నిశ్చలంగా చూస్తూనే వుంది సౌదామిని. ఒకవేళ ప్రబంధ ఇంతవరకూ అలాంటి ఆలోచనకి దూరంగా వుంటే ఇప్పుడు వాటినీ హిప్నాసిస్ లా లోపలికి పంపింది.
    
    అది నిజమే అనిపించడానికి ఎక్కువ వ్యవధి పట్టలేదు. ప్రబంధ బెడ్ పైన ఒరిగిపోయింది. అంతేకాదు, సౌదామిని చెప్పిందంతా జరిగినట్టే కలవరపడిపోతూంది.
    
    "పిచ్చి ప్రబంధా! సరిగ్గా నీ తొలి అనుభవం తరువాత కూడా ఇలాగే వుంటుంది సుమా!"
    
    శోభనం అయిన తెల్లవారుజామున ఓదార్చుతున్న మేనత్తలా బుజ్జగించింది సౌదామిని.
    
    "లుక్ మిస్టర్ ఆదిత్యా!" తానో బ్రహ్మాస్త్రంగా భావిస్తున్న రోహిత్ తననే పరిశీలనగా చూస్తున్న ఆదిత్యతో అన్నాడు "నిజానికి నేను ఇలాంటి చిన్న పోటీల్లో తల దూర్చను. ఎందుకంటే... ఇక్కడ ఎవరితోనయినా పోటీపడటం చంద్రమండలం పైకి వెళ్ళిన నాతో చింతచెట్టెక్కు అని ఛాలెంజ్ చేయడంలా అనిపిస్తుంది కాబట్టి బట్ మై నీస్... అంతేకాదు, నాక్కాబోయే భార్య ప్రణయ!"
    
    "మిస్టర్ రోహిత్!" వెంటనే జోక్యం చేసుకుంది ప్రణయ. "నీ గురించి నేను ముందే ఆహ్దిత్యకి చెప్పాను కాబట్టి ఇప్పుడంతగా పరిచయం అక్కర్లేదు."
    
    "ఓ.కే." భుజాలెగరేశాడు రోహిత్ "క్విజ్ ప్రారంభించేముందు పోటీకి సంబంధించిన కొన్ని నిబంధనల గురించి మాట్లాడుకుందాం. ప్రణయ అంటే నాక్కాబోయే భార్య..."
    
    "మిస్టర్ రోహిత్!" టక్కున అన్నాడు ఆదిత్య. "మనం పోటీకి సంబంధించిన నిబంధనల గురించి మాట్లాడుకుంటున్నాం."
    
    తెలుగువాళ్ళపైన ఎప్పుడో సానుభూతిని కోల్పోయిన రోహిత్ ఇక్కడో తెలుగు యువకుడు తననలా ఖండించడాన్ని ఎదుర్కొనేవాడే కాని ప్రణయ గురించి ఆలోచించాడు. అంతేకాదు, ప్రణయ చాలా ష్రూడ్ గా మాట్లాడి అవసరమైతే అంతకంటే ఎక్కువగా తన పరువు తీస్తుంది.
    
    ఆదిత్య అనే ఓ అబ్బాయిని పోటీకి రప్పించినప్పుడే కాదు, అంతకు పూర్వం అతడిగురించి ఆమె చెప్పినప్పుడే అనుమానిమ్చాడు రోహిత్.
    
    ఇద్దరి మధ్యా అఫైర్ వుండివుంటుందని బలంగా నమ్ముతున్నాడు కూడా.
    
    "ప్రాణ స్కోర్ నోట్ చేస్తూ వుంటుంది. అంతేకాదు, మనలో ఒక్కొక్కరూ అరగంట వ్యవధిలో ఎన్ని ప్రశ్నలయినా అడగొచ్చు"
    
    "ఇన్ని ప్రశ్నలూ అన్న నియమం వుంటే బెటర్" ఆదిత్య అన్నాడు.
    
    "ఎస్!" ప్రణయ కూడా సమర్ధించింది.
    
    "ఓ.కే. టైమ్ కాదు. ఇరవై ప్రశ్నలు అడగొచ్చు. ప్రశ్నకు జవాబు ఓ నిమిషం మించి ఆలోచించకూడదు. నిమిషం కాగానే జవాబు చెప్పేఛాన్స్ పోయినట్టు. అంటే ఓ ప్రశ్నకి జవాబు చెప్పలేనట్టు లెక్క" తన దగ్గరున్న స్టాప్ వాచ్ ని ప్రణయకిచ్చాడు రోహిత్. "అయితే ప్రశ్నలకి జవాబు ఎదుటి వ్యక్తి చెప్పలేనప్పుడు అడిగిన వ్యక్తి ఆ జవాబు చెప్పితీరాలి."
    
