తాతా ధిత్తై తరిగిణతోం 35

తాతా ధిత్తై తరిగిణతోం 35

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials Taataadhithai tadiginatom, telugu serial comics and   latest jokes online

 

"ఆ విషయం చెప్పాలనే వచ్చాను అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనుకుందంటే ఆ కుర్రాణ్ణి అదేంతగా ప్రేమించిందో అర్థం చేసుకున్నాను అదృష్టం బావుంది, దాన్ని నేనెంత అల్లారుముద్దుగా పెంచానో? దాన్ని ముచ్చట్లు తీర్చటం కన్నతండ్రిగా నాబాధ్యత వాళ్ల అమ్మే బ్రతికివుంటే ఎలా పెంచేదో ఈ పరిస్థితిలో ఎలా నచ్చచెప్పి ఒప్పించేదో? నేను మాత్రం దాని మనసు నొప్పించలేను అందుకే దాన్ని ఆ శ్రీరామ్ కి కిచ్చి పెళ్ళి జరిపిస్తాను.

షాక్ నించి తేరుకోలేక అలాగే చూస్తూ, వింటున్నాడు హనుమంతు.

విష్ణుమూర్తి సోఫాలోంచి లేని అతన్ని చేరుకొని రెండు చేతులూ పట్టుకుని మళ్లీ చెప్పాడు.

"గోపాలానికిచ్చి చేయాలని ఆశపడిన మాట వాస్తవం కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆడిన మాట తప్పవలసివస్తోంది ఏమీ అనుకోకు మీరు ఇప్పుడూ, ఎప్పుడూ నావాళ్లే. మీ గోపాలం అల్లుడు కాలేకపోతున్నాడన్న మాటే గానీ నాకు మేనల్లుడే. మీరు ఇక్కడే వుండవచ్చు గోపాలం నాకంపెనీ వ్యవహారాలూ చూడచ్చు ఈ విషయం చెప్పాలనే వచ్చాను." అంటూ, హనుమంతు సమాధానానికి కూడా ఎదురు చూడకుండా ఆ గదిలోంచి బయటకు నడిచాడు.

*          *         *

వసారా గదిలో వాతావరణం గంభీరంగా వుంది. చేతులు వెనకాలకు పెట్టుకుని వసారా అంతా అటూ ఇటూ కాలుకాలిన పిల్లిలా కలయతిరుగుతున్నాడు వీరభద్రం.

వంటింటి గుమ్మం దగ్గర గోడవారగా నిలబడి, చేటలో బియ్యం బాగుచేస్తోంది పార్వతమ్మ.

గదిలో మధ్యగా వున్న చెక్క కుర్చీలో తలవంచుకుని కూర్చున్నాడు శేషగిరి రెండు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి ఆ తర్వాత, వీరభద్రం వచ్చి శేషగిరికి ఎదురుగా కూర్చున్నాడు.

"తానొకటి తలిచిన దైవమొకటి తలచునన్నమాట అక్షర సత్యమని ఇప్పుడు రుజువైనది శేషగిరీ." అన్నాడు వీరభద్రం గాఢంగా నిట్టూర్చి.

"మీరు తలచుకుంటే ఆ దైవాన్ని కూడా ఎదిరించగలరు బావగారూ! ఈ ఇంట్లో మీ మాటకు తిరుగులేదని నాకు తెలుసు. మీ పట్ల పిల్లలు ఎలాంటి భయభక్తులు ప్రదర్శిస్తారో కూడా చాలాసార్లు గమనించాను ఈ నాలుగేళ్లనించీ మీకు దూరంగా టౌన్లో వుండి చదువుకున్నాడు కనుక 'ప్రేమా గీమా' అంటూ శ్రీరామ్ కొంచెం చొరవగా మాట్లాడివుండవచ్చు. అంత మాత్రం చేత మొదట్నుంచీ అనుకున్న సంబంధాన్నీ మన బాంధవ్యాల్నీ ఒదులు కోవటం భావ్యమంటారా చెప్పండి? అయినా మీరు గట్టిగా కళ్ళెర్రచేసి చెప్తే శ్రీరామ్ మీ మాటను కాదనడన్న నమ్మకం నాకుంది బావగారూ!" ప్రాధేయపూర్వకంగా చూస్తూ చెప్పాడు శేషగిరి.

