Home » Ladies Special » ఎపిసోడ్ -48


    నేను చేసినదానికి అతను నా మీద ప్రతీకారం తీర్చుకోవడం ఖాయం. ఆ ప్రతీకారాన్ని అతనెలా తీర్చుకుంటాడు? అందుకు ఒకటే మార్గం.

 

    అది-

 

    "రేప్"

 

    నేను దాన్ని ప్రతిఘటించగలను- ఎదురుదెబ్బ తీయగలను. గానీ నేను అవ్వేవీ ఎందుకు చెయ్యలేదో తెల్సా? నేనతన్ని ప్రేమిస్తున్నాను గాబట్టి. నేనతన్ని విశ్వసిస్తున్నాను కాబట్టి. నిన్ను కన్ సల్ట్ చేసాను. పరిస్థితులన్నిట్నీ నా కనువుగా వుంచుకున్నాను. నేను కోరుకున్నది గర్భవతిని కావడం. నేననుకున్న లక్ష్యాన్ని చేరుకోడానికి నాకు మరో ఆయుధం దొరికింది" మహతి మాటలకు హేమలత షాక్ తింది.

 

    "ఇంట్లోంచి వంటరిగా వచ్చిన ఈ పరిస్థితుల్లో ఈ మానసిక వత్తిడి, దానికి తోడు శారీరక వత్తిడిని నువ్వు భరించగలవా...? అసలు అతన్ని ఈ పైశాచిక చర్యకు నువ్వెందుకు ప్రేరేపించావో, ఆ గర్భాన్ని నువ్వెందుకు కన్ సీవ్ చెయ్యాలనుకుంటున్నావో నాకేం అర్థం కావడంలేదు" అంది హేమలత షాక్ నుంచి క్రమంగా తేరుకుంటూ.

 

    "అన్నీ నువ్వే చూస్తావ్ గా... బైదిబై నాకో చిన్న హెల్ప్ చెయ్యగలవా? ఓ రెండ్రోజులు నీ దగ్గర నేనుంటాను. షెల్టర్ ఇస్తావా?"

 

    "అదేంమాట- రెండ్రోజులు కాకపొతే, ఈ ఏడాదంతా మా ఇంట్లోనే వుండు."

 

    "నీ ఇంట్లో కాదు. నీ ఇంట్లో నేనుంటే రవికిరణ్ అంకుల్ నన్ను ఆత్మీయురాలిలా చూస్తారు. అది నాకిష్టం లేదు. నేను  నీ ఫ్రెండ్ గా ఈ నర్శింగ్ హోంలోనే రెండ్రోజులుంటాను. ఏదో ఉద్యోగం సంపాదించగానే బయటి కెళ్ళిపోతాను.

 

    "నువ్వు మరో ప్రామిస్ చేయాలి- నేను కావాలనే మధుకర్ ని రెచ్చగొట్టి, నన్ను రేప్ చేసేలా పురికొల్పానని, రేప్ జరిగిందని రవికిరణ్ అంకుల్ కి ఎట్టి పరిస్థితుల్లోను చెప్పకూడదు. ఒక లక్ష్యం కోసమే ఇదంతా చేస్తున్నానని నువ్వర్థం చేసుకోవాలి."

 

    "ఏమిటో నాకేం అర్థం కావడంలేదు. అయితే రా..." అంటూ లేచి, నర్సుల కోసం కేటాయించిన రూముల్లో, ఓ రూమ్ ని చూపించింది.

 

    "ఇక్కడ నువ్వు ఎన్నాళ్ళయినా వుండొచ్చు. నీకేవయినా కావలసివస్తే, ఫ్యూన్ వుంటాడు చెప్పు..." అంది ఒకింత బాధగా హేమలత.

 

    తనకు కేటాయించిన గదిలోకెళ్ళి మంచమ్మీద కూర్చుంది మహతి.

 

    తన కార్యక్రమాన్ని ఎక్కడనుంచి ప్రారంభించాలో ఆలోచిస్తోంది.

 

                            *    *    *    *

 

    బ్రేక్ ఫాస్ట్ చేసి వస్తున్నారు మధుకర్, మూర్తి. సీనియర్ స్టూడెంట్స్ అందరూ మధుకర్ అక్కడ ఆ సమయంలో కనబడడంతో ఆశ్చర్యాన్ని మొహమ్మీద పులుముకుని విష్ చేస్తున్నారు.

 

    "ఇంకో మూడ్నెల్లు గడిస్తే డిగ్రీ వచ్చేస్తుంది. ఈ సమయంలో నువ్వు చదువు మానేసి , ఆ పిల్ల ఛాలెంజ్ చేసిందని, నువ్వు ఛాలెంజ్ చేసి, అన్నీ వదులుకొని బాధపడటం మాత్రం నాకేదోలా వుందిరా" అన్నాడు మూర్తి జరిగిందంతా తెలుసుకున్నాక.

 

    రోజూవారీ సగం ఖర్చులు మధుకర్ వల్లే జరిగిపోతాయి. అలాంటి మధుకర్ పాపర్ లా తిరిగితే తనని చూసేవాడెవ్వడు!

 

    "ఎవర్నీ కన్ సల్ట్ చెయ్యకుండా నువ్వీ నిర్ణయం తీసుకోవటం ఏం బాగా లేదురా" మళ్ళీ బాధగా అన్నాడు మూర్తి.

 

    ఇద్దరూ హాల్లోకొచ్చాడు.

 

    మూర్తి జేబులోంచి సిగరెట్ పాకెట్ తీసి ఆఫర్ చేసాడు.

