Rating:             Avg Rating:       382 Ratings (Avg 2.92)

తాతా ధిత్తై తరిగిణతోం 24

తాతా ధిత్తై తరిగిణతోం 24

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

 Read and enjoy latest telugu comedy serials, telugu funny serials with funny images

 

శ్రీరామ్ గాభరాగా చూస్తూనే వున్నాడు. రెప్పపాటులో, అతన్ని తప్పించుకుని బలంగా అతని మెడమీద ఓ దెబ్బ వేసిందామే. ఆ హఠాత్పరిణామానికి తట్టుకోలేక వాడు వెనక్కి తూలి పడ్డాడు. ఈ లోగా రెండోవాడు ముందుకు దూకి అశ్వని చురుగ్గా ఆమె వెనక్కి తప్పించుకుని వాడి వీపుమీద బలంగా తన్నింది.
ఇప్పుడు ఇద్దరూ కలసి అస్వినిపై తిరగబడ్డారు.
చుట్టూ జనం పోగయ్యారు.
'కరాటే' స్టయిల్లో వాళ్ళిద్దర్నీ తిప్పికొట్టి వాళ్ళ చేత మట్టి కరిపించింది. వాళ్ళు కాళ్ళకు బుద్ధి చెప్పారు. శ్రీరామ్ అలాగే నిలబడిపోయి సినిమా చూస్తున్నట్టుగా కళ్ళప్పగించి ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు.
"అసలేం జరిగిందీ?" చేతులు దులుపుకుంటూ అతన్ని చేరుకున్న అశ్విని అడిగింది. విషయమంతా ఆమెకు వివరించాడు శ్రీరామ్.
కారు హాస్టల్ దగ్గర ఆగింది. డోరు తెరవబోయాడు శ్రీరామ్ అతని చేతిమీద తన చేయి వేసింది అశ్విని.
"నన్ను మర్చిపోవుగా?" అతని కళ్ళల్లోకే చూస్తూ దీనంగా అడిగింది.
'మర్చిపోనని' చెప్పాలనుకున్నా ఎందుకో పెదవి విప్పి మాట్లాడలేక, ఆమెవైపు అలాగే, ఆరాధనాభావంతో చూస్తూండి పోయాడు.
"రామ్! నేను మాత్రం నిన్ను మర్చిపోలేను ఎందుకంటే, ఏనాడో నేను మానసికంగా నీదాన్నయిపోయాను కనుక. వేరెవరినైనా పెళ్లి చేసుక్కునా నేను సుఖపడలేను. అతన్ని సుఖపెట్టలేను! అందుకే ఈ జీవితానికి ఇలాగే వుండిపోవాలని నిశ్చయించుకున్నాను."
ఆమె తనను బెదిరిస్తోందో, లేక మనస్పూర్తిగా తన నిర్ణయాన్ని చెప్తోందో అర్థం చేసుకోలేక పోయాడు శ్రీరామ్.
"శ్రీరామ్! నాదో చిన్న రిక్వెస్టు!" వెంటనే అందామె మళ్లీ.
ఏమిటన్నట్టు చూశాడు.
నీ పెళ్లికి దయుంచి నన్ను పిలవద్దు. నాకు శుభలేఖ కూడా అసలు పంపొద్దు!" అయోమయంగా చూశాడతను.
"ఎందుకంటే నాకెంతటి ధైర్యసాహసాలున్నా నేనెంత మొండిఘటాన్నైనా నీ భార్య స్థానంలోకి వేరెవరో వచ్చేశారన్న 'ఫీలింగు'ని నేను భరించలేను. ఆ దృశ్యాన్ని చూసి, నా ఈ చిన్న గుండె తట్టుకోలేదు."
ఆమె కళ్ళల్లో కనిపించిన కన్నీటిని చూసి శ్రీరామ్ కదిలిపోయాడు.
