Rating:             Avg Rating:       547 Ratings (Avg 2.94)

మధు మోహం అను చక్కెర వ్యాధి

మధు 'మోహం ' అను చక్కెర వ్యాధి

- జనార్ధన మహర్షి

సూపర మార్కెట్ లోకి అడుగుపెడుతున్న పురుషోత్తం చాలా డల్లుగా ఉన్నాడు. పెళ్ళాం మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి.

“ మర్యాదగా చెప్పండి. మీకు పక్కింటి మధుమతి మీద కన్ను పడింది కదూ " అని నెలరోజులగా ప్రాణం తీసేస్తోంది.

“ ఈ పక్కింటి మధు ఎవరో బాబు " అని తెగ టేంక్షన్ పడిపోతున్నాడు పురుషోత్తం. దురదృష్టవశాత్తు.... ఒక రోజున సరదాగా మార్నింగ్ వాక్ చేద్దామని డాబా మీదకి వెళ్ళిన పురుషోత్తంని చూసి, పక్కింటావిడ తలస్నానం చేసి వచ్చి జుత్తు ఆరబోసుకుంటూ నవ్విందంట.... అది ఆయన గారి పెళ్ళాం కంట పడింది. నిజానికి కథ ఇంతకుమించి ఏం లేదు. ఆ రోజు నించీ ప్రాణం తీసేస్తోందీవిడ.

“ మీకేం కావాలి సార్ ? ” అడిగాడు సూపర్ మార్కెట్ అతను.

“ పక్కింటావిడ " అని నాలుక్కరుచుకొని, “ రెండు కిలోల షుఘర్ "! అంటూ పురుషోత్తం ఒక్క అడుగు వేశాడు. అంతే... కళ్ళు తిరిగాయి. కాళ్ళు బ్యాలెన్స్ తప్పాయి. అమాంతం కిందపడ్డాడు.

** ** **

సూపర మార్కెట్ లో పడ్డ వ్యక్తీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ లో లేచాడు. ఎదురుగా డాక్టర్, బ్లడ్ రిపోర్ట్స్ చూస్తూ... నవ్వాడు. పురుషోత్తం కంగారుగా... “ ఏమైంది సార్ "

“ అబ్బే ఏమి లేదు... మీరు సూపర్ మార్కెట్ కీ ఎందుకు వెళ్లారు? ”

“ షుఘర్ కోసం "

“ ఇప్పుడు మీక్కూడా అదే వచ్చింది.” అన్నాడు డాక్టర్ కూల్ గా నవ్వుతూ.

“ ఏంటి ? ” అన్నాడు పురుషోత్తం బెంగగా.

“ అవును సార్... ఇక మీరు షుఘర్ కోసం ఏ సూపర్ మార్కెట్ కీ వెళ్ళక్కర్లేదు. మీ బాడీనే ఓ

షుఘర్ ఫ్యాక్టరీ " పురుషోత్తం కి చాలా భయం వేసేసింది.

“ అసలు షుఘర్ ఎలా వస్తుంది ? ” సీరియస్ గా అడిగాడు. “ చెరుకునించి...” డాక్టర్ నవ్వుతూ అన్నాడు.

పురుషోత్తం కి కడుపు మండిపోయింది. కానీ తన పెళ్లాన్నే భరిస్తున్న వాడికి... ఈ కోపం ఒక లెక్కా. అందుకే వస్తున్నా కోపాన్ని హాయిగా దాచేసుకుని.... “ గురూజీ... నేనేడుగుతోంది... ఈ షుగర్ నా ఒంట్లోకి ఏలా వచ్చిందని !? ” అని అడిగాడు.

డాక్టర్ మళ్ళీ నవ్వుతూ.... “ మీ తాతగారికో, మీ నాన్నగారికో ఆల్రెడీ ఉండి ఉంటుంది మీక్కొంత ఇచ్చి ఉంటారు.” అన్నాడు. పురుషోత్తంకి ఠక్కున వాళ్ళ నాన్న గుర్తుకు వచ్చాడు.

“ రేయ్... నేను పోయే లోపల నీకు ఏదో ఒకటి ఇచ్చేసి వెళతానురా " అనే వాడు. ఏదో ఒకటంటే... ఇళ్ళు అనుకున్నాడు గానీ ఇలా ప్యాక్టరీ (షుగర్) ఇస్తాడనుకోలేదు. దిగాలు పడి లేచాడు. డాక్టర్ నవ్వుతూ " అంత దిగులు పడిపోకు.... రోజూ తినే తిండి కాస్త తగ్గించు....” అన్నాడు.

“ నేనసలు సరిగ్గా తిండి తినను సార్. ఎందుకంటే మా ఆవిడ వంట చెండాలంగా చేస్తుంది... వడ్డిస్తూ ఏవో చెత్త మాటలు మాట్లాడుతూనే ఉంటుంది. దాంతో నాకు అన్నం దిగదు.”

“ వెరీగుడ్... కుదిరితే... మీ ఇంటి డాబా మీద ఎక్సర్ సైజ్ లు చెయ్యి ...”

“ వద్దు సార్... ఒక్కసారి డాబా ఎక్కినందుకే... నెల రోజులుగా మా ఆవిడ నన్ను నంజుకు తింటోంది.” “ తీపి పదార్థాలు తినకండి... తీపి మాటలు వినకండి "

“ నాకా అదృష్టం పెళ్లితోనే పోయింది ? ” డాక్టర్ ఆశ్చర్యంగా పురుషోత్తం కేసి చూశాడు.

