ఏదో ట్రాన్స్ లో వున్నట్టు తదేకంగా చూస్తున్న రఘుపతి దాని మెడను ఓ చేత్తో పట్టుకుని కసికొద్దీ మెలి తిప్పాడు.

 

    మరో క్షణంలో అది అరవడం మానేసి మెడను వేలాడదీసింది.

 

                                                      *    *    *    *

 

    అప్పుడే శ్రీపతి యింటినుంచి వచ్చిన తిలక్ మొదటి బ్యారెక్కులోకి వెళ్ళబోతూ ఆర్ముగం పిలవడంతో ఆగాడు.

 

    ఆయన దగ్గరకు వచ్చి " నిన్ను ఈరోజు రెండోనెంబర్ బ్యారెక్ లోకి మార్చారు" అని చెప్పాడు.

 

    తనను అంత సడన్ గా బ్యారెక్కు నుంచి ఎందుకు మార్చారో తిలక్ కి అర్థం కాలేదు. మరోమాట మాట్లాడకుండా రెండో బ్యారెక్కులోకి వెళ్ళాడు. అప్పుడు టైమ్ అయిదున్నరే కావడంతో యింకా ఖైదీలు ఎవరూ రాలేదు. సిమెంట్ దిమ్మపై పడుకుని కళ్ళు మూసుకున్నాడు. మనసంతా లాలస ఆక్రమించుకుంది.

 

    ఇప్పుడు ఎక్కడ వుందో? ఆరోజు సురక్షితంగా తప్పించుకుందో తెలియడం లేదు. తమకు సహాయం చేసిన ఆమె ఎవరో చెప్పమని పోలీసులు మర్యాద చేసి అడిగినా తనుగానీ, బుద్ధుడుగానీ ఏమీ చెప్పలేదు. చెప్పడానికి కూడా ఆమెనుంచి తెలిసింది చాలా తక్కువ. ఆమె ఎవరో పోలీసులు కూడా ట్రేస్ చేయలేకపోయారు. అందుకే ఆమె ఎక్కడో హాయిగానే వుంటుందని తనకు అనిపిస్తోంది. ఆమె ఎ అపాయంలో చిక్కుకోకుండా వుండడమే కావాల్సింది. ఆమె గురించి తను ఇంతగా ఆలోచిస్తూ ఉండడానికి కారణం ఏమిటి? తను కూడా ఆమెను అంత గాఢంగా ప్రేమిస్తున్నాడా? అవును. తన మనసంతా లాలస వూహలతో నిండిపోయింది.

 

    తనను ఆకట్టుకోవడానికి పాపం చిత్ర వ్యర్థ ప్రయత్నాలు చేస్తోంది.

 

    అలా అనుకోగానే కొన్నిరోజుల క్రితం చిత్రతో జరిగిన పరిచయం గుర్తు వచ్చిందతనికి.

 

    సింగిల్ సెల్ శిక్ష అయిపోయిన రోజు ఏకాంబరం అతని గది తాళం తీసి "బాబూ! ఈరోజు నుంచి నువ్వు బ్యారెక్కుకు మారిపోయావ్, పెద్ద దొర నిన్నురమ్మంటున్నారు" అని చెప్పాడు.

 

    తిలక్ అతని వెంబడి శ్రీపతి గదిలోకి వెళ్ళాడు.

 

    ఏకాంబరాన్ని పంపించాక మెల్లగా చెప్పాడు ఆయన "నిన్ను ఈరోజు నుంచి బ్యారెక్కుకు మార్చడమే కాకుండా కన్విక్టు ఆఫీసర్ గా నియమిస్తున్నాను. అదీ మా ఇంట్లో"

 

    తిలక్ షాక్ తిన్నాడు.

 

    ఎంతో మంచి ప్రవర్తన వుంటేగాని ఓ ఖైదీని కన్విక్టు ఆఫీసర్ గా నియమించరు. అలాంటిది రెండుసార్లు జైలునుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన తనను కన్విక్టు ఆఫీసర్ గా నియమించడం వింతగా వుంది. అదీ సూపరింటెండెంట్ ఇంట్లో తను పనిచేయడానికి నియమించడం అంతకంటే విచిత్రంగా వుంది.

 

    "కొన్ని తప్పని పరిస్థితుల్లో నిన్ను మా ఇంట్లో పనికి పెట్టుకుంటున్నాను. ఇంతకు ముందుగా పారిపోవడానికి ప్రయత్నించకు. ప్రతిరోజూ నిన్ను ఉదయం ఎనిమిదిగంటలకు ఓ గార్డు మా యింటికి తీసుకెళతాడు. సాయంకాలం కాగానే జైలుకు తీసుకొస్తాడు."

 

    తిలక్ తల కూడా ఊపలేదు. అప్పటికీ అతను జరుగుతున్నది జీర్ణించుకోలేకపోయాడు.

 

    "నౌ యుకెన్ గో. రేపటినుంచే పనిలోకి రా"

 

    మరుసటిరోజు పనిలోకి వెళ్ళాడు తిలక్.

 

    గార్డు అతనిని వరండాలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దిక్కులు చూస్తూ నిలబడ్డాడు.

 

    అతను వచ్చాడని తెలియగానే చిత్ర ఒక్క గెంతులో వరండాలోకి వచ్చింది. తన అభిమాన హీరో సడన్ గా ప్రత్యేక్షమైతే కదిలిపోయిన టీనేజ్ గర్ల్ లా అయిపోయింది. కళ్ళల్లోని మెరుపు బుగ్గలమీదపడి ప్రకాశిస్తోంది.

 

    "రా!"

 

    అతను చాలారోజుల నుంచి పరిచయమైనట్టు, తనకు యెంతో ఆత్మీయుడైనట్టు ప్రేమగా ఆహ్వానించింది.

 

    పెద్ద దొర ఏ పరిస్థితులకు తలవొంచి తనను కన్విక్టు ఆఫీసర్ గా నియమించాడో అతనికి వెంటనే అర్థమయింది.

 

    పెరట్లోని బావి దగ్గరకు తీసుకెళ్ళి నీటితొట్టిపై కూర్చోబెట్టింది.

 

    వంటింట్లోకి వెళ్ళి కాఫీ కప్పుతో తిరిగొచ్చింది.

 

    "తాగు... మా ఆయన యింకా నిద్ర లేవలేదు. మామూలుగా అయితే ఈ పాటికి లేచేవారే. రాత్రి ఎందుకనో చాలాసేపటివరకు నిద్ర పోలేకపోయారు" అని కప్పు అందించింది.

 

    శ్రీపతికి ఎందుకు నిద్రపట్టలేదో తిలక్ గ్రహించాడు. రెండుసార్లు జైలును బ్రేక్ చేయాలని ప్రయత్నించిన వ్యక్తిని పారిపోవడానికి యెంతో అవకాశం వుండే తనింట్లో పనికి నియమించుకోవాల్సి రావడం ఎంతో రిస్కు అలాంటప్పుడు నిద్ర పడుతుందా?

 

    కాఫీ తాగాక కప్పు తీసుకు వెళ్ళింది.

 

    తనేం చేయాలో తెలియక అక్కడే కూర్చుండిపోయాడు.

 

    మరో పదినిముషాలకు ఉప్మాతో వచ్చింది చిత్ర.

 

    "పెళ్ళి చేసుకోవడం అంత తప్పు ప్రపంచంలో లేదు. ఇల్లు ఎప్పటికీ పెరోల్ రాని జెయిలులాంటిది. నేనూ మీలాగే ఖైదీనే. నేను చేసిన నేరమంతా పెళ్ళి చేసుకోవడమే" అంది ప్లేట్ అందిస్తూ.

 

    తటపటాయిస్తూ తీసుకున్నాడతను. ఆమె తన పాత్రను అద్భుతంగా పోషిస్తోంది.

 

    "జైల్లో నువ్వే హీరో అటకదా. వెంకయ్య చెప్పేవాడు. హీరో యెక్కడున్నా హీరోనే. అందుకే హీరోయిన్ పడి ఛస్తుంది. ఎప్పుడో చచ్చిపోయిన తండ్రిని తలుచుకుంటూ భయపడే మగాళ్లున్నారు లోకంలో. డేరింగ్ గా వుండే మగాళ్ళంటే నాకు చాలా యిష్టం" ఆమె ఏదో ఉద్వేగంతో మాట్లాడుతున్నట్టు గ్రహించాడు తిలక్.  

 

    "ముందు ఉప్మాతిను. మనం మాట్లాడుకోవడానికి చాలారోజులున్నాయి. ఆయన్ను జైలుకి పంపించి వస్తాను" అని లోపలికెళ్ళింది.

 

    ప్లేటులో వేళ్ళతో కెలకడం ప్రారంభించాడు అతను.

 

    ఎవరి సమస్యలు వాళ్ళకి ప్రధానం. ఆమెకున్న సమస్య ఏమిటో సూచన ప్రాయంగా అర్థమవుతోంది. ఆమెకు కావాల్సిన దానికోసం ఆమె ప్రయత్నించడంలో తప్పులేదు. అయితే అందుకు తనను సెలెక్టు చేసుకోవడమే వచ్చిన చిక్కంతా.