"నన్ను క్షమించు అశ్వినీ! నేను అసమర్థుణ్ణి. పిరికివాణ్ణి! అంతేకాదు నువ్వంటే ప్రేమలేక కాదు! ఐ లవ్ యూ వెరీమచ్! కానీ నా బలహీనతేమిటో నీకు తెలుసు." మళ్లీ పాతపాటే, కొంచెం కొత్త బాణీలో పాడేడు.
అంతలో, ఏదో ఆలోచన వచ్చిన దానిలా అతని అతని వైపు సూటిగా చూసి అడిగిందామె.
"పోనీ ఓ పని చేస్తే?"
"ఏమిటి?"
"మీ నాన్న గారితో మన ప్రేమ గురించి కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేసి పెళ్లికి ఒప్పించే ధైర్యం నీలో కలిగిస్తే?"
"ఇంపాజిబుల్! అనవసరంగా కుండ బద్దలవుతుందే తప్ప నాలో ధైర్యం కలగదు."
"నేను కలిగిస్తాను" ధృడమైన స్వరంతో చెప్పిందామె.
"నువ్వా? ఎలా?"
"తావీజ్ మహిమ!"
"అంటే?" అర్థం కాలేదతనికి
"రసూల్ బాబా దగ్గర తాయెత్తు తీసుకుని కట్టుకో! నీక్కూడా ధైర్య సాహసాలూ శక్తియుక్తులూ వస్తాయికదా?"
"వస్తే...?"
"ఏముందీ? ధైర్యంగా మీ నాన్నగారితో చెప్పేసి 'కన్విన్స్' చేయచ్చు!" శ్రీరామ్ ఆలోచనలో పడ్డాడు.
'అశ్వినిని పెళ్లిచేసుకుంటే బావుండునని తన మనసు పొరల్లో ఎక్కడో కోరిక లేకపోలేదు పైగా తన మేనత్త కూతురు శ్యామసుందరి సంసారపక్షంగా వున్నప్పటికీ అశ్వినితో పోల్చి చూస్తే అన్నివిధాలా తక్కువే. అశ్వినికి చదువుంది. అందముంది. అన్నింటికీ మించి కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు.
తన తండ్రి చాదస్తం వల్లా మూర్ఖత్వం వల్లా చిన్నతనం నించీ ఆయన పట్ల ఏర్పడ్డ భయభక్తుల వల్లా కాళ్ళదగ్గరకొచ్చిన 'కనక మహాలక్ష్మీ' లాంటి అశ్వినిని ఇంతకాలంగా, కాదు పొమ్మంటున్నాడు తను.
'అసలు పెళ్ళి చేసుకునేది జీవితంలో సుఖపట్టానికే కదా? జీవితంలో రాజీ పడేందుకు కాదుగా? ఎవరి ఇష్టాయిష్టాల కో తల వంచే కంటే తాను మనసుపడే అమ్మాయిని చేసుకోవటంలో తప్పేమిటీ? ఈ లోకంలో ఎంతమంది ప్రేమించి పెళ్లి చేసుకోవటంలేదూ?'
'ఇప్పుడు రసూల్ బాబా ఇచ్చే తావీజు కట్టుకుంటే తన అదృష్టం మారిపోవచ్చు తన వ్యక్తిత్వం కొత్త మలుపులు తిరగచ్చు.'
కానీ మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? ఏమో ఏ పుట్టలో ఏ పాముందో. ప్రయత్నించటంలో తప్పులేదుగా? తాను చేసే సాహసానికి తండ్రి తలవంచితే అశ్విని తన స్వంతమవుతుంది బెడిసికొడితే తన స్యామసుందరి తనకు ఎలాగూ వుంటుంది.
అలా ఆలోచనల ప్రవాహంలో కొన్ని క్షణాలు కొట్టుకుపోయి తర్వాత అడిగాడు శ్రీరామ్.
(ఇంకావుంది)
(హాసం వారి సౌజన్యంతో)