అన్నయ్యకు సరిగ్గా మా ఇల్లులాంటిదే - నాకన్నముందే - అఫ్ఘల్ గంజ్ అక్బర్ జా బజారులో - వచ్చింది. ఈ ఇల్లు రాకముందు - కొంతకాలం మేం కలిసి ఉన్నాం. మాకు ఇక్కడ కలిగిన పిల్లలు ముగ్గురూ అన్నయ్య ఇంట్లో ఉండగానే కలిగారు. అన్నయ్య వచ్చి అమ్మను తమ ఇంటికి తీసికెళ్ళారు. ధనుర్మాసం రావడంతో - ఎంత వారించినా వినకుండా - అమ్మ గార్ల వెళ్ళిపోయింది. మళ్ళీ రాలేదు!
    
    1960 ఫిబ్రవరి 20 నాటి రాత్రి మా వదిన వచ్చింది. గార్లనుంచి అమ్మకు సీరియస్ గా ఉందని టెలిగ్రాం వచ్చిందని చెప్పింది. ఆ వార్త విని నా గుండె జల్లుమంది. వెంటనే వదినతో వెళ్ళాను.అన్నయ్యా నేనూ బయలుదేరాం. రాత్రి బయలుదేరే బండి పూరీ పాసింజరు మాత్రం ఉండేది. అప్పటికింకా బెర్త్ లు, రిజర్వేషన్లు లేవు. థర్డ్ క్లాసు పెట్టెలో బయలుదేరాం. మా మానసిక ఆందోళనకు రైలువేగం చాలడం లేదు. రైలు నత్తనడకతో సుమారు తెల్లవారుతుండగా గార్ల సమీపించింది. మా ఇల్లు కనిపిస్తే బావుండును అనిపించింది, కనిపించలేదు. ఆ బండి గార్లలో ఆగదు. డోర్నకల్లులో దిగాం. క్షణం ఆగకుండా వెనక్కు - గార్లకు నడిచాం. అప్పటికి తెల్లవారుతున్నది. ఇళ్ళముందు ఊడ్చి, చల్లుతున్నారు. జనం ఇంకా లేవలేదు. పరిగెత్తి ఇల్లు చేరాం. ఇంటిముందు నిప్పులేదు! అదొక ఊరట!
    
    లోనికి వెళ్లాం. ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. అమ్మ మగతగా ఉంది. అమ్మ మంచంమీద కూర్చున్నాం. అమ్మ మంచంలో పిచ్చుక పిల్లలా ఉంది. ఎముకల బోను అయింది. అమ్మను చూచి దుఃఖం పొంగింది. అమ్మ కళ్ళు తెరిచింది. "ఎవర్రా! కృష్ణుడు - రంగడు వచ్చిన్రా?!" అని చేతులు పట్టుకొని చూచింది.
    
    "అమ్మా! ఇట్లెందుకయినవే!" దుఃఖం ఆగలేదు.
    
    "కావలసినట్లే అయిన ఇంక భూమ్మీద నాకేం పనున్నది? అరుణ పెళ్ళి చూడకుండా పోతున్న మీరు చేస్తరుగద!"
    
    ఆమె మాటలు సహించలేకపోయాం. అయిదుగురమూ గొల్లుమన్నాం. మరోలా ఆనుకుని ఇరుగుపొరుగు ఉరికి వచ్చారు. అమ్మ అందరినీ చూచింది. "బాగున్ననమ్మా! నా కొడుకు లొచ్చిన్రు. నా కింకేం కావాలి? అరె కృష్ణుడూ! కోడళ్ళను - మనుమలను పిలిపించరా!" అని కన్నీరు రాల్చింది. కనుకొలుకుల్లోంచి సాగిన నీరు పరుపు తడిసింది.
    
    మేం దుఃఖం దిగమింగాం. అమ్మకు ధైర్యం చెప్పినట్లు చేశాం. అమ్మ ముఖం కడిగించాం. చాయ్ త్రాగించాం. బట్టలు మార్పించాం. వేరే మంచం వేసి అమ్మను గదిలోకి మార్చాం. మేము అయిదుగురము - రెండోచెల్లెలు పిల్లలూ అందరమూ గదిలో కూర్చున్నాం. అమ్మ లేచి కూర్చుంది. ఆమె కనుల్లో కాంతి రేఖలు గోచరించాయి! గతం తవ్విపోసింది.
    
    మనిషికి డబ్బుకాదు - తనవారుండాలి!
    
