Goppalu Cheppukovadam

Goppalu Cheppukovadam 

సుందరం, లింగం..ఇద్దరూ ఒక చోట కూర్చుని గొప్పలు మాట్లాడుకుంటున్నారు.

" ఒరేయ్ లింగం...నేను మొన్న సముద్రం దగ్గరికి వెళ్లి గాలం వేస్తే...ఒక చేప గాలంలో చిక్కుకుంది.దాని బరువు రెండున్నర టన్నులు. అది బంగారపు రంగులో కాంతివంతంగా మెరిసిపోతుంది. దాని పొడువు వంద అడుగుల పైనే ఉంటుంది. దానిని చూసిన వాళ్ళంతా అద్బుతం అని అన్నారు " అని గొప్పగా చెప్పాడు సుందరం.

" అందులో అంత అద్బుతం ఏముందిరా ? నేను నిన్ననే మా బావిలో గాలం వేశాను. నీకు మా బావి లోతు తెలుసు కదా! ఇరవై మైళ్ళు. గాలం బావి అడుగు వరకు వెళ్ళిపోయింది. అప్పుడు దానికి ఒక లాంతరు తగిలింది. ఆ లాంతరుకు ఒక చీటి కట్టి ఉంది." అని గొప్పగా లింగం చెప్పుతుండగా, మాట మధ్యలో సుందరం కల్పించుకుని " అందులో వింతేముందిరా " అని పకపక నవ్వాడు.

" ఆ నవ్వు ఆపి వింటే నీకే తెలుస్తుంది " అని చెప్పడం మొదలు పెట్టాడు లింగం.

" ఆ లాంతరు అశోకుడు కళింగయుద్దంలో పాల్గొన్న నాటిదని రాసి ఉంది. అది ఇంకా వెలుగుతూనే ఉంది...ఆ వెలుతురులోనే ఒక నవల కూడా చదివాను " అని చెప్పడం పూర్తీ చేశాడు లింగం.

ఐదు నిమిషాలు ఇద్దరి మధ్య మౌనం. ఆ తరువాత సుందరం నోరు విప్పి " నేను ఒక టన్ను బరువు తగిస్తాను.నీ లాంతరు నిన్నటితో ఆరిపోయిందని చెప్పు. అలా అయితే మనం చెప్పేవి వాస్తవానికి కొంతైన దగ్గరగా ఉంటాయి " అని అన్నాడు.

తలదించుకుని " అలాగే " అన్నాడు లింగం.