నిజానికి 'బావగారూ అని వీరభద్రం చేత శేషగిరి పిలిపించుకోవాలి కాని వీరభద్రం పట్ల వున్న భయభక్తుల కారణంగానో శేషగిరి, వీరభద్రాన్ని 'బావగారూ' అని మర్యాదపూర్వకంగా పిలుస్తూంటాడు.

అతను చెప్పిన మాటవిని ఆలోచిస్తూండి పోయిన వీరభద్రాన్ని గమనించి శేషగిరి మళ్లీ అన్నాడు.

"ఆనాడు మీ చెల్లెలి కిచ్చిన మాట తప్పుతారని నేను ఏనాడు అనుకోలేదు బావగారూ."

"నిజమే శేషగిరీ. నా సోదరికి ఆనాడు మాట ఇచ్చిన సంగతి వాస్తవమే! ఇచ్చిన మాట తప్పుట మా రావుబహద్దర్ల వంశమున లేదు గాక లేదు పిల్లల ఆలోచనా విధానాల్లో ఈనాడు మార్పులు సంభవిస్తున్నాయి. ఒకప్పుడు తల్లితండ్రుల మాటను పిల్లలు శిరోధార్యంగా గౌరవించేవారు. కానీ ఇప్పుడు పిల్లల మాటను పెద్దలే వినవలసిన పరిస్థితి ఏర్పడింది వినకున్నచో ఇల్లు విడిచిపోవటం, ఆత్మహత్యలకు పాల్పడటం వంటి దుష్కృత్యములకు పాల్పడుతున్నారు అందుకే మా కుమారుడి మాట మన్నించవలసి వచ్చింది." చెప్పాడు వీరభద్రం.

శేషగిరి నిస్సహాయంగా చూశాడు ఇలా జరుగుతుందని అతను ఊహించకపోవటం వల్ల ఒకవైపు బాధా, మరోవైపు ఉక్రోషం అతని మనసును అల్లకల్లోలం చేశాయి. ఇంత కాలంగా, తాను తెగిన గాలిపటంలా తిరుగుతున్నా తనకున్న ఒక్కగానొక్క కూతురికీ భవిషత్తులో ఓ మంచి ఆసరా దొరుకుతుందన్న నిశ్చంతలో వున్నాడు. ఇప్పుడు ఈ సంబంధం కాకపోతే తన కూతురు భవిష్యత్తు ఏం కావాలి? ఆ ఆలోచనను అతను భరించలేకపోతున్నాడు. పక్కనే వున్న పార్వతమ్మ దగ్గరకు నెమ్మదిగా నడిచాడు.

"మీరైనా నాబాధను అర్థం చేసుకోండి అక్కయ్యగారూ." అన్నాడు ఆర్థింపుగా.

"మా ప్రయత్నాలు మేం చేసిన తర్వాతనే మీకు కబురు పెట్టాం తమ్ముడు గారూ తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపించకపోతే మమ్మల్నీ ఈ ఇంటినీ విడిచిపోతానంటూ బెదిరించాడు మావాడు. ఇంటికి పెద్దవాడు రేపు మరింత వయస్సు మళ్ళిం తర్వాత మమ్మల్నీ చూసుకోవాల్సిన వాడు వాణ్ణి ఎలా వదులుకోగలం చెప్పండి.? అందుకే మేం తలవంచక తప్పలేదు. అయినా మీ అమ్మాయికి మా వాడు కాకపోతే మరో కుర్రాడు దొరక్కపోతాడా? త్వరలోనే ఓ మంచి సంబంధం చూసి ఆ ముచ్చట కూడా జరిపిద్దాం అందుకు మీ బావగారు కూడా నడుం కట్టుకుంటారు. మీరు నిశ్చంతగా వుండండి." అని చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోయింది పార్వతమ్మ.

శేషగిరి నిశ్చేష్టడై మిగిలిపోయాడు.

వీరభద్రం అతని దగ్గరగా వచ్చి భుజం మీద చేయివేసి చెప్పాడు.