మనుషులలో సందిగ్దతను తొలగించే శ్లోకం!!

 

యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ | 

సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశమ్||

ధర్మ రక్షణకోసం, సమాజం కోసం యుద్ధం చేసి, ఆ యుద్ధంలో ప్రాణాలు అర్పించడం ఎంతో శ్రేయోదాయకము. అటువంటి అవకాశము నీకు యాదృచ్ఛికంగా, అయాచితంగా అంటే నీవు కోరుకోకుండానే నీకు లభించింది. యుద్ధంలో మరణించడం అంటే స్వర్గద్వారములు తెరుచుకోవడమే. ధర్మయుద్ధంలో చావడం అందరికీ లభించేది కాదు. అది అదృష్ట వంతులైన క్షత్రియులకే లభిస్తుంది. ఆ అదృష్టం ఇప్పుడు ఈ యుద్ధం రూపంలో నీకు లభించింది. అసలు ధర్మ యుద్ధము అంటే స్వర్గమునకు తెరువబడిన ద్వారం వంటిది. గెలిస్తే రాజ్యసుఖాలు, మరణిస్తే స్వర్గలోకసుఖాలు నీకు సిద్ధంగా ఉన్నాయి అంటాడు కృష్ణుడు. అంటే ఇక్కడ యుద్ధం చేయడమే పరమావధినా అని అందరికీ అనిపించవచ్చు. కానీ ఒక క్షత్రీయుడికి యుద్ధం చేయడమే పరమావధి. అది అతని కర్తవ్యం, అతను పాటించవలసినది.

ధర్మం కొరకు చేయబడే యుద్ధంలో మరణిస్తే స్వర్గలోకం ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. యుద్ధంలో మరణించిన వారు సరాసరి స్వర్గానికి వెళతారు. ఎన్నో యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు చేస్తే గానీ లభించని స్వర్గం యుద్ధంలో మరణించిన వారికి సునాయాసంగా ఏ ప్రయత్నం లేకుండానే లభిస్తుంది. యుద్ధంలో మరణించిన క్షత్రియులు ఎంతో అదృష్టవంతులు. యుద్ధమంటే స్వర్గానికి తెరిచిన ద్వారం వంటిది. నీవు యుద్ధం చేయడం మానేస్తే భీష్మ, ద్రోణ, కృపాచార్యులు, నీ బంధుమిత్రులు ఈ సైనికులు స్వర్గసుఖాలు అనుభవించే అవకాశాన్ని జారవిడుచుకుంటారు. నీకోసరం కాకపోయినా వాళ్ల కోసం అయినా నీవు యుద్ధం చేయాలి తప్పదు.

స్వధర్మం అనుసరిస్తూ ధర్మరక్షణ కొరకు యుద్ధంలో ప్రాణాలు అర్పించడం క్షత్రియ ధర్మం. వాడికి స్వర్గలోక ద్వారాలు తెరిచిపెట్టి ఉంటాయి. నీవు చాలా అదృష్టవంతుడివి. ధర్మం కొరకు జరిగే యుద్ధంలో ప్రాణాలు అర్పించడం నీకు వచ్చిన గొప్ప అవకాశం. ఇటువంటి అవకాశం ఎంతో పుణ్యం చేసుకుంటేనే గానీ దొరకదు. నీకు స్వర్గం లభిస్తుంది. అంటే నీ క్షత్రియ జీవితం సాఫల్యం చెందుతుంది. అనుకున్నది చేయడంలో ప్రతిమనిషికీ సంతోషం ఉంటుంది. అదే స్వర్గం. ఈ యుద్ధం వలన నీకు స్వర్గ ద్వారము తెరిచినట్టు కనిపిస్తూ ఉంది. యుద్ధం స్వర్గానికి ద్వారం లాంటిది. అదీకాకుండా  అపావృత స్వర్గ ద్వారము అంటే నీ కొరకు స్వర్గద్వారం ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. ఇటువంటి అవకాశం ఎంతో అదృష్టం చేసిన క్షత్రియుడికే దొరుకుతుంది. ఇటువంటి అవకాశం అపూరూపంగా లభిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని చేజేతులా ఈ జారవిడుచుకోకు అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.

ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకుని ఎవరికి వారు అన్వయించుకుంటే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ చేసే ప్రతి పని యుద్ధం లాంటిదే. అందులో గెలిస్తే సంతోషం, అలాగే ఏదో ఒక లాభం కూడా ఉంటుంది. ఇక ఓడిపోతే ఎమోస్తుంది స్వర్గ సుఖాలు ఎక్కడోస్థాయి అని అందరూ అనుకుంటారేమో కానీ అది తప్పు.  మనిషి విజయం కోసం చేసే ప్రయత్నంలో క్లైగే అనుభవాలు గొప్ప పాఠాలు నేర్పుతాయి. కాబట్టి మనిషిగా పుట్టిన తరువాత కర్తవ్యాన్ని నెరవేర్చేటపుడు లాభ, నష్టాలు చూసుకోకుండా, గెలుస్తామో ఒడిపోతామో అనే భయం పెట్టుకోకుండా, ఆ పనిని చేయడమే ప్రథమ కర్తవ్యం అని తెలుసుకోవాలి. అప్పుడు సందిగ్ధాలు అన్నీ  మబ్బుతెరల్లా మెల్లిగా వీడిపోతాయి.

 

◆ వెంకటేష్ పువ్వాడ

 


More Purana Patralu - Mythological Stories