శ్రీధర్ కు ఆమె అంటే బాగా యిష్టం... ఎంతో ప్రేమ కూడా.... సంవత్సరం గడిచాక శెలవులకి ఇండియా వచ్చినప్పుడు ఏదో ప్రాజెక్ట్ సైట్ చూసి రమ్మని తన తాతగారు పంపిస్తే, వైజాగ్ వెళ్ళాడు. ఆంధ్రా యూనివర్శిటీ రోడ్డుమీంచి వస్తున్నప్పుడు అసెంబ్లీ హాలు దగ్గర గోడమీద అంటించిన వాల్ పోస్టర్ మీద అపర్ణ నృత్య భంగిమ ఫోటో కనిపించడంతో, ఆటోదిగి చూశాడు. బ్రీత్ టేకింగ్ బ్యూటీ.... అద్భుతమైన అవయవ పొందిక .... వన్ ఇయర్ గా తాను అమెరికాలో ప్రత్యక్షంగా చూసినప్పటి కంటే పోస్టర్ లో ఆమె మరింత అందంగా కనిపించింది.

 

    ఆరోజు సాయంత్రమే అపర్ణ డాన్స్ ప్రోగ్రాం. వెంటనే ఆమె నెలాగైనా కలవాలనుకున్నాడు. సాయంత్రం డాన్స్ ప్రోగ్రామ్ కాబట్టి .... మార్నింగ్ వచ్చి వుంటుంది.... ప్రస్తుతం ఎక్కడుంటుంది? తనెప్పుడు వైజాగ్ వచ్చింది స్టేట్స్ నుంచి.

 

    ఆమె కోసం అన్వేషణ మొదలెట్టాడు....

 

    యూనివర్శిటీ గెస్ట్ హౌస్ లన్నీ వెతికాడు.... ఎక్కడా పర్ణ కనిపించలేదు. దగ్గరున్న స్టార్ హోటల్స్ లో ఎంక్వయిరీ చేశాడు. అపర్ణ ఆచూకీ చిక్కలేదు.

 

    సాయంత్రం వరకూ బీచ్ ఒడ్డున అసహనంగా గడిపాడు. ఇప్పటి వరకు తనకి చెప్పకుండా అపర్ణ డాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వలేదు. ఎంత బిజీగావున్నా కనీసం ఫోన్ చేసైనా చెప్పేది.... ఈసారెందుకు చెప్పలేదు.... పది రోజులక్రితం ఇండియా వస్తూ, ఆమెకి విషయంచెప్పి - మూడుగంటల పాటు తనతోనే గడిపాడు. ఎయిర్ పోర్ట్ కి కూడా వచ్చి సెండాఫ్ యిచ్చింది తనకు....

 

    అపర్ణది మొదటి నుంచి చాలా గమ్మత్తయిన వ్యక్తిత్వం. ఎలాంటి విమర్శల్నీ పట్టించుకోదు. పొగడ్తల్ని పట్టించుకోదు. 'నువ్వు బాగా డాన్స్ చేస్తావ్' అని అంటే 'అది నాకు తెల్సులేవోయ్.... రాత్రీ, పగలూ ట్రైనింగ్ తీసుకున్నది.... డాన్స్ బాగా చెయ్యడానికే గదా.... స్టేజిమీద ఆడుకోడానికి కాదుగదా!' అని అనేస్తుంటే - ఆ టైమ్ లో ఆమె ముఖాన్ని చూస్తే ముద్దొచ్చేది.... కాని ముద్దు పెట్టుకునేవాడు కాదు. బుంగమూతి పెట్టుకుని కూర్చునే అపర్ణ భంగిమ చాలా ఇష్టం శ్రీధర్ కి.... చాలామంది స్త్రీల అందం గురించి చెపుతూ....ఆమె కళ్ళు బాగున్నాయి... ముక్కు బాగుంది...నుదురు బాగుంది.... బుగ్గలు బాగున్నాయి... గుండెలు బాగున్నాయి... నడుం కట్టు బాగుంది... కాళ్ళు బాగున్నాయి... వేళ్ళు బాగున్నాయి... ఇలా రకరకాలుగా వర్ణిస్తారు.

 

    అసలు ఆడవాళ్ళ అందం భావ ప్రకటనలో, ఫోజులో వుంటుందని నమ్మే వాళ్ళలో మొదటి రకం శ్రీధర్.

 

    బెంగాల్ కాటన్ చీర కట్టుకుని, ఈజ్ చెయిర్లో కూర్చున్న అమ్మాయి చాలా అందంగా కనిపిస్తుంది శ్రీధర్ కి.

 

    అలాగే కుర్తా, పైజామా లేసుకుని రోడ్డుమీద గబగబా నడిచి వెళ్ళిపోయే టీనేజ్ గర్ల్ నడకలో అందాన్ని చూస్తాడు శ్రీధర్.

