కాలం నిలిచేదికాదు. ఒక దశాబ్దం గడిచిందనుకుంటా. ఈలోగా ముదలియార్ గారికి ఆక్సిడెంట్ అయింది. ఎముక విరిగింది. దవాఖానాలో చేరారు. ఎముక అతుక్కున్నది.
    
    ఒకనాడు నేనూ రమణాచార్యులూ ముదలియార్ గారి కూతురు ఇంటిముందునుంచి వెళ్తున్నాం. వాకిట్లో ముదలియార్ గారు కనిపించారు. దగ్గరి బంధువు ఆకస్మికంగా కనిపించినట్లనిపించింది. వారి దగ్గరికి వెళ్ళాను. నన్ను వారికి తెలియపరచుకున్నాను. వారు కన్నీటి బొట్లు రాల్చారు. అమాంతంగా నా ముందు సాష్టాంగపడిపోయారు. ఎవరైనా చూచారేమోనని నాకు సిగ్గయింది. వారిని లేపి కూర్చోపెట్టాం. మేమూ కూలబడ్డాం. వారు కొంతసేపు దుఃఖించారు. తరువాత అడిగారు:
    
    "స్వామీ! ఈ జన్మలో ఎవరికీ అపకారంగాని అపచారంగాని చేయలేదు. శక్తి ఉన్నంతలో మానవ సేవ, మాధవ సేవ చేసినాను. ఈ వయసులో నాకు ఇన్ని బాధలేల? భగవానుడు నన్ను ఏల కరుణించడు? తన దగ్గరికి ఏల పిలిపించుకొనడు?" ఆ పదాలలోని వారి బాధ కఠిన శిలలను కరిగించేట్టుంది!
    
    ఎంతటి దీనస్థితి! మనిషి బ్రతుకు కోసంకాదు - చావుకోసం దేబిరిస్తున్నాడు!!    
    
    నా మేధస్సు నిశ్చలం అయింది. మౌనం వహించాను.కాని, ఎదుట బాధాపరితప్త నిర్మల హృదయం - ఆ వయోవృద్దుని ఆరాటాన్ని సడలించాలి. అమాంతంగా మెరుపులా - గురుదేవుడు రవీంద్రుని గీతాంజలి స్ఫురించింది. భగవంతుడూ నియమబద్దుడే అంటారు గురుదేవులు.
    
    "స్వామీ! మౌనమే సమాధానమా?"
    
    "కాదు ముదలియార్ గారూ! భగవంతునికి మీమీద నిర్హేతుక జాయమాన కటాక్షం కలిగింది. అయితే భగవంతునికీ తాను ఏర్పరచుకున్న నియమాలున్నాయి. స్వామి వాటిని ఉల్లంఘించలేరు. అందువల్ల మీ పూర్వజన్మ కర్మలు ఈ జన్మలోనే తీర్చదలచాడు. అందుకే ఈ బాధలు! మీకు మరొక జన్మలేదు. లభించునది మోక్షమే!" అన్నాను.
    
    వృద్దమూర్తి చలించిపోయారు. నా పాదాలమీద పడిపోయారు. "స్వామీ! ఇటువంటి సమాధానం కోసం తపించిపోయాను. భగవంతుడు మోక్షమే ప్రసాదిస్తే మరిన్ని బాధలు పడ్తాను" అని గుండె నింపుకొని అన్నారు. వారి నేత్రద్వయంలో ఆశారేఖ అవతరించింది!
    
    నేను ఇచ్చిన సమాధానం - వాస్తవంగా - నాకే ఆశ్చర్యం కలిగించింది. ముదలియార్ గారి సాంత్వనం కోసం భగవంతుడే నాతో ఆ మాటలు అనిపించాడు అనిపించింది. ఏమయినా ఒక పూర్ణాయుష్కుని - పరిపూర్ణ మానవతామూర్తిని సాంత్వనపరచిన సంతృప్తి నాకు దక్కడం అదృష్టం.
    
    శ్రీమద్భాగవతం వైరాగ్యం మాత్రమే బోధిస్తుంది అనడం మూర్ఖత్వం. జీవిత సత్యాలు, జీవిత గుణపాఠాలు అనేకం అందులో ఉన్నాయి. తెలుగు భాగవతపు సాహిత్యపు సొగసు నిరుపమానం.
    
    తెలంగాణ సాయుధ పోరాట నేత రావి నారాయణ రెడ్డిగారికి ప్రియమయింది ఆంద్రభాగవతం వారు అందులోని పద్యాలు మాత్రం కాదు - గద్యం అప్పచెప్పేవారు. అవసానదశలో - అపస్మారంలో -'కారే రాజులు' పాలవరించేవారని రావి భారతిగారు చెప్పారు.
    