    "కాని జవాబు సరయినదో, కాదో నిర్ణయించడం ఎలా?" ఆదిత్య అడిగాడు.
    
    "మొత్తం క్విజ్ పోటీనంతా రికార్డు చేద్దాం. అనుమానం వుంటే పోటీ అయ్యాకయినా వెరిఫై చేసుకోవచ్చు"  ప్రణయ సలహా ఇచ్చింది.
    
    "ఓ.కే. ... టాస్ వేద్దామా?" అన్నాడు రోహిత్.
    
    "అక్కర్లేదు మీరు ప్రారంభించొచ్చు."
    
    అదే రోహిత్ కోరుకుంటున్నది కూడా. సైకలాజికల్ గా ఆదిత్యని దెబ్బతీయాలీ అంటే ముందు తనకే అవకాశం కావాలి.
    
    "ఇక ప్రారంభిద్దామా?" అన్నాడు రోహిత్ ఏకాగ్రంగా ఆదిత్యని చూస్తూ.
    
    "ఓ.కే.!" ప్రణయ స్టాప్ వాచీని చూస్తూ అంది.
    
    సరిగ్గా అయిదుగంటల ఇరవైఎనిమిది నిమిషాలకి పోటీ ప్రారంభమైంది. ప్రపంచానికి తెలీని ఓ నైతికమైన అగ్రిమెంట్ లో ఒక యువతీ ఇద్దరు యువకుల నూరేళ్ళ భవిష్యత్తుకి సంబంధించిన పోరాటం మొదలైపోయింది.
        
    "రెండువేల సంవత్సరాల క్రితమే సముద్రంలో అతి పెద్ద చేపలైన షార్క్ గుణగణాల గురించి ఓ పెద్ద తత్వవేత్త గ్రంథస్థం చేశాడు. దాని పేరు?"
    
    "హిస్టోరియా ఏనిలియం. అది ప్రపంచానికి అందచేసిన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్" చెప్పాడు ఆదిత్య.
    
    మొదటి జవాబుతోనే రోహిత్ మొహంలో టెన్షన్ చోటుచేసుకుంది.
    
    "అనానానానీ' అనే ఇంగ్లీషు పదానికి అర్ధం చెప్పండి."
    
    నివ్వెరపోయాడు ఆదిత్య "వ్వాట్?"
    
    "ANANANANY" "స్పెల్లింగ్ చెప్పాడు రోహిత్. ఇది డిక్షనరీలో దొరకని పదం.... సిగ్నలెట్స్ అంటారు ఇలామ్టి పదాల్ని."
    
    "క్విజ్ లో ఇలాంటివి అడగడం సమంజసం కాదు" ఆదిత్య నచ్చచెప్పబోయాడు.
    
    "నిముషం పూర్తికావస్తూంది" నిర్లక్ష్యంగా చెప్పాడు రోహిత్.
    
    అయిపోయింది. రెండో ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయాడు ఆదిత్య.
    
    "నువ్ చెప్పు" టేప్ ఆన్ చేస్తూ అంది ప్రణయ. తనకోసం ఆదిత్య పైన గెలుపు సాధించడమే రోహిత్ ధ్యేయంగా పెట్టుకున్నాడని అర్ధమయిపోయింది. అయినా వారించలేదు. కారణం ముందే ఇలాంటివాటిగురించి చర్చించుకోలేదు కాబట్టి.
    
    విజయగర్వంతో నవ్వుతూ అన్నాడు రోహిత్ "అనానానానీ అంటే అర్ధం బనానా అనే పదానికి స్పెల్లింగ్ చెబుతూ కంగారుపడి ఆగకుండా మరికొన్ని ఎన్ ఏలని కలిపి చెప్పడం."
    
    "ఓ.కే."
    
    "రెడ్ జైంట్ అంటే?"
    
    "సుమారు ఏడువేల మిలియన్ ల సంవత్సరాల తర్వాత హైడ్రోజన్ సరఫరా ఆగిపోవడంతో సూర్యుడు ఇప్పుడున్న పరిమాణానికి వందరెట్లు విస్తరించి భూమిమీద సముద్రాలు పూర్తిగా ఆవిరౌతాయని, పచ్చదనం అన్నది పూర్తిగా అంతమౌతుందన్నది శాస్త్రజ్ఞుల అంచనా అప్పటిసూర్యుడి పరిమాణాన్ని రెడ్ జైంట్ గా అభివర్ణిస్తున్నారు సైంటిస్ట్ లు"
    
    "కాలండర్ల పద్దతి కనుగొన్న దేశం?"
    
    "ఈజిప్టు"
    
    "పాలిచ్చే ప్రాణుల్లో ఎక్కువకాలం గర్భం ధరించే ప్రాణి ఏది?"