 

    "నో థాంక్స్... మానేసాను."

 

    "అయ్యబాబోయ్... ఒరే మధూ... చాలా అన్యాయంరా. చైన్ స్మోకర్ సిగరెట్ మానేస్తే, సిగరెట్ కంపెనీలేమైపోయాయిరా? చౌరంగీలేన్ మొత్తం మూతబడిపోతుందిరా."

 

    అయినా మధుకర్ మాట్లాడలేదు.

 

    "అయితే ఏం చేద్దామని నీ ఉద్దేశ్యం."

 

    "ఇంకా ఆలోచించుకోలేదు. మన దయాళ్, సురేష్, విజయ్ లతో చెప్పు. రాత్రికి వాళ్ళనిక్కడికి రమ్మను. ఓ రెండ్రోజులు మాత్రమే నీ రూంలో వుంటాను. ఈలోపల నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను. సాయంత్రం కలుస్తాను" ఎప్పుడూ కార్లో, హడావుడిగా వెళ్ళే మధుకర్ అలా సామాన్యుడిలా వెళుతుంటే జాలేసింది మూర్తికి. ప్రపంచంలోని బలహీనతలన్నీ మూర్తికి తెలుసు. కాని ఒక అందమైన అమ్మాయి కూడా- ఆ అమ్మాయి విధించిన షరతులు కూడా బలహీనతలు కావటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అప్పటికి సమయం తొమ్మిది గంటలు అవుతోంది.

 

    సిటీ బస్సెక్కాడు.

 

    యూనివర్సిటీ లైబ్రరీకెళితే అందరూ తననే చూస్తారు. అందుకే చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీకెళదామని నిర్ణయించుకున్నాడు.

 

    ఏం చెయ్యాలో తోచని పరిస్థితుల్లో పుస్తకాల్లోకి చూడు. నీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఎప్పుడో ఎవరో చెప్పినట్లు జ్ఞాపకం, బహుశా తండ్రేనేమో- ఆకస్మాత్తుగా తల్లీ తండ్రి జ్ఞాపకానికొచ్చారు.

 

    ఈ సమయంలో తండ్రి పూజ గదిలో వుంటాడు. తల్లి టిఫిన్ చేస్తూ తన గురించే ఆలోచిస్తుంటుంది. పాపం మదర్... తను వచ్చేసాక బాగా ఏడ్చి వుంటుంది. నారాయణ గూడా స్టాప్ లో దిగి చిక్కడపల్లివేపు నడిచాడు.

 

    అంత ఉదయాన్నే లైబ్రరీకి ఎవరొస్తారు? ఓ అరడజనుమంది వృద్ధులు డైలీ పేపరు సెక్షన్ లో కూర్చుని పేపర్స్ తిరగేస్తున్నారు.

 

    జనరల్ సెక్షన్ లోకి నడిచాడు. ఒక్కసారి ఆ గదిలో కెళ్ళగానే పాత పుస్తకాల వాసన. కాలేజీలో అన్నేళ్ళు చదివినా, ఒక్కసారి కూడా లైబ్రరీకి వెళ్ళలేదు. అలాంటివాడు ప్రత్యేకంగా లైబ్రరీకి రావడం.

 

    తనేం చేయాలో నిర్ణయించుకోడానికి పుస్తకాల్ని రిఫరు చెయ్యడం కోసం తెలుగు విభాగంలోకి రాగానే ఏదో పుస్తకం కనిపించింది.

 

    "రండి. ఈ ప్రపంచాన్ని జయిద్దాం" టైటిల్ ఆసక్తికరంగా వుంది. చేతిలోకి తీసుకుని రీడింగ్ టేబుల్ చుట్టూ వున్న కుర్చీల్లో ఒక కుర్చీలో కూర్చున్నాడు.

 

    విజయం అనేది మనిషిలోని పంతం, పట్టుదలతో ప్రారంభమవుతుంది. పైకి తేవడానికి, నీ శక్తియుక్తుల్ని కేంద్రీకరించినప్పుడు-

 

    నిన్ను ఆపడం-

 

    నీ కడ్డుగా నిలవడం-

 

    ఎవడివల్లా సాద్యం కాదు.

 

    అది మాత్రం గుర్తుంచుకో.

 

    -ఆ చాప్టర్నీ చదివి ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు మధుకర్. గొప్ప ఇన్ స్పిరేషన్, అతని నరంలోకి ప్రవహించింది. ఆ అక్షరాల్లోని అంతులేని శక్తి అతనిలోకి నడిచివచ్చినట్టయింది. ఈత కొట్టడానికి ముందు, ఈతగాడు ఒడ్డున నిలబడి దమ్ము కూడదీసుకుంటున్నట్టుగా ఉంది అతనికి.

 

    తను అనుకున్నది ఏడాదిలో కాదు- ఆర్నెల్ల కాలంలేనే సాధిస్తాడు.

 

    అవును... సాధిస్తాడు.

 

    తనకా నమ్మకం వుంది.

 

    ఏవేవో అస్పష్టమైన ఆలోచనలు అతని మెదడులో రూపుదిద్దుకుంటున్నాయి. పదినిమిషాలసేపు అతనలాగే వుండిపోయాడు.

 

    నెమ్మదిగా లేచి, ఆ పుస్తకాన్ని యధాస్థానంలో వుంచి, ఇంగ్లీషు విభాగంలో కన్పించిన ఓ పుస్తకాన్ని తీసాడు.

 

    Enterpreneurship and growth of enterprise in Industrial estates.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.