గూడు-నీడ:
    
    కౌన్సిలు - కౌన్సిలర్లు సభ్యత సద్భావన కలవారని చెప్పాను. కార్పొరేషను సిబ్బంది కోసం మారేడుపల్లిలోనూ, గరీబ్ నగర్ - ప్రకాశం నగర్ లోనూ ఇళ్ళు కట్టారు. కేటాయింపుకు దరఖాస్తులు కోరారు. మారేడుపల్లి ఇల్లుకోసం నేనూ అడిగాను. 'మీకు సంవత్సరం సర్వీసు పూర్తిఅయి కన్ఫరం అవుతే ఆలోచిస్తా' మన్నారు. మేయర్ గారికి నేనంటే అభిమానం. వారు చెప్పినట్లున్నారు - గరీబ్ నగర్ లో ఇల్లు ఇస్తామన్నారు. కమలా - నేనూ వెళ్ళి చూచాం. నిర్జనారణ్యంలా ఉంది. 'కనీసం ఉప్పు దొరికేటట్లు లేదు. పిల్లలకు స్కూలు లేదు. దవాఖాన లేదు. ఇటువైపు బస్సన్న లేదు. నేను ఇక్కడ ఉండను' అన్నది కమల. అదే ప్రకాశం నగర్ ఇప్పుడు - విమానాశ్రయం వచ్చింతరువాత సందులేకుండా - సామాన్యునికి అందకుండా పోయింది!
    
    మేయర్ శిర్నం సత్యనారాయణగారికి మేము గరీబ్ నగర్ ఇళ్ళు చూచిన విషయం కమల వ్యక్తపరచిన అభిప్రాయం చెప్పాను. వారు కమల భయం సరియైందే నన్నారు. తల్లికి పిల్లల భద్రత విషయంలో ఉండే వాత్సల్యాన్ని మెచ్చుకున్నారు. వారికి పిల్లలు లేరు! లేనివారే తల్లి విషయం గ్రహించగలరు!! వారికి నా మీద అభిమానం నాకు ఒక ఇల్లు సమకూర్చాలనే అభిప్రాయంలో ఉన్నారు.
    
    శిర్నాంగారు మరొకసారి చెప్పారు: మారేడుపల్లిలో - ఆఫీసు పక్కనే - ఇల్లు కడ్తున్నారనీ - అందుకు భూసేకరణ జరిగిందనీ - ఒక సంవత్సరంలో ఇళ్ళు తయారవుతే నాకు తప్పక లభిస్తుందనీ ఆ విషయం చెపితే కమల మురిసిపోయింది.
    
    మనిషి విచిత్రుడు వచ్చి వళ్ళో పడనక్కరలేదు - వస్తుందంటేనే మురిసిపోతాడు!
    
    మేయరుగారు నాకు సేకరించిన స్థలం చూపించారు. అది జొన్నచేను. డాక్టర్ ఖాద్రీకి చెందింది. ఎకరాల స్థలం లక్షా పాతిక వేలకు సేకరించారు. తరువాత జొన్నచేను పోయింది. ఆ సంవత్సరం ఆరోగ్య దినోత్సవ క్రీడలు ఆ మైదానంలో నిర్వహించారు. మా అమ్మాయి ఉదయశ్రీకి పరుగుపందెంలో ప్రైజు వచ్చింది. డిప్యూటీ మేయరుగారు ఆమెకు బహుమాన ప్రధానం చేశారు.
    
    భూమి సేకరించిన మొత్తం లక్షరూపాయల చెక్కు అందుకున్న ఆనందం భరించలేక డాక్టర్ ఖాద్రీ అమాంతంగా మరణించారు. ఆనాడు లక్ష అంటే అంత! డబ్బు చలామణీ తక్కువ. డబ్బు విలువ హెచ్చు, వస్తువు విలువ తచ్చు. పదార్ధాలు లభించడమూ దుర్లభం. ఆహారధాన్యాలు చాలేవి కావు. అమెరికానుంచి PL 480 కింద గోదుమలు వచ్చేవి. అవి అమెరికాలో పందులకు పెడ్తారట! రేషనులో రూపాయికి రెండు కిలోలు ఇచ్చేవారు. సగం పొట్టుకింద పోయేది. బియ్యం దొరకడం కష్టం! పాలు పల్లెల్లోవలెనే గొల్లలు తలమీద తట్టల్లో తెచ్చి ఆమ్మేవాళ్ళు! పాలు సహితంగా ఏవీ వ్యాపార సరళి ఉత్పత్తి లేదు. అన్నీ కుటీరపరిశ్రమల్లాంటివే!
    
