"ఛీ! పో!" నేను చిన్నగా నవ్వేసి వచ్చేశాను.

 

    బస్ వచ్చింది. ఎక్కి కూర్చున్నాను.

 

    ఏవిటో ప్రశ్నలు. జీవితమే పెద్ద ప్రశ్నార్ధకంగా నా ఎదుట నిలిచినట్లు ఉంది.

 

    నా పక్కన ఖాళీ అయింది. ఒక అమ్మాయి వచ్చి చటుక్కున కూర్చుంది. ఎదురుసీటు అమ్మాయిని చూసి ఏదో సైగ చేసింది. ఆ అమ్మాయి రిటర్న్ లో ఈ అమ్మాయి సైగలు చేసింది.

 

    ఈ అమ్మాయి బాగా నవ్వి, మళ్ళీ ఏదో చెప్పింది.

 

    నేను కుతూహలంగా చూస్తూ కూర్చున్నాను.

 

    ఇద్దరూ అనర్గళంగా, నేనూ లిల్లీ ఇందాక మాట్లాడుకున్నదానికన్నా ఫాస్ట్ గా సైగలుతో మాట్లాడుకోసాగారు! నాకు అర్థమైంది వాళ్ళు మూగపిల్లలని.

 

    ఇద్దరూ వాళ్ళ స్టాప్ రాగానే దిగిపోయారు.

 

    వాళ్ళు దిగిన స్టేజ్ లో వున్న మూగా, చెవిటీ పిల్లల స్కూల్ చూడగానే, నాకు వెంటనే ఆ ఆలోచన స్ఫురించింది. ఆలస్యం చెయ్యకుండా నేనూ, గబగబా బస్ దిగిపోయాను.

 

    స్కూల్లో ఎక్కడ చూసినా సైగలతో మాట్లాడుకుంటూ, కిల కిలా నవ్వుకుంటూ, ఈ ప్రపంచంతో తమకి పనిలేదన్నట్లుగా వెళ్ళిపోతున్నారు అమ్మాయిలూ, అబ్బాయిలూ.

 

    నేను ప్రిన్సిపాల్ రూం దగ్గరికి వెళ్ళాను.

 

    గెడ్డం నెరిసిన ఒక ముసలాయన టీ తాగుతూ కూర్చుని కనిపించాడు.

 

    నేను చేతులు జోడించి నమస్కరించాను.

 

    ఆయన వెంటనే సైగలతో నన్ను ఏదేదో అడిగాడు.

 

    ఆయన నన్నూ మూగ అనుకుంటున్నాడని అర్ధం అయి "నమస్తే నాకు కొంత ఇన్ ఫర్ మేషన్ కావాలి!" అన్నాను.

 

    ఆయన నాలిక కరుచుకుని "సారీ...రామ్మా...కూర్చో ఏం కావాలీ?" అన్నాడు.

 

    "ఇక్కడ కర్నూలు నుండి ఓపదిమంది పిల్లల్ని తీసుకొచ్చి చంద్ర అనే వ్యక్తి జాయిన్ చేశారా?" అన్నాను.

 

    "కర్నూలునుండా? చూస్తాను" అని రిజిస్టర్ తీసి చూస్తూ "ఎవరూ? మీ బంధువులా?" అడిగాడు.

 

    "చాలా కావల్సినవాళ్ళు. అడ్రెస్ దొరకడం లేదు. అందుకనీ" అన్నాను.

 

    ఆయన ఒక్కొక్క పేరే చూస్తూ "ఆ పిల్లల తల్లిదండ్రుల పేర్లేమిటీ?" అన్నాడు.

 

    "తల్లితండ్రులెవరో తెలీదు. వాళ్ళందరూ అనాథ పిల్లలే!" అన్నాను.

 

    "మరి గార్డియన్ గా ఆ చంద్ర పేరే ఉంటుందా?" అడిగాడు.

 

    "అవును!" అన్నాను.

 

    ఆయన వెదుకుతున్నాడు.

 

    నా తెలివితేటల మీద నాకే చెప్పలేనంత నమ్మకం పెరిగిపోతోంది.