** ** **

ఆ వీధిలో చాలామందికి పురుషోత్తంకి షుగర్ వచ్చిందన్న వార్త తెలిసిపోయింది. కొందరు జాలి చూపించారు. కొందరు ధైర్యం చెప్పారు. కొందరు తమలో మెంబర్ అయినందుకు ఆనంద పడ్డారు. అతని షుగర్ వార్త వీధంతా తెలిసినా, తన పెళ్ళానికి తెలీకుండా ఉండటానికి పురుషోత్తం విశ్వ ప్రయత్నం చేశాడు.

ఎందుకంటే.... సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటేనే " ఏంటేప్పుడూ రోగిష్టివాడిలా అలా నీరసంగా ఉంటావని " గేలిచేస్తే పెళ్ళానికి షుగర్ విషయం తెలిస్తే... మరింత కామెంట్ చేస్తుందని భయం. కానీ... దురదృష్టం... ఆ రోగం విషయం అతని పెళ్ళానికి తెలిసి పోయింది. కానీ వెరైటీగా తెలిసింది. అదెలాగంటే.....

ఓ రోజు ఇంట్లోకి వస్తున్న పురుషోత్తంని గేట్ బయట ఆపి ఆ వీధి చివర ఉండే తెలుగు మాష్టారు బాధగా అడిగాడు. “ మధు మోహం ఆటగా " అని ( మధు మేహం అనటంలో తప్పుదొర్లింది - తెలుగు మాష్టార్ కదా ) ఆ మాట పెళ్ళాం చెవిన పడింది. పురుషోత్తం " అవును " తలూపాడు. ఆ ఊపడం పెళ్ళాం కంట కూడా పడింది.

“ ఓరి చచ్చినోడా!.... నీ మధు మోహం విషయం ఊరంతా తెలిసిపోయిందా. ఎంతకు బరి తెగించావురా... పైగా దాని మీద మోహం ఉందని సిగ్గు లేకుండా తలూపుతూ చెబుతావా!? ” అన్న పెళ్ళాం మాటలకి షాక్ తిన్నాడు పురుషోత్తం.

“ మధుమోహం " అంటే పక్కింటి మధు మీద మోహం అనుకుంది పెళ్ళాం అని 'తెగ' బెంగ పడిపోయాడు పురుషోత్తం. బెంగతోపాటు టేంక్షన్, కోపం చిరాకు వచ్చాయి. ఆ టేంక్షన్ లో పురుషోత్తంకి వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చింది. సర్రున స్కూటర్ ఎక్కి.... హోం ఏజ్ లో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లాడు.

** ** **

హోం ఏజ్ లో ఉన్న పురుషోత్తం అమ్మకి ఒక్కసారిగా ఆనందం పొంగింది. చాలా రోజుల తర్వాత తనని చూడటానికి వచ్చిన కొడుకుని చూసి! వచ్చీరాగానే... పురుషోత్తం తల్లిమీద రెచ్చిపోయాడు. “ నాకు షుగర్ వచ్చిందే... మీ ఆయన పుణ్యం...” అన్నాడు.

తల్లి లాగి పెట్టి కొట్టింది. “

మా ఆయనకే రోగాలు లేవురా...” బిత్తరపోయి చూశాడు పురుషోత్తం. “ నీకు ఒక్క షుగరే కాదురా... బి. పి... హార్ట్ ఎటాక్ కూడా వస్తాయి.” ఆవేశంగా అంది తల్లి. పురుషోత్తం షాక్ అయ్యి తల్లికేసి చూశాడు.

“ నువ్వసలు తల్లి వేనా ? ”

" కొడుకుని నిన్ని శాపనార్థాలు పెడతావా "

“ నువ్వసలు నా కొడుకులా ఎప్పుడున్నావురా? ” పురుషోత్తం ఏం మాట్లాడలేదు. నిజమే. పెళ్లి అయ్యాక పెళ్ళాం మాటలు విని తల్లిని దూరం చేసుకున్నాడు. తల్లి అంది పురుషోత్తం కేది చూస్తూ...

“ రేయ్ నీ ఒంట్లోని షుగర్ కి కారణం... మీ నాన్న కాదురా. నీ పెళ్ళాం ". షాక్ అయ్యాడు పురుషోత్తం.

“ పెళ్ళాం పెట్టే టేంక్షన్స్ ని భరించావ్.... అందుకే నీకీ రోగం వచ్చింది. పెళ్ళాయాక... తియ్యటి దాంపత్యాన్ని అనుభవించాల్సిన నువ్వు... బానిసత్వం అనుభవిస్తున్నావ్... మొగుడిలా కాక పనోడిలా పడి ఉన్నావ్.” పురుషోత్తం తల దించుకున్నాడు.

ఇంతలో తల్లి తేరుకొని, వెంటనే మళ్ళీ మాములుగా... “ నీ బాధ చూడలేక నా బాధ కక్కేశాన్రా ఏం అనుకోకు " అంది. ఆమె కళ్ళలో నీళ్ళు చూశాడు పురుషోత్తం.

మళ్ళీ వెంటనే " రేయ్...నాన్నా... ఆరోగ్యం జాగ్రత్తరా " అంది, గద్గదస్వరంతో. ఈసారి పురుషోత్తం కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

** ** **

లోపలికి వస్తున్న పురుషోత్తంని... ఇంటి బయటే నిలదీసింది. అతని పెళ్ళాం.

“ ఏంటి నీకు షుగర్ వచ్చిందటగా " పురుషోత్తం లాగి పెట్టి కొట్టాడు.

“ వచ్చింది షుగర్ కాదు - మా అమ్మ " అని వెనక్కి తిరిగి తల్లికేసి... “ రామ్మా" అన్నాడు తియ్యగా.