Home » Beauty Care » ఎపిసోడ్ -9


    ఆరాత్రి తన తండ్రి తన దగ్గర బలవంతంగా తొడిగించిన డ్రాయరు విప్పే మూడ్ లేకపోయింది అతడికి. అది అలా కంటిన్యూ అయిపోయింది. భయపడి, భయపడి కుంచించుకుపోయిన మనస్సు ఉత్తేజం పొందలేకపోయింది.

 

    అరవిందరావు చెప్పినట్టు అతని భార్య ఎప్పటికీ అతనితో వుండిపోలేదు. మూడు నెలలు చూసి ఓపిక నశించిన ఆమె ఓరాత్రి రాత్రి ఒకతనితో లేచిపోయింది.

 

    శ్రీపతి ఆ షాక్ నుంచి తేరుకోకమునుపే అరవిందరావు కూడా మరో లోకానికి టపా కట్టేశాడు.

 

    తండ్రివల్లే తను పడకటింట్లో విజృంభించలేకపోతున్నానని గ్రహించిన శ్రీపతి ఉద్యోగం వచ్చాక చిత్రను పెళ్ళి చేసుకున్నాడు.

 

    అయిదడుగుల అయిదంగుళాల పొడుగుతో పంచకళ్యాణి గుర్రంలా వుండే చిత్రను ఏం చేసుకోవాలో తెలీలేదు అతనికి మొదటిరోజే. ఆమెను చూసి భయపడిపోయాడే తప్ప దగ్గరికి తీసుకోలేకపోయాడు.

 

    తండ్రి తన వెనక నిలబడి పరిహసిస్తున్నట్టే వుంది. ఇద్దరు వస్తాదులు బిగదీసుకు కూర్చున్నట్టు నివసిస్తున్న ఆమె స్తనద్వయాన్ని చూస్తూనే చెమటలు పట్టాయి. అవి చేతులకు లొంగవని ఎందుకనో అనిపించి కరెంట్ షాక్ కొట్టినట్టు చేతుల్ని వెనక్కి లాగేసుకున్నాడు. మత్తుగా వాలిపోతున్నట్టు వుండే కనురెప్పల కింద కోరిక బరువుని టపాటపా కొట్టుకుంటున్న కళ్ళను చూసి వెనక్కి తగ్గాడు. రొమ్ముల దగ్గర్నుంచి నడుం వరకు పచ్చగా విరగపండిన వరిచేలులా కనిపిస్తున్న ఆ భాగాన్ని చూసి స్పృహ తప్పింది అతనికి. యవ్వన సామ్రాజ్యం చుట్టూ వుండే గోడలా చీరకట్టు చూసి తల తిరిగింది. లోతుగా బంగారు గనిలా కనిపిస్తున్న ఆమె బొడ్డును చూసి అతను ఒక్కసారిగా బావురుమన్నాడు.

 

    తన భర్త అంత సడన్ గా ఏడవటంతో ఆమె కంగారుపడింది. ఆమె దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నించిన కొద్దీ అతను దూరంగా జరిగాడు.

 

    ఆమె ఓపిగ్గా చాలారోజుల వరకు భర్తలోని ఫియర్ కాంప్లెక్స్ ని పోగొట్టాలని శతవిధాలా ప్రయత్నించింది. కానీ లాభం లేకపోయింది.

 

    సరిగ్గా ఈ సమయంలో ఆమెకు రాయుడితో పరిచయమైంది. ఓ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సమయంలో ఆమె చీఫ్ గెస్ట్ అయితే రాయుడు అధ్యక్షత వహించాడు.

 

    వలవేసి పట్టడం ఒక్క వేటగాడికే చాతనైనట్టు ఆమె ఏ పరిస్థితుల్లో వుందో, వెంటనే ఆమెకు ఏం కావాలో మొదటి చూపులోనే పసిగట్టాడు రాయుడు.

 

    మరో రెండు రోజులకే ఆమెను పక్కలోకి తెచ్చుకున్నాడు రాయుడు.

 

    ఇక అప్పట్నుంచీ ఆమె అతనికి బానిసైపోయింది. తన సర్వస్వం అర్పించిన రాయుడ్ని ఆమె అభిమానించటం మొదలుపెట్టింది. అతనేం చేస్తున్నాడో ఆమెకు అనవసరం. అతనికి సహాయపడటం, అతను చెప్పినట్టు నడుచుకోవడంలోనే ఆమెకు తృప్తి కనపడింది. అందుకే రాయుడు ఏం చెప్పినా ఆమె చేస్తుంది. ఇది తెలియడంవల్లే ఆమెను అంత అర్జెంటుగా తన గెస్ట్ హౌస్ కి పిలిపించుకున్నాడు రాయుడు.

 

    "నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిపించాను" అన్నాడు రాయుడు అరగంట సుఖం ఇచ్చిన తరువాత.

 

    "తిలక్ గురించా?"

 

    రాయుడు ఒక్కక్షణం షాక్ తిన్నాడు. ఆమె వెంటనే తన మనసులోని మాటను కనిపెట్టడం ఇబ్బందిగా అనిపించింది. కానీ వెంటనే సర్దుకున్నాడు.