 

    చేతులమీద వెంట్రుకలు గగుర్పాటుతో లేచి నిలబడుతున్నాయి ఒకవేళ దొరికిపోతేనో!

 

    నేను చంద్ర దగ్గరకెళ్ళి ఏం చెప్పాలి?

 

    ఆయన నావేపు చూసి "చంద్ర అన్నారు కదూ!" అన్నాడు.

 

    "అవును...దొరికిందా?" ఆత్రంగా అడిగాను.

 

    "ఆ పేరుగల వాళ్ల పిల్లలెవరూ మా స్కూల్లో చదవడం లేదు" తాపీగా చెప్పాడు.

 

    నా ఉత్సాహం మీద నీళ్లు జల్లినట్లుగా అనిపించింది. అయినా పట్టు వదలదలుచుకోలేదు.

 

    "ఈ ఊళ్ళో యింకా వేరే డఫ్ అండ్ డమ్ స్కూల్స్ ఎక్కడెక్కడున్నాయో చెప్పగలరా?" అడిగాను.

 

    "గవర్నమెంట్ ది ఇదొక్కటే!" అన్నాడు.

 

    "అంటే...ప్రైవేటువి ఉన్నాయా?"

 

    "ఆ...గన్ ఫౌండీ దగ్గరొకటీ, టోలీచౌకి దగ్గరొకటీ" ఆయన చెప్పసాగాడు.

 

    "ఆగండి సార్..." అని పెన్ తీసి పేపర్ మీద వ్రాసుకుంటూ "ఇప్పుడు చెప్పండి" అన్నాను.

 

    ఆయన చెప్తుంటే వ్రాసుకున్నాను.

 

    "చాలా థాంక్స్!" అని చేతులు జోడించి సెలవు తీసుకుని బయటికి వస్తుంటే, ఆత్మవిశ్వాసంతో అడుగులు దర్జాగా పడుతున్నట్లు అనిపించాయి.

 

    లక్ష్యాన్ని సాధించలేకపోవడం, ప్రయత్నించి ఓడిపోవడం నేరాలేం కాదు. కానీ లక్ష్యం అనేది లేకపోవడమే పెద్ద నేరం!

 

    ఇప్పుడు నా భవిష్యత్తు ప్రశ్నార్థకంలా నాకు విరక్తిగా లేదు. చేయవలసిన కర్తవ్యం నన్ను ఉత్సాహపెడుతోంది! ఇందాకటికీ, ఇప్పటికీ నాలో ఎంత తేడా?

 

    కాలానికి ఎంత శక్తినిచ్చాడు భగవంతుడు? వాల్మీకి క్రౌంచపక్షుల్ని బాణంతో కొట్టేముందూ, కొట్టిన తర్వాతా ఉన్నంత తేడా! తేడాని తెలుసుకుని ఆయన రుషి అయ్యాడు. తెలుసుకోకపోతే మామూలు బోయవాడే అయివుండేవాడు!

 

    నా ఈ ప్రయత్నంలో లిల్లీ నాకు సహాయం చేయగలదని నాకు గట్టిగా అనిపిస్తోంది.

 

    ఇంత కష్టపడి అతన్ని పట్టుకుని ఏం చెయ్యాలి?

 

    ఆ ప్రశ్నకి నా వద్ద ప్రస్తుతం సమాధానం లేదు.


                                  *  *  *


    చిత్రకీ, వైజయంతికీ సిద్దార్థ నన్ను వేధించడం గురించి చెప్పాను.

 

    చిత్ర దీర్ఘంగా నిట్టూర్చి-

 

    "చేతిదాకా వచ్చి జారిపోతే మగాడికి పట్టుదల పెరిగి అది కసిగా మారుతుందనుకుంట! అంతవరకూ రానివ్వటమే మన తప్పు. అయినా నేను ఓ సారి వార్నింగ్ ఇచ్చి చూస్తాను" అంది.

 

    మోహం అనే మాయదారి దయ్యం నెత్తికెక్కితే తెల్లిదండ్రుల మాటే వినరు. ఇహ అక్క చెల్లెళ్ళ మాట వింటారా?