Home » Fashion » New Trend Old Fashion
పాత ఫ్యాషన్ తిరిగివచ్చింది
కాలం క్షణకాలం కూడా ఆగకుండా మారిపోతుంటుంది. దాంతో పాటే మన అభిరుచులు కూడా! దాన్నే మనం ట్రండ్ అంటాం. ఇవాళ ఉన్న ట్రెండ్ రేపు ఉండకపోవచ్చు. కానీ.... కానీ.... ఒకోసారి ఆ ట్రెండ్ తిరిగివచ్చేస్తే! పాతికేళ్లనాటి ఫ్యాషన్ మళ్లీ ర్యాంప్ మీద నడిచేందుకు సిద్ధమైపోతే! అలా ఇప్పుడు తిరిగొచ్చి దుమ్ము లేపుతున్న పాత ట్రెండ్స్‌ని ఓసారి చూద్దామా!
Wide legged jeans
నడం కిందకి దిగేకొద్దీ వెడల్పుగా ఉండే జీన్స్ ఓ పాతికేళ్ల క్రితం ఫ్యాషన్. బెల్బాటంను పోలిన ఈ ప్యాంట్స్ ఎంత త్వరగా వచ్చాయో అంతే తొందరగా మాయమైపోయాయి. కానీ ఓ రెండేళ్ల క్రితం ఫ్యాషన్ ప్రపంచంలోకి తిరిగి అడుగుపెట్టాయి. మళ్లీ ఈ ట్రెండ్ మాయమైపోయేలోగా ఓ జత తీసుకునేందుకు మనం తొందరపడాల్సిందే!
Platform sandals
ఎంత ఎత్తు హీల్ ఉంటే అంత ఫ్యాషన్. కానీ హైహీల్స్ గురించి వైద్యులు చెప్పే మాటలు అటుంచితే... నడవడానికి కూడా చాలా అసౌకర్యంగా ఉంటుంది. అందుకేనేమో సోల్ మొత్తం ఎత్తుగా ఉండే ఒకనాటి ప్లాట్‌ఫామ్ చెప్పులని ఫ్యాషన్ ప్రపంచం మళ్లీ వేసుకుని చూసుకుంటోంది.
Bright Sunglasses
సన్‌గ్లాసెస్ అంటే నల్లగానో, ట్రాన్స్పరెంటగానో ఉండే రోజులు పోయాయి. 90వ దశకంలో వచ్చిన నీలం, ఆకుపచ్చ రంగులతో తళతళ్లాడిపోయే కళ్లద్దాలకు మీద మళ్లీ జనం కన్ను పడింది. అంతేకాదు.... ఇప్పుడు కళ్లద్దాలు ఎలా ఉన్నా ఫ్యాషనే! గుండ్రంగా ఉన్నా, బాగా పెద్దగా ఉన్నా, స్టీల్ ఫ్రేంతో ఉన్నా... ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచం అంతా సన్‌గ్లాసెస్‌తోనే ఆడుకుంటోంది.
Brown Lipstick
ఒకప్పుడు ఏ రంగు కావాలంటే ఆ రంగు లిప్‌స్టిక్ పెట్టుకొనేవారు. రానురానూ జనం బుద్ధిగా పెదాల రంగుకి దగ్గరగా ఉండే లిప్‌స్టిక్‌నే వాడుతున్నారు. కానీ ఇప్పుడు పాత ట్రెండ్ తిరిగి వచ్చింది. కాంట్రాస్ట్ లిప్‌స్టిక్‌కి కాలం కలిసొచ్చింది. ముఖ్యంగా బ్రౌన్ రంగు లిప్‌స్టిక్ ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో తప్పనిసరిగా పాటించాల్సిన ట్రెండ్!
Huge Earrings
చెవులకి వీలైనంత పెద్ద బుట్టల్ని వేసుకోవడం చాలా పాత ట్రెండే. దశాబ్దానికోసారి ఈ ట్రెండ్ మారుతూ.... ప్రస్తుతానికి మళ్లీ నిండైన బుట్టల మీదకి జనం మనసు మళ్లింది. సీరియల్స్ దగ్గర్నుంచీ ర్యాంప్ మీద నడకల వరకూ ఇప్పుడు బుట్టల మీదకే దృష్టి మళ్లుతోంది.
ఇవే కాదు... ఒకప్పుడు కుర్రకారుని వెర్రెత్తించిన డెనిమ్ జాకెట్స్, పాత సినిమాల్లో మాత్రమే కనిపించే షోల్డర్ ప్యాడ్స్ (shoulder pads) అన్నీ ఇప్పుడు తిరిగొస్తున్నాయి. కొత్తే కాదు... ఒకోసారి పాత కూడా వింతే అని రుజువుచేస్తున్నాయి.