 

    "ఎలా పసిగట్టావ్?" అని అడిగాడు పైకి ఎలాంటి భావనను వ్యక్తం చేయకుండా.

 

    "కంటికి నిద్రవచ్చునే, సుఖంబగునే రతకేళి.... అన్నట్టు మీరు ఈ అరగంటా పరధ్యానంగా వుండటం నేను కనిపెట్టలేదనుకోకు. మనకు సరిసమానమైన ప్రత్యర్థి వున్నప్పుడు ఏ సుఖాన్ని ఆస్వాదించలేము"

 

    ఇది ఒప్పుకోక తప్పలేదు రాయుడు. "నిజమే, తిలక్ మీద ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. అతను జైలులో శిక్ష అనుభవిస్తూ తన దురదృష్టానికి చింతిస్తూ కూర్చోడని, ఏదో చేస్తాడని నాకనిపిస్తోంది. అందుకే నువు అతని కదలికలను ఓ కంట కనిపెట్టాలి."

 

    "అంతేగదా! అతని గురించి నాకు ఒదిలేయండి. అయినా జైల్లో వున్నవాడు మిమ్మల్ని ఏం చేస్తాడు?"

 

    "అలా అనకు. ఎన్నైనా చేయవచ్చు. జైలునుంచి పారిపోయి నామీద పగ తీర్చుకోవచ్చు."

 

    "కరెక్టే. నేనెప్పుడూ అతన్ని చూడలేదు. మీరు చెప్పినదాన్ని బట్టి ఏదైనా చేయగల సమర్ధుడనిపిస్తోంది. కానీ జైలునుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు" అంది ఆమె జైలు గురించి బాగా తెలుసు కాబట్టి.

 

    "నేను వాడిని జైల్లో వేయించగా లేనిది వాడు తప్పించుకోవడంలో ఆశ్చర్యమేముంది? పీనల్ కోడ్ పిలకను నా చేతుల్లో వుంచుకుని ఆడిస్తున్నట్టే వాడూ తన తెలివితేటలు వుపయోగించి జైలునుంచి బయటపడవచ్చు."

 

    "కానీ జైల్లో బలమైన నిఘా వుంటుంది. బయటనుంచి ఎవరైనా సహాయం చేస్తే తప్ప తప్పించుకోవడం ఇంపాజిబుల్" నమ్మకంగా చెప్పిందామె.

 

    ఆ మాటలకు రాయుడు పగలబడి నవ్వాడు. "వాడు అనాధ. వాడి గురించి పట్టించుకునేవారు లేరు" అని సంతోషంతో ఆమెను తన మీదకు లాక్కున్నాడు.

 

    ఆమె తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది.

 

    అయితే వాళ్ళిద్దరికీ తెలియని విషయం ఒకటుంది. తిలక్ ను జైలు నుంచి తప్పించడానికి అప్పటికే ఓ అమ్మాయి తన ప్రయత్నాలను ప్రారంభించిందని వాళ్ళు వూహించలేకపోయారు.

 

                                      *    *    *    *

 

    శ్రీపతి పదిన్నరకల్లా జీప్ లోంచి కిందకు దిగాడు.

 

    జైలు మొదట్లో గార్డు రూమ్ దగ్గర ఆయనకోసమే చూస్తున్న హెడ్ వార్డర్ "సావధన్" అని అరిచి సెల్యూట్ చేశాడు. ఆయన వెనక వున్న నలుగురు గార్డులు అటెన్షన్ లో నిలబడ్డారు.

 

    శ్రీపతి వాళ్ళకేసి చూసీ చూడకుండా విష్ చేసి లోపలికి నడిచాడు. ఆఫీస్ లో కూర్చోగానే జైలర్ వామనరావు వచ్చి సెల్యూట్ చేసి "సార్" అంటూ పిలిచాడు.

 

    ఆయన తల పైకెత్తి ఏమిటన్నట్టు చూశాడు.

 

    "ఖైదీలు స్ట్రయిక్ చేస్తున్నారు సార్"

 

    పక్కన బాంబు పడ్డట్టు జడుసుకున్నాడు ఆయన.

 

    "వ్వాట్" రెట్టించి అడిగాడు.

 

    వామనరావు మళ్ళీ అవే మాటలను రిపీట్ చేశాడు.

 

    "స్ట్రయిక్ అంటే...."

 

    "టిఫిన్ తినడం మూసేశారు సార్"

 

    "ఫర్ వాట్"

 

    "తిలక్ ని ఎల్ సెల్ నుంచి బ్యారెక్కుకు మార్చాలని తిలక్ గ్రూపువాళ్ళు సమ్మె చేస్తుంటే, పాత్రలకు కళాయి పోయిందని దాదా గ్రూపువాళ్ళు మంచినీళ్ళు కూడా ముట్టడం లేదు సార్."

 

    "అంటే అప్పుడే తిలక్ గ్రూప్ అనేది ఒకటి ఏర్పడిందన్న మాట" అన్నాడు శ్రీపతి సాలోచనగా చూస్తూ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.