కొందరు ఆడవాళ్లలో డిప్రెషన్ ఎక్కువ... ఎందుకంటే!

 

మగవారితో పోల్చుకుంటే ఆడవారిలో డిప్రెషన్ ఎక్కువ. ఈ విషయాన్ని వైద్యులు ఎప్పుడోనే పసిగట్టేశారు. ఆడవారిలో ప్రత్యేకంగా ఉండే హార్మోనులు, వారి పట్ల కఠినంగా ఉండే సమాజం వల్లే వారిలో డప్రెషన్ ఎక్కువ అని తేల్చేశారు. కానీ కొందరు ఆడవాళ్లు మరింత త్వరగా డిప్రెషన్‌తో బాధపడటం వైద్యులని కలచివేసింది. దీని వెనుక కారణం ఏమిటో కనుక్కోవాలని అనుకున్నారు. ఫలితం ఇదిగో...

వేర్వేరు ఆడవారిలో డిప్రెషన్ తీరుని గమనించేందుకు 1,300 మంది ఆడవారిని పర్యవేక్షించారు. వీరిలో estradiol అనే హార్మోనులే మార్పులే వారి డిప్రెషన్ తీరుని ప్రభావితం చేస్తున్నట్లు తేలింది. మనం తరచూ వినే estrogen అనే హార్మోనులో ఒక ముఖ్య రసాయనమే ఈ estradiol. ఈ estradiol రుతుక్రమాన్ని నియంత్రించడంతో పాటుగా భావోద్వేగాలను ప్రభావితం చేసే serotoninను కూడా అదుపులో ఉంచుతుంది. అదే ఒకోసారి డిప్రెషన్‌కు దారితీస్తుంది.

ఆడవారిలో estradiol హార్మోను తగినంత లేకపోతే డిప్రెషన్‌తో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. మెనోపాజ్ తర్వాత కొందరు తీవ్రమైన డిప్రెషన్‌కు లోనుకావడానికి కారణం కూడా ఇదే అంటున్నారు. త్వరగా మెనోపాజ్ దశకు చేరుకునేవారు, రుతుక్రమం సరిగా లేనివారిలో డిప్రెషన్ లక్షణాలు కనిపించడానికి కారణం ఇదే! డిప్రెషన్ అనేది కేవలం మన బయట పరిస్థితుల వల్లే కాదు, శరీరంలోని హార్మోనుల వల్ల కూడా ఏర్పడవచ్చని తేలిపోయింది. కాబట్టి తరచూ నిరాశకి లోనవ్వడం, ఆకలి మందగించడం, జీవితం, త్వరగా భావోద్వేగాలకి లోనుకావడం, జీవితం నిస్సారంగా తోచడం, నిద్రలేమి... లాంటి సమస్యలు వచ్చినప్పుడు, అశ్రద్ధ చేయకుండా ఓసారి వైద్యుని సంప్రదించి చూడమని సూచిస్తున్నారు. హార్మోను లోపం వల్లే ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నట్లయితే, వైద్యులు తగిన చికిత్సను అందించే అవకాశం ఉంటుంది కదా!