Home » Ladies Special » ఎపిసోడ్-45


    
    "నా కన్నతల్లీ! జాగ్రత్తమ్మా.....! నాకు కానీ, మన వంశానికి కానీ మచ్చ తెచ్చే పని చెయ్యనని నా చేతిలో చెయ్యివేసి మాటియ్యి!" సుబ్బారాయుడు చెయ్యిజాపి అడిగాడు.
    
    రాధ కన్నీళ్ళతో ఆయన చేతిలో చెయ్యి వేసింది.
    
    "నీకు పెళ్ళిచేసి నిన్ను అత్తవారింటికి ఎట్లా సాగనంపాలా అని దిగులు పడేదాన్ని! నువ్వు పంపుతుంటే నే వెళ్ళాల్సివస్తోంది!" బాధగా అంది పార్వతమ్మ.
    
    "రైలు కదులుతోంది..... దిగండి ... దిగండి!" సన్యాసిరావు కంగారుగా అందర్నీ తొందర చేశాడు.
    
    అందరూ కిందికి దిగి దిగులుగా చేతులు వూపుతుండగా, పెద్ద పూలబొకేతో మాధవ్ పరిగెత్తుకొచ్చాడు. అది వాళ్ళకి అందిస్తూ అన్నాడు.
    
    "మావయ్యా... అత్తయ్యా.... ఎంజాయ్....! హేపీ ట్రిప్! పెళ్ళవగానే వెళ్ళాల్సిన హనీమూన్ కి కాస్త ఆలస్యంగా వెళ్తున్నారు. అంతే! అక్కడ మీ పేర్లు వ్రాసిన బోర్డు పట్టుకుని ఓ వ్యక్తి కిటికీ దగ్గరికి వస్తాడు. అప్పుడు దిగండి. త్వరలో హిందీ నేర్చుకుని, ఫోన్ లో హిందీలో మాట్లాడేస్తారు చూస్తూ ఉండండి.....ఉంటాను! నా గురించీ, రాధ గురించీ దిగులు పడకండి. ఒక్క నిబంధన కూడా తప్పము! అలాగే... మీరు తొందరపడి రాకండి.... పందెంలో ఓడిపోతారు.... టాటా.....! బైబై! అన్నాడు.
    
    సుబ్బారాయుడూ, పార్వతమ్మా చేతులూ ఊపుతూండగానే రైలు నిర్ధయగా వేగం పెంచేసి అందరి మనసుల్నీ భారం చేసేసింది.
    
    అందరూ గుంపుగా కదులుతూండగా, వారి మధ్యలో యువరాణిలా నడుస్తున్న రాధ వెనక్కి తిరిగి చూసింది.
    
    మాధవ్ చెయ్యి ఊపాడు.
    
    ఆమె కన్నీటితో మసకేసిన కళ్ళు తుడుచుకుని అతనివంక చూసేసరికి, మధ్యలోకి అడ్డంగా వస్తూ, "అటు తిరుగు.... ఇటేం లేదు చూడ్డానికి!" అన్నాడు గట్టిగా ప్రకాశం.
    
    ఆమె ప్రకాశం భుజంమీద నుండి మాధవ్ ని చూడటానికి ప్రయత్నించింది.
    
    ప్రకాశం ఆమె రెక్కపట్టుకుని "త్వరగా నడు!" అంటూ ఈడ్చుకెళ్తున్నట్లుగా తీసుకెళ్ళిపోయాడు.
    
    మాధవ్ ఒక్కడే అక్కడ నిలబడిపోయాడు.
    
    ఎండిన మోడులు చిగురించే కాలం... ఎంత సుందరం! ద్వేషించే మనుసులచేత ప్రేమింప చేసుకోవడం ఎంతటి మధురం!....అదే వసంతం ఎదలో పల్లవించే సమీర స్వరాలనూ గుండెలో ప్రేమదారాలతో నేసే రమ్యహార్మ్యాలనీ నలుగురితో కలిసి పంచుకోవడమే వసంతం అంటే!
    
    చైత్రం జైత్రయాత్ర చేసి వెళ్ళింది. వైశాఖం సుఖ సంతోషాల్ని ప్రసవించడానికి నిండు చూలింతై వస్తోంది.
    
                                                        * * *

    ఆకులో ఆకై... అరవిరిసిన మొగ్గలు.... గుండెలో పుట్టిన ప్రేమ గుభాలింపై.....రేకు విప్పిన సంతోష ప్రసూనమై.... కొమ్మ కొమ్మనా నవజీవన గీతమై భాసిల్లడమే.....వసంతం!
    
    వైశాఖం ఎందరిళ్ళకో వన్నె తెచ్చింది. పసుపు కొమ్ములు దంచి కొబ్బరి మట్టలతో పందిళ్ళు వేశారు. సన్నాయి స్వరాలలో వేద మంత్రాలతో ఎందరో కన్నెపిల్లలని ఇల్లాళ్ళుగా మార్చింది.
    
