బియ్యం, గోధుమలతో ఆరోగ్య జీవితం


 

ఆరోగ్యానికి, ఆహారానికి ఉన్న సంబంధం అందరికి తెలిసిందే కాబట్టి ఆ నమ్మకాలు సరైనవిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఉదాహరణకి కొవ్వు పదార్ధాలు ఆరోగ్యానికి అంత మంచివి కావు అని మనందరి నమ్మకం. అయితే కేవలం అవే కాదు పాలిష్ పట్టిన బియ్యం, శుద్ది చేసిన గోధుమలతో తయారైన బ్రెడ్డు కూడా వాటికేమి తీసిపోవటం లేదని తాజా అధ్యయనాలు చేబుతున్నాయి. కొవ్వు పదార్ధాలు మన శరీరంలో చెడు కొలస్ట్రాల్ మోతాదు పెరిగేలా చేస్తాయి. అలాగే మంచి కొలస్ట్రాల్ నిల్వలని తగ్గిస్తాయి. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువవుతుంది.

కొవ్వు పదార్ధాలకి బదులుగా బాగా శుద్ధి చేసిన గోధుములతో చేసిన బ్రెడ్డు ఆరోగ్యానికి మంచిదని తింటుంటారు చాలా మంది. అయితే వీటిని రోజు తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం ఉందట. ఎందుకంటే బాగా పాలిష్ పట్టినపుడు బియ్యం పైన ఉండే తవుడు, పోషకాల వంటివి పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఆ తవుడులోని పీచు, మెగ్నీషియం మధుమేహాన్ని నియంత్రణలో ఉంచటానికి బాగా తోడ్పడుతాయి. అదే తెల్లటి పాలిష్ పట్టిన బియ్యం రక్తంలో గ్లూకోస్ స్థాయిని త్వరగా పెంచేస్తుంది. కాబట్టి కొవ్వు పదార్ధాలు తినటం లేదు కనుక ప్రమాదమేమి లేదు అనుకోవటానికి లేదు. పాలిష్ పట్టిన బియ్యం, గోధుమలు కూడా హాని చేయటంలో వాటికేమి తీసిపోవు అంటున్నారు పరిశోధకులు.

రోజు మనం తీసుకునే ఆహారంలో చిన్నపాటి మార్పులు చేస్తే చాలు, పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణలు. పాలిష్ పట్టిన తెల్ల బియ్యం వంటి వాటికి బదులుగా దంపుడు బియ్యం తింటే టైప్2 మధుమేహం వచ్చే అవకాశం 16 శాతం తగ్గుతుందని తేలింది. ఇక రకరకాల ముడి ధాన్యాలను కలిపి తీసుకుంటే మధుమేహం వచ్చే ముప్పు 36 శాతం తక్కువగా ఉంటున్నట్టు వారి అధ్యయనంలో తేలింది. కాబట్టి దంపుడు బియ్యం, ముడి ధాన్యాలను తప్పనిసరిగా మన రోజు వారి ఆహారంలో చేర్చుకోవటం అత్యవసరం అని సూచిస్తున్నారు.

ఆహారం విషయంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాల గురించి తరుచు తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే తెలుసుకున్న వాటిని ఎంత వరకు పాటిస్తున్నామన్నదే ముఖ్యం. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టకతప్పదు. కాబట్టి ఆహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. దంపుడు బియ్యం, నూనెగింజలు, చిరుపోషక గింజలు వంటి వాటిని, ఆకుకూరలు, పండ్లు, పాలుని నిత్యం మన ఆహారంలో భాగంగా చేర్చుకోవటం ఎంతో అవసరం. అందరు తప్పక పాటించాల్సిన నియమం. మరి మీరు కూడా పాటిస్తారు కదా!