అందం, ఆకర్షణ, గ్రేస్, తెలివితేటలు, సమయస్పూర్తి, యుక్తి, ఉపాయం... ఇవి ఈమెలో ఎలా ప్రోదిచేసుకున్నాయి?

 

    ఈ పిల్లకి తన ఎంపైర్ ని అప్పజెపితే...? నో డౌట్... దాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ ని చేస్తుంది.

 

    థాంక్స్ గాడ్... ఎట్ లాస్ట్ ఐ గాట్...

 

    "ఏమిటి ఆలోచిస్తున్నారు?" అడిగింది నిశాంత.

 

    "నలభై ఏళ్ళ క్రితం... సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం... సుశీల తన తండ్రి చేసిన అప్పు కోసం, పెట్టిన పరీక్షలో నెగ్గలేక, బలిపశువులా షావుకారుతో వెళ్ళిపోయింది. రెండు నెలల తర్వాత ఉరేసుకుని చనిపోయింది" దేశ్ ముఖ్ గొంతులో అంతులేని విషాదం.

 

    నిశాంత ఆశ్చర్యపోయింది.

 

    సుశీల నిజంగా వుండేదా?

 

    "అప్పుడే నేను తెలుసుకున్నాను... మనిషి బ్రతకడానికి చదువు ఒక్కటే చాలదు, తెలివితేటలు, యుక్తి, ఉపాయం కావాలని."

 

    "మీరు తెలుసుకున్నారా? ఎలా? ఇంతకీ సుశీల...?"

 

    "అవును... సుశీల నా అక్క..." ఆయన కళ్ళలో నీళ్ళు.

 

    "నమ్మలేకపోతున్నాను సార్!"

 

    "నమ్మలేని నిజం ఇది...! నీ తెలివితేటలు ఆ రోజు నా అక్క సుశీలకి వుండి వుంటే, నాకు ఈ రోజు నా అనేవాళ్ళు కరువయ్యేవారు కాదు..."

 

    దుఃఖంతో పూడుకుపోయిన కంఠంతో అంటున్న ఆయన్ని చూసి నిశాంత నిర్ఘాంతపోయింది.

 

    "మహాభారతం నువ్వు చదివే వుంటావ్. పాండవులకు విలువిద్య నేర్పడానికి అడవిలోకి తీసుకెళ్ళినప్పుడు, వృక్ష శిఖరాగ్రం వైపు చూసి లక్ష్యాన్ని ఛేదించమని చెప్పాడు. ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు... వీళ్ళు నలుగురూ చెట్టుకొమ్మలవైపు, ఆకులవైపూ చూశారు. చెట్టు కొమ్మమీదున్న పక్షినీ, పక్షి కంటినీ చూసి, బాణం ఎక్కుపెట్టిన వాడు అర్జునుడు ఒక్కడే...! ఇప్పుడు అర్జునుడు మనిషిలోని ఏకాగ్రతకు గుర్తు! అర్జునుడు సంధించిన బాణం అతని ఆశయానికి గుర్తు.

 

    దాన్నే మనం ఇంగ్లీషులో చెప్పుకుంటే ఆ ఆశయమే ఆ ఏకాగ్రతే క్రియేటివ్ ప్రోసెస్.

 

    క్రియేటివ్ ప్రోసెస్... సృజనాత్మ రీతికి మూలం ఆలోచన. ఆ సృజనాత్మకమైన ఆలోచనకు ప్రధాన కారణాలు రెండు.

 

    ఒకటి ఇమాజినేటివ్ ఫేజ్. రెండు ప్రాక్టికల్ ఫేజ్. అర్జునుడు ఏకాగ్రత ఇమాజినేటివ్ ఫేజ్ అయితే, బాణంతో గురిచూసి కొట్టడం ప్రాక్టికల్ ఫేజ్. ఇప్పుడు నువ్వు సాల్వ్ చేసిన నల్లరాయి, తెల్లరాయి ప్రాబ్లమ్ కూడా ఈ కేటగిరీలోనిదే. నీ ప్రాక్టికల్ ఫేజ్ లో నల్లరాయిని ఎవరూ చూడకుండా రాళ్ళ గుట్టపై జారవిడవటం.

 

    ఇమాజినేటివ్ ఫేజ్ లో ఆలోచనకు రూపకల్పన చేయటం, ఆ ఆలోచనని విశ్లేషించుకోవడం ప్రధానం. ప్రాక్టికల్ ఫేజ్ ఆ ఆలోచనని క్రమబద్ధీకరించి ఆచరించడం ప్రధానం.

 

    థింకింగ్ సమ్ థింగ్ డిఫరెంట్... విలక్షణంగా ఆలోచించగలిగిన వాడే రిస్క్ ని ఎనలైజ్ చేసుకుని ప్రాక్టికల్ సొల్యూషన్ కి తన బ్రెయిన్ ని వినియోగించగలిగినవాడే లైఫ్ లో అందలాన్ని అందుకుంటాడు. అది ఏ రంగమైనా కావచ్చు.