    భూమి లక్షా పాతికవేలకు సేకరించారు. ఆ భూములోని కొంత భాగంలో పల్లెలనుంచి వచ్చిన శ్రామికులు గుడిశలు వేసుకుని వున్నారు. అప్పుడు ఈ నేలకు విలువ లేదు. అక్కడ వాడ నిర్మించుకుంటే ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు దాని విలువ వచ్చింది. వారిని వెళ్ళగొట్టే బాధ్యత భూస్వామిది. అందువల్ల ఆ నేల మూల్యం తగ్గించి లక్ష ఇచ్చారు! వారిని కాళీ చేయించకుండా నేనూ - SB గిరి ఒక ఉద్యమం నిర్వహించాం. దాన్ని ఇతివృత్తంగా తీసుకుని నేను 'మాయ జలతారు' నవల వ్రాశాను.
    
    సేకరించిన భూమిలో పునాదులు త్రవ్వడం ఆరంభించారు. అప్పటికి సిమెంటు వ్యాప్తి లేదు. స్థలానికి కొదువ లేదు. ఇంకా మనుషులకూ పశువులకూ తీరిక ఉంది. ఉరుకులు పరువులు ప్రారంభం కాలేదు. అందువల్ల సున్నపు 'డంగు' ఏర్పాటు చేశారు. ఎద్దులు లాగుతూ సున్నం రుబ్బుతాయి.
    
    ఆ నిర్మిస్తున్న ఇళ్ళు మా కొరకే అన్నట్లు మేము పదేపదే చూచుకునేవాళ్ళం. వచ్చిన వాళ్ళకు చూపించేవాళ్ళం. రెండు గదుల రూఫ్ మాత్రం సిమెంటు కాంక్రీటుతో వేశారు. ఇళ్ళు సిబ్బంది కోసమని ఇమ్జనీరూ శ్రద్ద తీసుకున్నారు. కంట్రాక్టర్లు సైతం పక్కాగా నిర్మించారు. వెనుకా ముందూ - వసారాలకు ఆస్బెస్టాస్ రేకులు వేశారు. సాధ్యమైనంత తక్కువలో నిర్మించాలని సంకల్పం! ఎంచాతంటే, అప్పుడు జీతాలు అతి తక్కువ. ఉద్యోగులు భరించాలి. ప్రతి ఇంటి స్థలమూ 166 గజాలు. గజం పది రూపాయల చొప్పున - కట్టడం సహితంగా ఇంటి కరీదు ఏడువేల అయిదువందలుగా నిర్ణయించారు. సాధారణ ప్రజ 15 శాతం ప్రథమ డిపాజిటు చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల కోసమని అయిదు శాతం నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇళ్ళు ఇటుక మట్టితో కట్టాలి. ఈ ఇళ్ళు ఇటుకా సున్నంతో కట్టిన అదనపు మూల్యం కలిసి అయిదువందలుగా నిర్ణయించారు.
    
    ఈలోగా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. విలువల దిగజారుడు ప్రారంభించింది. నిజాయితీ తగ్గి - స్వార్ధం పెరిగిన వారు కౌన్సిలర్లుగా వచ్చారు. మేయర్లు మళ్ళీ పోటీ చేయరు. అందువలన శిర్నం రాలేదు. గాడేపల్లి జగన్నాథం వంటి విద్యావంతులు సంస్కారంగలవాళ్ళూ - ఓడిపోయారు.
    
    వ్యవసాయ నాగరకత క్రమంగా మాయం అవుతున్నది. పారిశ్రామిక వ్యాపార నాగరికత ఆక్రమించుకుంటున్నది. వ్యవసాయంలో ఉదారతా - సంస్కారం క్షీణిస్తున్నాయి. వ్యాపార నాగరికతలో లాభం పడగ విప్పుతున్నది. పారిశ్రామికీకరణం పేర పెరుగుతున్న 'నాగరకత' అనేదాంట్లో స్వప్రయోజనం - స్వార్ధం - స్వజన పక్షపాతం - మనిషిని పీడించే లాభం చోటు చేసుకుంటున్నాయి. ఇది కార్పొరేటర్లలో మాత్రం వచ్చిన పతనంకాదు. ఇది సమాజంలోని అన్నిరంగాల్లోనూ ప్రారంభం అయిన పతనం! దీనిని నా నవల 'జనపదం'లో వివరంగా చూపాను.
    
    'ఇల్లు' సంకేతం మాత్రమే పరిస్థితులను వివరించడం ప్రధాన ఉద్దేశ్యం. ఇళ్ళ కేటాయింపుకు దరఖాస్తులు కోరారు. ఆదాయం 150-250 వరకు ఉన్నవారికి ఇస్తామన్నారు. అప్పటి గుమాస్తాల్లో ఎక్కువ ఆదాయం వచ్చే అతికొద్దిమందిలో నేనూ ఒకణ్ణి. నేను కూడా దరఖాస్తు ఇచ్చుకున్నాను. నాకు న్యాయం మీద నమ్మకం. నాకు ఇల్లు ఖాయం అనుకున్నాను.