 

    అలాగే అపర్ణ బుంగమూతి పెట్టుకుని, గోడకు చేరబడి కిటికీలోంచి బయటకు చూస్తున్న భంగిమ చాలా యిష్టం. "నువ్విప్పుడు ఈ ఫోజులో ఎంత బాగున్నావో తెలుసా?" ఆమెకు దగ్గరగా జరిగి, ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు శ్రీధర్ ఓరోజు- "అలాగా - నువ్వు చెప్తేగానీ నాకు తెలియదులే... చూడబ్బాయ్ నేనందంగా వుంటానని, నేను నవ్వితే బాగుంటానని నాకు తెలుసు! పొగిడితే నేను బుట్టలో పడిపోతానని నీ ఐడియా... నన్ను పొగడ్డం మానేసి... ఇంకేదైనా మాట్లాడు" చిరుకోపంతో అంది అపర్ణ.

 

    "నువ్వు అందంగా వుంటావని అనడం కూడా తప్పా..." ఆశ్చర్యపోతూ అన్నాడు శ్రీధర్.

 

    "నేనందంగా వుంటాను... సరేగదా! దానివల్ల నీకొచ్చే లాభ మేంటి? చెప్పు... డైరెక్ట్ గా చెప్పేసెయ్ నీకేం కావాలి" డైరెక్ట్ గా అడిగేసరికి ఎం చెప్పాలో అర్థంకాలేదు శ్రీధర్ కు.

 

    ఇలా మాట్లాడుతుంది కనుకే, అపర్ణను బాగా యిష్టపడుతున్నాడు శ్రీధర్. అపర్ణను తనెందుకు ఇష్టపడుతున్నాడు... చాలాకాలంగా తన మనసును ప్రశ్నించుకున్నాడు శ్రీధర్.

 

    ప్రేమిస్తున్నాడా తను లేక కామిస్తున్నాడా?

 

    తను అమెరికాలో ఎం.బి.ఏ. చదువుతున్నప్పుడు ఎంతమంది అమ్మాయిలు తనని వలలో వేసుకోడానికి ప్రయత్నించారో...

 

    తన క్లాస్ మేట్స్ చాలా ఈజీగా అమ్మాయిల్తో గడిపేవారు. సెక్స్ అంటే ఒక దాహం... అతి సాధారణ విషయం... మానవ సంబంధాలను సెక్స్ దృష్టితోనే చూడడం, తనకు చాలా అసహ్యంగా వుంటుంది. ముఖ్యంగా అమ్మాయిల్తో స్నేహం విషయంలో ఎప్పుడూ లిమిటేషన్స్ వుంటాయి తనకు.

 

    పర్సనల్ గా "ప్రేమ" అనే పదాన్ని ఇష్టపడతాడు శ్రీధర్... సున్నితమైన భావాలను వ్యక్తం చేయడమే ప్రేమ అని మొదట్లో అనుకునే వాడతను.

 

    ప్రేమకు మొదటి మెట్టు ఇష్టపడడం.

 

    దాన్ని తమ అందానికి మగాడిచ్చే మెరిట్ సర్టిఫికెట్ లా భావించి, అతిశయంతో, అహంతో, గర్వంతో, ఆ మగాడి ప్రేమకు దూరమైపోయే ఆడపిల్లల్ని చూస్తే జాలేస్తుంటుంది. ఆ ఇష్టపడడం క్రమేణా ప్రేమగా మారడానికి మధ్య ఏవేవో రసాయనిక చర్యలు జరుగుతాయి.

 

    పెళ్ళి ఒక్కటే ప్రేమకు ముగింపు కాదు...పెళ్ళి దగ్గరే నిజమైన ప్రేమ ప్రారంభమవుతుందని శ్రీధర్ నమ్మకం.

 

    రెండు, మూడు సార్లు అపర్ణ దగ్గర పెళ్ళి ప్రసక్తి వచ్చింది. 'నువ్వు ఎవరి పెళ్ళి గురించి మాట్లాడుతున్నావ్. నా పెళ్ళి గురించా, నీ పెళ్ళి గురించా, మన పెళ్ళి గురించా?' సీరియస్ గా అడిగింది అపర్ణ.

 

    ఆ మాటలకు తెల్లబోయాడు శ్రీధర్.

 

    "నీ పెళ్ళి గురించి నేనేం చెప్పలేను - నా పెళ్ళి గురించి కూడా నేనేం చెప్పలేను. ఇక మన పెళ్ళి గురించి నాకు ఇప్పట్లో ఎలాంటి ఆలోచనలు లేవు. ఎందుకంటే నేను శోభా నాయుడిలా గొప్ప డాన్సర్ గా పేరు తెచ్చుకోవాలి.

 

    ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ప్రోగ్రామ్స్ ఇవ్వాలన్నది నాకోరిక. ఆ కోరిక నెరవేరిన మరుక్షణం నిన్నే పెళ్ళి చేసుకుంటాను- అప్పటికీ నీకు పెళ్ళి కాకుండా ఉంటే.

 

    పెళ్ళి కాకుండా ఉంటేనే సరిపోదు. అప్పటికి నా మీద, నీకిప్పుడున్న ఫీలింగ్సే వుండాలి.