 

    జీవితంలో ప్రతి పాయింట్ దగ్గర ఒక ప్రశ్న నిన్ను ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్న సమస్య రూపంలో కావచ్చు, సంక్లిష్ట పరిస్థితి రూపంలో కావచ్చు. ఆ పరిస్థితిలో నువ్వు వెతుక్కోవాల్సింది రైట్ ఆన్సర్ కోసం.

 

    The right answer approach become deeply ingrained in our thinking. Life is ambiquo us, there are many right answers- all depending what you are looking for but if you think there is only one right answer then you'll stop looking as soon as you find one.  

 

    నీకో చిన్న కథ చెప్తాను విను...

 

    "ఒక ఎలిమెంటరీ స్కూల్లో డ్రాయింగ్ టీచర్, డ్రాయింగ్ బుక్ లో వున్న కొన్ని బొమ్మల్ని చూబెడుతూ ఇక్కడ ఒక యిల్లు, పువ్వులు, మేఘాలు, ఆకాశం బొమ్మలున్నాయి. వీటికి తగిన రంగుల్ని ఎంపిక చేసుకుని వెయ్యండి అని చెప్పింది.

 

    స్టూడెంట్స్ అందరూ బొమ్మలకు రంగులు వేసి తమ పుస్తకాల్ని తిరిగి టీచర్ కిచ్చారు. ఆ బొమ్మల్ని, ఆ రంగుల్ని వెరిఫై చేసి మార్కులేస్తున్న టీచర్ తేజ అనే స్టూడెంట్ వేసిచ్చిన బొమ్మలు, రంగులూ చూసి అడ్డంగా ఇంటూ కొట్టేసింది.

 

    తేజని కోప్పడింది టీచర్.

 

    బొమ్మలకు నువ్వు వేసిన రంగులు సూటబుల్ కలర్స్ కావు. గడ్డిరంగు ఆకుపచ్చ, నువ్వు వేసింది గ్రే. ఆకాశం రంగు నీలం... నువ్వు వేసింది పసుపు రంగు... ఇట్స్ టూ బ్యాడ్ అంది టీచర్.

 

    ఆ మాటకి తేజకి కోపం వచ్చింది.

 

    నేనా బొమ్మలకు ఒరిజనల్ కలర్స్ వేశాను. నేను ఉదయాన్నే మా గార్డెన్లోకి రాగానే నాకు ఆకాశం, గడ్డి అలాగే కన్పిస్తాయి. టీచర్ విస్తుపోయి చూసింది తేజ వైపు. ఆలోచనలో పడింది, చాలాసేపటికి గానీ ఆవిడ తేరుకోలేకపోయింది.

 

    జీవితంలో వాస్తవంకన్నా అనుభవం చాలా గొప్పది. ఎక్స్ పీరియన్స్ ఈజ్ ది రైట్ ఆన్సర్ ఒప్పుకుందావిడ" చెప్పడం ముగించాడు దేశ్ ముఖ్.

 

    "ఈ కథలో నీతి లేదు. నిజం వుంది" చటుక్కున చెప్పింది నిశాంత.

 

    "ఏమిటా నిజం?" వెంటనే అడిగాడాయన.

 

    "జీవితాన్ని వాస్తవంతో కాకుండా అనుభవంతో విశ్లేషించమని... వాస్తవానికి, అనుభవానికి మధ్య సరిహద్దు రేఖ... హ్యూమన్ ఫీలింగ్. బిజినెస్ కైనా, బ్రతుక్కయినా యిదే మూలం. ఫీలింగ్ బిజినెస్ కైనా, బ్రతుక్కయినా యిదే మూలం. ఫీలింగ్... స్పందన లేనిదే ప్రపంచం లేదు కదు సార్?"

 

    చప్పట్లు కొట్టాడాయన.

 

    "గుడ్! చాలామంది బిజినెస్ పర్సనాలిటీస్ కు తెలియని గొప్ప నిజం. నీ నోటి ద్వారా రావడం నాకాశ్చర్యంగా వుంది" ఆ సమయంలో ఆయనకి గుర్తొచ్చిన వ్యక్తి మహంత... మహంత తనతో చేసిన ఛాలెంజ్.

 

    "చూడండి దేశ్ ముఖ్ సాబ్... స్మాల్ బెట్. వర్క్ ప్లానింగ్ ని నమ్మే మీరు, అదృష్టవంతుణ్ణయిన నన్ను ఓడించగలరా? చెప్పండి నా ఎంపైర్ కూలదోయగలరా? గట్స్ వుంటే బెట్ కట్టండి. కమాన్... టెల్ టెల్.. టెల్ మీ సార్" మహంత చేసిన ఛాలెంజ్ మహంత ముఖం గుర్తొస్తున్న కొద్దీ ఆయన ముఖం వివర్ణమౌతుంది. అతని నరాలలో తెలీని ప్రకంపన.

 

    "హౌ డేర్ హి ఈజ్... నాతో ఛాలెంజ్ చేస్తాడా?" గుండె కుహరంలో సుడులు తిరుగుతున్న మాటలు బయటికొచ్చేశాయి.

 

    విస్తుపోయి చూస్తోంది నిశాంత.