    తెలిసిన విషయం ఏమంటే - ధనుర్మాసపు స్నానాలు చేసేది. గుళ్ళో పెట్టింది నోట్లో వేసుకునేది. ముడుచుకుని పండుకునేది. సన్నగా జ్వరం వచ్చినా లెక్కచేయలేదు. అమ్మను చూడ్డానికి వచ్చిన చెల్లెళ్లు అమ్మను చూచి దడుచుకున్నారు. టెలిగ్రాం ఇచ్చారు.
    
    డోర్నకల్లులో ఉండిన డాక్టర్ రాధాకృష్ణ, గార్లకు గవర్నమెంటు డాక్టరుగా వచ్చారు. వచ్చి చూచారు. జ్వరం - కామెర్లు, కిడ్నీలు దెబ్బతిన్నాయి. సాధ్యమైనంత ప్రయత్నం చేద్దాం అన్నారు. హైదరాబాదు తీసికెళ్ళొద్దన్నారు.
    
    మాకు కొంతధైర్యం వచ్చింది. మందులు - ఇంజక్షన్లు ఇస్తున్నారు. కోలుకుంటున్నట్లు అనిపించింది!
    
    మిత్రులు అనేకమంది నకిరెకంటి కృష్ణమూర్తి - కొదుమూరి వేంకటేశ్వరరావు - భద్రం - మాశ్రీకాక గ్రామపెద్దలు కూడా వస్తున్నారు. అమ్మ అందరినీ పలకరిస్తున్నది. వదినకూ - కమలకూ రమ్మని కబురు చేశాం.
    
    21 ఫిబ్రవరిన అమ్మ కోలుకున్నది. స్నానం చేసింది. ఆరాధన చేసింది అన్నం సహించలేదు. పళ్ళరసం త్రాగించాం. ఆ రాత్రి నిద్రపోయింది.
    
    22 ఫిబ్రవరి పగలు విషమించింది. డాక్టరు వచ్చారు. మందులు - ఇంజక్షన్లు ఇచ్చారు. వైద్యులు వచ్చారు. రెండు గంటల ప్రాంతంలో గురక మొదలయింది. ఎవరినీ గుర్తుపట్టకుండా అయింది. నరంలోకి ఇంజక్షన్లు ఎక్కడం లేదు. డాక్టరు పెదవి విరిచాడు. కాని, ప్రయత్నం సాగిస్తూన్నాడు.
    
    నాలుగు గంటలకు దీపం వెలిగినట్లు అమ్మకు తెలివి వచ్చింది. తీర్ధం కావాలని సంజ్ఞ చేసింది. అన్నయ్య తులసి తీర్ధం తెచ్చారు. ఉద్దరణితో మూడుసార్లు పోశారు. మింగింది. ఒక్కసారి అందరినీ కలయచూసింది. అంతే, కన్నుమూసింది.
    
    మేమంతా గోల్లుమన్నాం.
    
    మా ఏడుపులు వినరాని - వినలేని - దూరతీరాలకు వెళ్ళిపోయింది!
    
    మమ్ములను తల్లిలేని పిల్లలను చేసి తాను పరలోకాలకు మాతృమూర్తి కావడానికి వెళ్ళిపోయింది!!
    
    తలలు పగలగొట్టుకున్నా తిరిగిరాని చోటుకు చేరుకుంది!!!
    
    అమ్మ - గోవర్ధనం వరదాచార్యులవారి మనుమరాలు - భట్టరాచార్యులవారి కూతురు - దాశరథి వేంటటాచార్యులవారి సహధర్మచారిణి - మా అయిదుగురికి తల్లి - దాశరథి వేంకటమ్మగారు వికారి మాఘ బహుళ ఏకాదశి సోమవారం 22-2-1960 సాయంత్రం నాలుగు గంటలకు పరమపదించారు.
    
    కళ్ళకుంట వేంకటాచార్యులవారి కూతురు ఆండాళమ్మకు రాజుల - కొంగల - కొత్తపల్లిలో పరాభవనామ సంవత్సర ఆశ్వయుజ శుద్ద దశమి సోమవారంనాడు మా అమ్మ వేంకటమ్మ జన్మించి, యాభయినాలుగు సంవత్సరాల వయసులో గార్లలో పరమాత్ముని స్నానిధ్యం చేరుకున్నారు.
    
    ఆ రాత్రి శవజాగరణం భరించరానిది అయింది. బహుత్ సంగీన్ రాత్ థీ. అయినా గుంపులుగా ఉన్న మిత్రులు మమ్ము ఏడవనీయలేదు.
    
