Read more!

 

నవ్వించగల సెన్సార్రథం

1 వ భాగం

రావికొండల రావు

చాలా ఏళ్ళ క్రితం "శంకర్స్ వీక్లీ " లో ఓ కార్టూన్ పడింది. ఫిలిమ్ సెన్సార్ ఆఫీసులో, ఆఫీసర్ చేతిలో ఫిలిమ్ రీలు పెట్టుకని, కళ్ళు విశాలం చేసుకుని వెర్రి ఆనందంతో చూస్తూ వుంటాడు వెనకాల వున్నా గుమాస్తా! " సార్...ఈ సినిమా ప్రొడ్యూసర్లు నిరీక్షిస్తున్నారు కట్స్ చెబితే వెళ్లిపోతారట " అంటాడు.

" ఉండవయ్యా! ఈత దుస్తుల్లో వున్నఈ అమ్మాయిని కాస్సేపు చూసి కట్స్ చెప్తా " అని అంటాడు ఆఫీసర్.

" అందుకేనేమో చాలామంది సెన్సార్ బోర్డుమెంబర్లు కావాలని ప్రయత్నిస్తూ వుంటారు అన్ సెన్సార్డ్ సినిమాలు చూసేవాళ్ళు వాళ్ళే కదా !" అన్నారు సరదాగా పింగళి నాగేంద్రరావుగారు పానగల్ పార్క్ సమావేశంలో.

" వాళ్ళు చూస్తే చెడిపోరా ? మనం చూస్తే చెడిపోతామా ? అన్నారు ఆయనే చమత్కారం మిళాయించి హాయిగా పింగళి నవ్వు నవ్వుతూ. సినిమాలు పుట్టిన కొన్నేళ్ళదాకా సెన్సార్ గొడవలేదు. నిశ్శబ్ద చిత్రాలు యధాతధంగా విడుదలైపోయేవి. పైగా ఒక తమాషా ఏమిటంటే అమెరికన్ సినిమాల్లో అసభ్యత, ఆశ్లీతం ఎక్కువగా వుందని ఆ దేశంలో సెన్సారింగ్ వచ్చేసింది. మన దేశంలో లేదు గనుక సెన్సార్ కాని అసలు సిసలు సినిమాలే వచ్చి ఆడేటివి.

ఇంకేముంది. ప్రేక్షకుల కళ్ళకి కావలసినంత పంట! దీనిని ఆపకపోతే అది దేశ సంప్రదాయ వ్యవస్థని మత కలుపుతుందని సెన్సారింగ్ కావాలని పెద్దలు, పార్లమెంటేరియన్లూ (అప్పుడు వుండేవారు) పట్టుబట్టి ''సినిమెట్రో గ్రాఫ్ యాక్ట్ '' పేరుతో సెన్సారింగ్ ప్రవేశపెట్టారు. అది మనదేశ సినిమాలకి కూడా వర్తిస్తుందన్నారు. కమిషనర్ ఆఫ్ పోలీసు, జిల్లా మేజిస్ట్రేట్లూ ఆ సినిమాలు చూసి ప్రజలు చూడతగ్గవి వుంచి తక్కినవి కోసిపారేసేవారు.

ఆ కోతలో కోయ్యబడిన సినిమాయే అసలు సినిమా. మనకింకో గొడవ కూడా వుంది. బ్రిటీష్ పాలన, స్వరాజ్య ఉద్యమం సినిమా ప్రభుత్వాన్ని విమర్శించరాదు. అందులో జాతీయ భావాలు ఉండరాదు. జాతి, మత వైషమ్యాలు కూడా వుండేవి గనుక ఒక హిందువు, ఒక ముస్లిమ్, ఒక విద్యాధికారి సెన్సార్ సమితిలో సభ్యులుగా వుండేవారు. జాతీయ భావాలున్న పుస్తకాన్నీ నాటకాల్నీ ఎలాగూ ప్రభుత్వం నిషేధించింది.

అంచేత పురాణ చిత్రాల్లోనే వీలైనంత వరకూ జాతీయ భావాలు వచ్చేలా (శబ్దరహిత చిత్రాలే) చూసుకునేవారు నిర్మాతలు. అప్పుడే ఒక తమాషా జరిగింది. ''భక్తవిదుర్'' 1921 లో అని భారత కథ సినిమాగా వచ్చింది. పురాణ కథ కదా అని ఏం పట్టించుకుంటార్లే అని విదురుడిని గాంధీజీలా తయారుచేశారు. మోకాళ్ళ మీదికి పంచె, కర్రతో వుంటాడు విదురుడు. తలమీద గాంధి టోపీ కోదా పెట్టారు.

విదురనీతులన్నీ జాతీయ భావాలతోనూ స్వరాజ్యానికి సంబంధించి వుంటాయన్నా మాట. శబ్దం లేదు గనుక కొంత అక్షరాల్లో చూపించారు. కొంత వ్యాఖ్యానింపజేశారు. సెన్సార్ వాళ్ళు ఆ సినిమా చూసి మొత్తం విదురుని కత్తిరించమన్నారు. అప్పుడా గాంధీ విదురున్ని తీసేసి భారత విదురుడిలాగా గడ్డాలూ మీసాలూ పెట్టి మళ్ళీ షూట్ చేశారట! హహహహహ..........హహహహహహహహహ....