Home » Baby Care » పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే... ఇది తినాల్సిందే!

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే... ఇది తినాల్సిందే!

 

 

చాలామంది పిల్లలు ఎన్ని మందులు వాడినా, ఎంత ఆహారాన్ని తీసుకున్నా... వయసుకి తగినంత బరువు, ఎత్తు ఉండరు. ఈ తరహా సమస్యలని wasting (తక్కువ బరువు), stunting (తక్కువ ఎత్తు) అంటారు. ఇప్పుడు ఈ సమస్యకి సులువైన పరిష్కారం లభించిందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆరు నెలల పాటు, రోజుకో గుడ్డు చొప్పున పెడుతూ ఉంటే, వారిలో అనూహ్యమైన మార్పులు వస్తాయని అంటున్నారు.

గుడ్డులో ఉండే పోషకాహార విలువ గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. కానీ ఇది పిల్లల బరువు, ఎత్తు విషయంలో ఏమేరకు ప్రత్యక్షంగా ఉపయోగపడుతుందో చూడాలనుకున్నారు వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. ఇందుకోసం దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ దేశంలోని కొందరు పిల్లలను ఎంచుకున్నారు. ఈ పిల్లలని రెండు బృందాలుగా విడదీశారు. మొదటి జట్టులో ఉన్నవారికి ఆర్నెళ్లపాట రోజూ గుడ్డు అందించారు. రెండో విభాగంలో పిల్లలకి గుడ్డు ఇవ్వలేదు.

ఆర్నెళ్లు గడిచేసరికి పరిశోధకులకు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. రోజూ గుడ్డు తిన్న పిల్లలలో ఎత్తు పెరగకపోవడం అనే సమస్య 47 శాతం తగ్గిపోయింది. ఇక బరువు పెరగకపోవడం అనే సమస్య 74 శాతం తగ్గిపోయింది. అంతేకాదు! రోజూ గుడ్డు తినే పిల్లలకి తగినంత పోషకాహారం లభిస్తున్నట్లు తేలింది. బహుశా ఆకలి తీరడం వల్లనో ఏమో... వీరు చిరుతిళ్లు తినడం కూడా తగ్గిపోయిందట!
ఈ పరిశోధనతో గుడ్డు వల్ల మరో ఉపయోగం కూడా రుజువైపోయింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలు గుడ్డు తినడం వల్ల ఉండే మరికొన్ని ఉపయోగాలను ఓసారి గుర్తుచేసుకుందాం...
- శాకాహారులు తినే ఆహారంలో B12 అనే పోషకపదార్థం ఉండదు. మాంసాహారం జోలికి పోకుండా ఈ B12ని అందించే సాధనం గుడ్డు మాత్రమే! ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలోనూ, నాడీ వ్యవస్థ పనితీరులోనూ B12 అత్యవసరం.

- గుడ్డులో సెలీనియం అనే అరుదైన పదార్థం ఉంటుందనీ, దీంతో రోగనిరోధకశక్తి పెరుగుతుందనీ చెబుతున్నారు.
- మన శరీరానికి చాలా అవసరం అయినా విటమిన్ డి ఎక్కువగా సూర్యకాంతి నుంచే లభిస్తుంది. కానీ ఇప్పటి పిల్లలు ఎండ అనేదే ఎరుగకుండా పెరుగుతున్నారు కదా! గుడ్డు కనుక తింటే, వారికి కావల్సినంత విటమిన్ డి దొరుకుతుంది.

- ఇప్పటి పిల్లలలో కంటి సమస్యలు చాలా సాధారణం అయిపోతున్నాయి. కానీ గుడ్డులో ఉండే Lutein, Zeaxanthin అనే పదార్థాలు కంటి సమస్యలు రాకుండా నివారిస్తాయి.
- పిల్లలు పాపం బోల్డు పుస్తకాలని బట్టీపట్టాల్సి ఉంటుంది. మరి మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం అని వినే ఉంటారు. ఆ ఒమేగా- 3 గుడ్డులో సమృద్ధిగా లభిస్తుందట.
చివరగా... గుడ్డులో ప్రొటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతారు. పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే ఈ ప్రొటీన్లు చాలా అవసరం. మరెందుకాలస్యం! అశ్రద్ధ చేయకుండా మీ ఇంట్లో పిల్లలకి రోజుకి ఓ గుడ్డు తినిపించండి. పనిలో పనిగా మీరు కూడా ఒకటి లాగించేయండి.

- నిర్జర.

 

 





Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.