా వెళ్లి దాని అంతు చూడటం. శరీరాన్ని పెంచి అజానుబాహుడిగా ఉండటం కాదు. దీని గురించి గీతలో కృష్ణుడు చెబుతాడు. రెండవ అధ్యాయం 15వ శ్లోకాన్ని చెబుతూ కింది విధంగా ప్రస్తావిస్తాడు. ధీరుడు(ధైర్యవంతుడు)  ఎవరు?? అతడి మనస్తత్వము, అతడి స్వభావం. ఇవన్నీ తెలుసుకుంటే మనిషిలో దాగున్న ధీరత్వమేదో మెల్లిగా బయటకు రాక మానదు.

【శ్లోకం:- యం హి న వ్యథయక్త్యేతే పురుషం పురుషర్షభ|

సమదు:ఖసుఖం ధీరం సోం మృతత్వాయ కల్పతే॥

ఏ వ్యక్తిని అయితే బయట ప్రపంచంలో ఉన్న ఆకర్షణలు, వాటి వలన కలిగే సుఖ దు:ఖములు ఎటువంటి బాధను కలిగించవో, ఎవరైతే సుఖము దుఃఖము పట్ల సమభావము కలిగి ఉంటాడో, అటువంటి ధీరుడికి అమృతత్వము లభిస్తుంది.】

బయట ప్రపంచంలో జరిగే విషయముల వలనా, రకరకాలుగా మోహింపజేసే వివిధములైన వస్తువుల వలనా, అవి కావాలి, ఇవి కావాలి.  వాటిని అనుభవించాలి అనే కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీరితే సుఖం కలుగుతుంది. తీరకపోతే దుఃఖం కలుగుతుంది. ఇది సహజము. ప్రస్తుత మానవ స్వభావం కూడా ఇదే. అయితే ధీరుడు అంటే బలము, పరాక్రమము కలవాడు అనే కాదు. ప్రాపంచిక విషయాలకు, ఆ విషయాలకు సంబంధించిన సుఖాలకు, కామకోరికలకు చలించని వాడు. వాటి వైపు ఆకర్షింపబడని వాడు. ప్రాపంచిక విషయముల వెంట పరుగెత్తని వాడు. వాడే నిజమైన ధీరుడు. అటువంటి వాడికి కోరిక తీరినందువలన సుఖము లేదు, కోరిక తీరనందువలన దుఃఖము లేదు. సుఖ దుఃఖములను సమానంగా చూడగలడు. సుఖ దుఃఖములు మనో వికారములు అనీ, అవి ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయనీ, వాటి కోసం పొంగి పోవడం, కుంగి పోవడం అవివేకమనీ తెలిసిన వాడు. అటువంటి ధీరులు మోక్షము పొందడానికి అర్హులు.

ఈ శ్లోకంలో ఒక జాతిని కానీ, ఒక వర్ణముగానీ, ఒకమతము కానీ అనలేదు. అందరూ మోక్షానికి అర్హులే. కాకపోతే వారు సుఖ దుఃఖములను సమానంగా చూడగలిగే ధీరత్వము కలిగి ఉండాలి. ప్రకృతి లక్షణాలకు అనుగుణంగా తనను తాను మార్చుకోగలిగిన ధీరత్వము కలిగి ఉండాలి. దేనికీ భయపడకూడదు, బాధపడకూడదు. సుఖము వచ్చినా దుఃఖము వచ్చినా సమంగా అనుభవించగలిగిన ఓర్పు, నేర్పు కలిగి ఉండాలి. అటువంటి వాడు మోక్షమునకు అర్హుడు. ఈ శ్లోకంలో అమృతత్వము అనే పదం వాడారు. అమృతము అంటే మృతము లేనిది. చావు లేనిది. అంతము లేనిది, నాశనము లేనిది, మార్పుచెందనిది అని అర్థము. శరీరానికి పై చెప్పిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి సుఖదు:ఖాలు సమానంగా భావించే ధీరుడికి శరీరం ధరించే అవసరం ఉండదు. అంటే ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు. పరమాత్మలో లీనం అవుతాడు అదే మోక్షము. 

అంటే మనిషి ఈ భౌతిక ప్రపంచానికి, ఇక్కడ కలిగే వివిధ సుఖదుఃఖాలను పట్టించుకోకుండా ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ధీరుడిగా మారతాడు. అంటే అన్నిటినీ ఎదుర్కొని నిలబడగలిగే స్థిరత్వం ఆ మనిషిలో చోటుచేసుకుంటుంది. అతడే మోక్షాన్ని సాధిస్తాడు. ఆ మోక్షమే అమృతత్వము.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories