నిజాన్ని ఒప్పుకుంది పురుష ప్రపంచం


ఇంటి వ్యవహారాల్లో ఆడవారే బెస్ట్ అంటూ మగవారు ఏకగ్రీవంగా ఒప్పేసుకున్నారు.  ఇంటి బయట వృత్తి, వ్యాపారాల్లో ఎన్నింటినో సమర్థించే తమకి ఇంటి వ్యవహారాలు మాత్రం కష్టమే అంటున్నారు మగ మహారాజులు. అంతేకాదు... ఆర్థిక అంశాలలో కూడా తమకంటే తమ భార్యలే సరైన నిర్ణయాలు తీసుకోగలరని కూడా వీరి నమ్మకం. ఇలా ఒకటి కాదండి.. ‘‘ఆడవారి నిర్ణయాలు కరెక్టుగా వుంటాయి’’ అంటూ మగవారు ముక్తకంఠంతో తేల్చేశారు. వాళ్లు ఈ నిజాన్ని  ఓ అమెరికా విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశోధనలో ఒప్పుకున్నారు. 


అమెరికాలోని అయోవా రాష్ట్ర విశ్వవిద్యాలయం పరిశోధకులు ఒక అధ్యయనంలో భాగంగా కొన్ని జంటల జీవన పరిశీలించారు. అలాగే వారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. పెళ్ళయి సగటున ఏడేళ్ళకు పైగా గడచిన జంటల్ని ఇందుకు ఎంచుకున్నారు. ఆ జంటల వైవాహిక జీవితంలోని వివిధ సమస్యలు, వాటిని పరిష్కరించిన విధానం, వివిధ సందర్భాలలో వారి నిర్ణయాలు, వాటి ఫలితాలు వీటన్నిటినీ విశ్లేషించారు. ఆ జంటలకి కొన్ని సమస్యలు ఇచ్చి భార్యాభర్తలు స్పందించే విధానాన్ని రికార్డు చేశారు. 


వివాహ బంధంలో సంతృప్తిపై, నిర్ణయాలు తీసుకునే అంశంపై విడివిడిగా కొన్ని ప్రశ్నలిచ్చి జవాబులు రాబట్టారు. అలాగే వారి బంధంలో తలెత్తిన ఏదైనా ఒక సమస్యను చెప్పమని, ఆ తర్వాత అదే అంశంపై ఆయా జంటల మధ్య 10 నిమిషాలపాటు చర్చలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో భర్తలు అందరూ ఇంచుమించు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారుట. తమకంటే తమ భార్యలు తీసుకునే నిర్ణయాలే మంచివని, అలాగే సమస్యలు వచ్చినప్పుడు తమ భార్యలే ధైర్యంగా నిలబడగలరని చెప్పారుట. అంతేకాదు.. ఇంటికి సంబంధించిన ఎన్నో విషయాలో తమకు అసలు ఏమాత్రం అనుభవం లేదని కూడా ఒప్పుకున్నారుట. 

వివిధ స్థాయుల్లో భార్యాభర్తల స్పందన తీరుని గమనించినప్పుడు ఇల్లు, కుటుంబ సభ్యులు, వారిపట్ల బాధ్యతల విషయంలో మగవారికన్నా ఆడవారే త్వరగా స్పందించగలుగుతున్నారని తెల్సిందిట. అంతేకాదు.. కేవలం ఇంటి ఇల్లాలిగానే కాకుండా తను నిర్వహించే ఏ బాధ్యతలనైనా అంతే శ్రద్ధతో, అంకితభావంతో నిర్వహించడానికే ఆడవారు ఇష్టపడతారని కూడా వీరి అధ్యయనంలో తేలిందిట. మరో ముఖ్యవిషయం... చాలామంది మగవారు ‘‘భార్య చెప్పినట్టు వినటానికే’’ ఇష్టపడతారుట. ఆమె నిర్ణయాలు సరైనవని నమ్ముతారుట. కానీ, ఆ విషయాన్ని బయటకి చెప్పటానికి మాత్రం జంకుతారని తేలింది. మొత్తానికి భార్య తనకంటే తెలివైన నిర్ణయాలు తీసుకోగలదని నమ్మినా ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా జాగ్రత్తపడతారుట మగవారు. మగవారితో వచ్చిన చిక్కు ఇదేమరి!

-రమ ఇరగవరపు