    అమ్మ మాకు మాత్రమే అమ్మకాదు. ఆమె ఉద్యమానికి తల్లి. గ్రామానికి మాతృమూర్తి. ఆమె శవయాత్రలో వందలు వేలు సాగినారు. పాలేరు ఏటి ఒడ్డున - రైల్వేవంతెన సమీపంలో అమ్మచితికి నిప్పు అంటిస్తున్నపుదు - తల కొరివిపెడుతున్నప్పుడు - అమ్మ ఇంకా నాలుగు కాలాలు ఉండాల్సింది అనిపించింది. ఆ చితిమంటలు మా గుండెల్లో మండాయి. అప్పుడే వంతెన మీదినుంచి సాగుతున్న రైలులోంచి వదిన - కమల చితిమంటలు చూచారు.
    
    కొందరు కష్టాలకే పుడ్తారు. 1932లో ఖమ్మం చేరినప్పటి నుంచి అమ్మ కష్టాల కడలిని ఈదింది. మేము ఇద్దరం కాస్త బాగున్నాం - అమ్మను సుఖపెడదాం అనుకుంటుండగా వెళ్ళిపోయింది!
    
    కబురు నిన్ననే అందినా - అంతా అయిపోయింతరువాత - నాయన తెల్లవారి వచ్చారు. లాంఛనంగా ఉండి వెళ్ళిపోయారు.
    
    'మరణాంతాని వైరాని' అంటాడు వాల్మీకి. రావణ వధ జరిగింది. విభీషణుడు తాను పాపిష్టి అన్న శవాన్ని తాకను అంటాడు. అప్పుడు రాముడు విభీషణునితో అంటాడు: 'వైరం మనిషితో దేహంతో వైరం లేదు. వైరములు మరణంతో అంతరిస్తాయి. కావున రావణునికి తగురీతిన సంస్కారం చేయుము.
    
    అదీ అర్ధం చేసుకోలేదు నాయన! వేదాంతులకు' బైరాగులకు ఉన్నంత మాత్సర్యం సామాన్యులకు ఉండదు!
    
    మూడోనాడు ఆస్తి సంచయనం చేశాం. నేను బెజవాడవెళ్ళి కృష్ణలో నిమజ్జనం చేసివచ్చాను.
    
    పక్షికి వేసిన్నాడు అనాయాసంగా ముట్టింది. మా చెల్లెలు లక్ష్మీ - నా కూతురు కవితకు పక్షికి వేసినపుడు కష్టంగా పక్షి ముట్టింది.
    
    తొమ్మిదవరోజునుంచి పన్నెండో రోజువరకు - శాస్త్రోక్తంగా కర్మలు జరిపాం. బంధుమిత్రులతో ఇల్లు కిటకిటలాడింది. నాయన ముభావంగా ఉన్నారు.
    
    పదమూడవరోజున ద్రావిడ వేద అనుసంధానం - వియ్యలు నడవడం - స్వర్గపాధేయం ఇవ్వడం - తదీయారాధన చందన గోష్ఠి - మాకు కొత్తబట్టలు పెట్టి ఆశీర్వదించడం జరిగాయి!
    
    అంతటితో కర్మ ముగిసింది. దుఃఖాలు కూడ చాల వరకు దూరం అయినాయి. పన్నెండు రోజుల వ్యవధికి కారణం ఉన్నట్లు కనిపిస్తుంది. వంటికి తగిలిన గాయం మానడానికి వరం పట్టినట్లే - మనసు తగిలిన గాయం ఉపశమించడానికి 12 రోజులు పట్టేటట్లుంది.
    
    కర్మకాండను నమ్మినా నమ్మకున్నా తల్లిదండ్రుల - తీర్చుకోలేని రుణం తీర్చుకున్నాం అనిపించడానికి ఇది ఒక మార్గం. మాసికాలపుడు నెలకొకసారి - తద్దినాలపుదు సంవత్సరానికి ఒకసారి వారిని తలచుకోవచ్చు.
    
    నేను ఒక సభకు వెళ్ళాను. నిర్వాహకుడు సభ మొదలవుతున్నపుడు వెళ్లాడు. సభ ముగుస్తుండగా వచ్చాడు. 'అమ్మ చచ్చిపోయింది. తగలపెట్టి వస్తున్నా' అని ఎవరి చావుకో వెళ్ళివచ్చినంత నిర్లిప్తంగా చెప్పాడు.