Home » Ladies Special » Post traumatic stress disorder

ఆడపిల్లల మనసుకి గాయం- మరింత తీవ్రం

 


మన దేశంలో ఇప్పటికీ మగపిల్లవాడికి ఉన్న విలువ ఆడపిల్లలకు ఉండదు. చిన్నప్పటి నుంచే సూటీపోటీ మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇక ఒంటరిగా బయటకు వెళ్లిన ఆడపిల్ల తిరిగి ఎంతవరకు క్షేమంగా ఇంటికి తిరిగివస్తుందో చెప్పలేని పరిస్థితి. అందుకనే ఆడపిల్లలకు ఓ 18 ఏళ్లు వచ్చేసరికి, వారికి ఏదో ఒక చేదు అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. మరి ఈ అనుభవం వారి జీవితం మీద ఎలా ఉంటుంది?

 

అడపిల్లలు- మగపిల్లలు:

స్టాన్‌ఫార్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు ఒత్తిడికి సంబంధంచిన దీర్ఘకాలిక ప్రభావాన్ని గమనించేందుకు ఒక 59 మంది పిల్లలను ఎన్నుకొన్నారు. 9 నుంచి 17 ఏళ్లలోపు వయసు ఉన్న వీరిలో ఆడపిల్లలు మగపిల్లలు ఇంచుమించు సరిసమానంగా ఉన్నారు. వీరిలో దాదాపు సగం మంది ఏదో ఒక భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నవారై ఉన్నారు.

 

మెదడు మారింది:

జీవితంలో ఏదో ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నవారి మెదడులో ఎలాంటి మార్పులు వచ్చాయో గమనించిన పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మన భావోద్వేగాలను నియంత్రించే ‘ఇన్సులర్ కార్టెక్స్‌’ అనే భాగం ఆడపిల్లల విషయంలో కుంచించుకుపోగా, మగపిల్లలో ఇది మరింతగా పెరిగిందట. ఫలితంగా ఆడపిల్లలలో Post-traumatic stress disorder (PTSD) ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లు గ్రహించారు. జీవితంలో ఏదన్నా ఊహించరాని ఘటన జరిగిన తరువాత కూడా దాని నుంచి బయటపడలేకపోవడమే ఈ PTSD.

 

PTSD లక్షణాలు:

PTSD మనిషిని తెగ వేధిస్తుంది. నిద్ర పట్టదు, ఆకలి వేయదు, నిరంతరం ఉద్వేగంతో సతమతమైపోతూ ఉంటారు, ఆ సంఘటన తాలూకు ఆలోచనల నుంచి బయటపడలేకపోతుంటారు, నిద్రపోయినా కూడా సంఘటన గురించిన పీడకలలే వస్తుంటాయి. ఈ PTSD లక్షణాలే కాకుండా బాధాకరమైన అనుభవంలోంచి బయటకు వచ్చిన ఆడపిల్లలలో, వయసుకి సంబంధించిన మార్పులు కూడా త్వరగా చోటు చేసుకుంటున్నాయని గమనించారు. దానికి కూడా ‘ఇన్సులర్ కార్టెక్స్‌’లో వచ్చిన మార్పులే కారణం అని ఊహిస్తున్నారు.

 

ఆడబిడ్డలు జర భద్రం:

ఆడపిల్లలను తమ కాళ్ల మీద తాము నిలబడేలా ప్రోత్సహిస్తూనే, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ వారి మనసుకి గాయమైనప్పుడు దానిని ఏమంత తేలికగా తీసుకోకూడదని ఈ పరిశోధన రుజువుచేస్తోంది. వారిలో ఏదన్నా అసహజమైన ఒత్తిడి కానీ, ఆందోళన కానీ కనిపిస్తున్నప్పుడు నిజానిజాలని గ్రహించే ప్రయత్నం చేయడం తల్లిదండ్రుల బాధ్యత. పైగా ఆడపిల్లలు ఏదన్నా చేదు అనుభవాన్ని ఎదుర్కొని, దాని నుంచి బయటపడలేకపోతుంటే... బేషజాలకు పోకుండా మానసిక వైద్యుని సంప్రదించాలి. అన్నింటికీ మించి జీవితంలో ఎలాంటి సమస్యనైనా అధిగమించేందుకు, మన తోడు వారికి ఉంటుందన్న భరోసాని కల్పించాలి.

 

- నిర్జర.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.