Taataadhitai Tadigibatom - 16

తాతా ధిత్తై తరిగిణతోం 16

జీడిగుంట రామచంద్రమూర్తి

కళ్ళముందు 'భ్రమ' లా వదిలిన ఆ దృశ్యాన్ని చూసి త్రుళ్ళిపడ్డ శ్రీరామ్ వెంటనే వాస్తవానికి వచ్చాడు.

"డాడీ! ఇతనే శ్రీరామ్. నాక్లాస్ మేట్. జేమ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్'' అంటూ అతన్ని తండ్రికి పరిచయం చేసి ఆ వెంటనే అతని భుజం మీదకు వంగి, చెవిలో రహస్యంగా అంది ''బట్ ఐ యామ్ ఇన్ లవ్.''

ఇంతలో విష్ణుమూర్తి తన చేయి చాపి "షేక్ హ్యాండ్' ఇస్తూ అన్నాడు "ప్లీజ్ డ్ టు సీ యూ యంగ్ మాన్. అయామ్ విష్ణుమూర్తి." ఆయన చేతిలో తన చేయిని కలిపి ఎందుకో తన చేయి తనకే చల్లగా వున్నట్లు తోచింది శ్రీరామ్ కి.

"కమాన్ బయట చలిగా వున్నట్టుంది. లోపల కూర్చుందాం" అంటూ అతన్ని హాల్లోకి తీసుకెళ్ళి సోఫా చూపించాడు.

తెల్లటి మఖ్ మల్ కవర్లతో మెరిసిపోతున్న ఆ సోఫాలో తాను కూర్చుంటే అదెక్కడ మాసిపోతుందో అన్నట్టుగా క్షణం సేపు తటపటాయించి ఆ పిమ్మట నెమ్మదిగా, పొందిగ్గా అందులో కూర్చున్నాడతను.

"మీరు మాట్లాడుతూండండీ డాడీ...నేను వెళ్ళి జ్యూస్ తెస్తాను" లేడిపిల్లలా లోపలకు పరుగెత్తింది అశ్విని. ఆమెవైపు అలాగే తన్మయంగా చూసి తర్వాత, శ్రీరామ్ తో చెప్పాడు విష్ణుమూర్తి.

"నా ఏకైక బిడ్డ! గారాల కూచి అదృష్టాన్నీ దురదృష్టాన్నీ వెంటబెట్టుకునికొచ్చింది. అర్థం కానట్టు చూశాడు శ్రీరామ్. మేడ మెట్లమీదమీదున్న నిలువెత్తు ఫోటోవైపు బరువుగా అడుగులు వేస్తూనే మళ్లీ చెప్తున్నాడు విష్ణుమూర్తి.

"షి ఈజ్ మై వైఫ్...మా బేబీ పుట్టిన అయిదు నిమిషాలకే ఆమె నాకు శాశ్వతంగా దూరమైంది...ఆ తర్వాత మరో అరగంటకు నాకు బిజినెస్ లో నాలుగు కోట్ల లాభం వచ్చిందన్న వార్తా తెలిసింది." ఆయన చెప్తున్నా విషయాలు వింటూనే ఇంద్రభావన్నాన్ని తలపింపచేస్తున్న ఆ ఇంటినీ చుట్టూ కనిపిస్తున్న అందమైన అలంకారాల్నీ పరిశీలనగా చూస్తున్నాడు శ్రీరామ్.... విష్ణుమూర్తి ఇంకా చెప్తూనే వున్నాడు.

"అఫ కోర్స్! నేను నమ్మకాలకీ, మూఢ విశ్వాసాలకీ అతీతుణ్ణి. అందుకే భార్యపోయిన విషాదానికి కృంగిపోలేదు. రెండింటిని సమానంగానే తీసుకువచ్చాను...దానికి అమ్మా, నాన్నా, అయిన వాళ్లూ, ఆప్తమిత్రులు అందరూ నేనే!...నాకు అన్నీ తనే!...అది, అరసేకను కనుమరగైతే తట్టుకోలేను! బైదీ బై! కాలేజీ చదువుకంటే ముందే, మా బేబీ నీకు తెలుసా? అయ్ మీన్ పరిచయముందా?"

"లేదండీ! మా పరిచయం కాలేజీలోనే! ఇద్దరం ఒకే గ్రూప్."

"అన్నట్టు నీ హ్యాండ్ రైటింగ్ బాగుంది" చివ్వున తలెత్తి చూశాడు శ్రీరామ్.

అదే మొన్నీమధ్య నువ్ ఆకాశరామన్న ఉత్తరం రాశావ్ గా చూశాను!" తప్పుచేసిన వాడిలా తలవంచుకున్నాడు శ్రీరామ్.

"అసలు ఆ ఉత్తరం నువ్వే రాసావని అశ్విని చెప్పిన తర్వాత నిన్ను చూడకపోయినా నీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో నేనర్ధం చేసుకున్నాను. మా బేబీ తన లైఫ్ పాట్నర్ గా నువ్వే కావాలని ఎందుకంత పట్టుపడుతోందో గ్రహించాను." శ్రీరామ్ మౌనంగా వింటూండి పోయాడు.

(ఇంకావుంది)

(హాసం వారి సౌజన్యంతో)