Aanagar Colony 3

ఆహా నగర్ కాలనీ

సూరేపల్లి విజయ

3 వ భాగం

ఆహానగర్ లోకి ప్రవేశించగానే బోల్డు విచిత్రాలు కనిపించాయి.

సాకేత్ కు ఏ ఇంటికి తలుపులు వేసిలేవు. బార్లా తెరిచిన తలుపులే దర్శనమిచ్చాయి. టీ కొట్టు, పాన్ షాప్ లు హోటళ్ళు, షాపులు, అన్నీ వున్నాయి. ఆ కాలనీలో. కానీ వాటికి పెట్టిన పేర్లే విచిత్రంగా వున్నాయి. లస్కుటపా హోటల్, బర్ర్ పాన్ షాప్, ఓర్ని యబ్బ క్లబ్, కిచకిచ బ్యూటీపార్లర్, హచ్ హేర్ కటింగ్ సెలూన్,....ఇలా గమ్మత్తయిన పేర్లతో వున్నాయి. ఒక్కక్షణం తల గిర్రున తిరిగిన సెన్సేషన్ కలిగింది సాకేత్ కు.

"ఆహానగర్ కాలనికి వచ్చాం...ఎక్కడో ఆపొద్దో చెబితే...అక్కడ ఆపను అన్నాడు పాతాళభైరవి రిక్షావాడు. ఓహో...ఆపొద్దు....అంటే ఆపాలి అనే అర్థం కాబోలు...అనుకొని "సరే...ఏదైన మంచి లాడ్జింగ్ దగ్గర చూసి ఆపక్క" అన్నాడు సాకేత్.

తన క్కూడా ఆహానగర్ రిక్షావాళ్ళ భాష అబ్బిందని తెగ సంతోషపడిపోతూ... రిక్షా ఓ లాడ్జింగ్ ముందాగింది. సాకేత్ తల పైకెత్తి ఆ లాడ్జింగ్ పెరేమిటా అని చూసి బిత్తరపోయాడు.

హోటల్ కసకస అని పెద్ద బోర్డు వేలాడుతోంది. రిక్షా దిగి జేబులో డబ్బులు తీస్తుండగా గుర్తొచ్చింది.

తాను రిక్షావాడిని ఎంతకొస్తావని? అడగలేదని. గుండె గుభేలుమంది...ఇప్పుడు ఎంత చెబుతాడోనని.

"ఎంతివ్వమంటావు?" అడిగాడు భయపడుతూనే.

"ముప్పావలా"; చెప్పాడు రిక్షావాడు.

"ఎంత?"

"ముప్పావలా"

"యూమీన్ సెవంటీఫైవ్ పైసా"

"నో...ఐమీన్ త్రీ పావలాస్" అన్నాడు రిక్షాశాల్తీ.

"రెండూ ఒకటే కదా" ఈసారి ఆశ్చర్యపోవడం సాకేత్ వంతయింది.

"నాక్కావలసింది ముప్పావలా...దట్సాల్."

"జేబులోనుంచి మూడు పావలా నాణాలు తీసి ఇచ్చాడు. అబిడ్స్ సెంటర్ దగ్గర ఓ ముష్టివాడుకి పావలా నాణెం వేస్తె తనని పిచ్చివాడిలా చూసి, అతడి బొచ్చెలో తను వేసిన పావలా నాణం తనకే ఇచ్చి..."ఎళ్లు...ఎళ్ళెళ్ళెవయ్యా... నాపేరు చెప్పి బఠాణీలు కొనుక్కో" అనడం గుర్తొచ్చింది.

కేవలం ముప్పావలాకు ఇంత దూరం రిక్షాలో తీసుకొచ్చాడు? ఇది కలా? నిజమా? సాకేత్ ఆశ్చర్యంలో నుంచి తేరుకునేలోగానే ఆ రిక్షావాడు జై పాతాళభైరవి అని అక్కడ్నించి వెళ్ళిపోయాడు.

* * *

రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్లాడు. ఓ ముసలావిడ కూచొని వుంది.

"రిసెప్షన్ లో అందమైన అమ్మాయి ఉండాలి కదా" అనుకున్నాడు ఎందుకైనా మంచిదని తన డౌట్ క్లియర్ చేసుకోవడానికి.

"రిసెప్షనిస్ట్ అంటే" "నే...నే...నా య...నా. ఏం కావాలి. సింగిల్ రుమా? డబుల్ ? ఏసి.నా.? నాన్ ఏసినా? దోమలుండాలా? వద్దా?" వణుకుతున్న కంఠంలో అడిగింది. వెంటనే తన వీపు మీద తనే చరుచుకొని ....తూ...తూ... అనుకోని "అవ్వా...ఇక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు?" కుతూహలంగా అడిగాడు సాకేత్.

"సంవత్సరం నుంచి నాయనా...మా అమ్మ చనిపోయాక ఆవిడ డ్యూటీ నేను చేస్తున్నాను." అంది ఆ అరవైయేళ్ళ ముసలావిడ.

వెనక్కు విరుచుకుపడ్డమే మిగిలి ఉంది. సాకేత్ కు, అయినా వెంటనే తేరుకొని "నాకు సింగిల్ రూమ్ కావాలి. దోమాలుండాలా? వద్దా? అని అడిగావు...అదేంటి?" దోమలు వద్దు అనుకుంటే ఎడమవైపు ఉన్న రూమ్ ఇస్తాం. దోమలున్న గది కావాలంటే మరుగుదొడ్లను ఆనుకొని వున్న రూమ్ ఇస్తాం...దోమలున్న రూమ్ అయితే నాలుగు రోపాయలు...మంచి రూమ్ కావాలంటే ఎనిమిది రూపాయలు. ఏ.సి. కావాలంటే పదిహేను రూపాయలు...అడ్వాన్స్ అక్కర్లేదు." చెప్పింది రిసెప్షనిస్టు అవ్వ.

ఇంకావుంది