    అప్పటిదాకా కువకువలాడిన పక్షులన్నీ దాహార్తితో ఆదేపనిగా రొదపెట్టేలా చేసింది జ్యేష్ఠం.
    
    కలవరింతలుమాని పులకరింతలకి అలవాటుపడుతున్న నవ వధువులు విసుక్కుంటూ రెప్పవిప్పితే.... ఆషాడం.... బెత్తం పట్టుకుని పడకిటింట్లోకి చొచ్చుకుని వచ్చేసింది! అత్తారింటి గడపల్ని దాటించింది.
    
    కొబ్బరి నీళ్ళూ... చెరకు రసాలూ, మల్లెమాల, మంచిగంధం ఉపశమింపచేయని తాపాన్ని తాటాకు విసనకర్రలు తీర్చగలవా?
    
    వసంతం యవ్వనం అయితే, గ్రీష్మం ఆ యవ్వనంలో కలిగే విరహపు వేడి!
    
    తొలకరికోసం నిలువెల్లా కనులు చేసుకుని ఎదురు చూసే ముగ్ధ వధువులా నిరీక్షిస్తుంది ప్రకృతి కాంత. ఆ శుభగడియని పెద్ద ముత్తయిదువై మోసుకు వస్తుంది శ్రావణం.
    
    పూలసజ్జతో బయల్దేరిన రాధకి ఎదురొస్తూ "ఎక్కడికి?" అన్నాడు ప్రకాశం.
    
    "గుడికి, చిన్నాన్నా!" అంది రాధ.
    
    పద, నేనూ వస్తాను. ఈ వేళ్టినుండీ నువ్వు ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళకూడదని అన్నయ్య చెప్పాడు!" అన్నాడు.
    
    బాణం దెబ్బతిన్న లేడిపిల్లలా గిలగిలలాడుతూ చూసింది.
    
    చిన్నాన్న మోహంలో కరడుగట్టిన శిలలాంటి కఠినత్వం కనిపించింది.
    
                                                                * * *
    
    "గణపతీ....! నీతో మాట్లాడదామంటే కుదరడమే లేదు!" నిష్టూరంగా అంది తిలక.
    
    సైకిల్ బాగుచేసుకుంటున్న గణపతి తల ఎత్తి "పాలవాడు, మంగలాడు, కిళ్ళీ కొట్టువాడు.... ఒక్కడ్ని కూడా విడిచి పెట్టకుండా సూపర్ హిట్ సినిమాకి నిర్మాతగా మారుస్తున్నాను. వందమంది చేత చేయించాను. లక్షాపాతికవేలు..... భగీరథ దగ్గరికి ఓసారి వెళ్ళొద్దామనుకుంటున్నాను!" అన్నాడు.
    
    "మంచిది! నేను కూడా బయలుదేరుతాను" అంది.
    
    "అదే?" ఆశ్చర్యంగా అడిగాడు.
    
    "ఇంకా... ఇక్కడ ఏం మిగిలిందనీ? రాధ ఇంగ్లీషు కాదు కదా, తెలుగు కూడా మాట్లాడటం మానేసింది. అస్తమానం ఆ మాధవ్ ని తలుచుకుని కంట తడి పెడుతూ ఓ మూల కూర్చుంటుంది!" అంది.
    
    గణపతి నవ్వి, "ఇటువంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సాయపడ్తావు నీ ఫ్రెండ్ కి?" అన్నాడు.
    
    "సాయపడడమా? అమ్మో..... రాధని నాతో కూడా గడపదాట నివ్వడంలేదు మీ చినమామయ్య" గుండెలమీద చెయ్యేసుకుని భయంగా అంది.
    
    "చూడూ... మాధవ్ నిన్న నాకు కలిశాడు. వాళ్ళవాళ్ళంతా రాధని చూడాలనుకుంటున్నారట....నాతో చెప్పాడు. అందుకని రేపు మీరు నాగమ్మమెట్టు తిరునాళ్ళకని పొద్దుటే వెళ్ళిపోండి.కన్నెపిల్లలు నాగచతుర్ధశిరోజు అక్కడ ముగ్గులు పెట్టి నోము నోచడం ఆనవాయితీ! రాధచేత పల్లకీ ముగ్గు పెట్టించు.... మాధవ్ వాళ్ళవాళ్ళు అది చూసి ఆ అమ్మాయే రాధ అని గుర్తుపడతారు. పక్కన చిన్నమావా వాళ్ళవాళ్ళు అది చూసి ఆ అమ్మాయే రాధ అని గుర్తుపడతారు. పక్కన చిన్నమావ కాదు, కంసమావున్నా ఫరవాలేదింక! ఎలా ఉంది ఐడియా?" గర్వంగా అడిగాడు.
    
    "మరి మీ మావయ్య..."

    "ఏమీ అనడు. ఏది తప్పినా ఆచారాలూ, ఆర్భాటాలూ తప్పనివ్వడు కానీయ్!" అన్నాడు.
    
    తిలక కదలకుండా అక్కడే నిలబడి గణపతిని చూసి నవ్వింది.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.