రత్నం, రామయ్య వెళ్ళిపోతూ వుంటే కాంచన ఆపాలని చూసి ఫలితంలేక వెక్కి వెక్కి ఏడ్చింది. సంధ్యకి ఆమెను ఓదార్చడం తలకి మించిన పనయిపోయింది. ఆ విధంగా రత్నం, రామయ్యలాంటి నమ్మకస్తులు ఆ ఇంటికి దూరమయ్యారు.
    
                                             * * *
    
    చాయకి ఈ విషయం పెద్ద వూరటనివ్వలేదు.
    
    కాంచన మాట వినగానే ఫోన్ చేయడం మానేసిన జయచంద్ర ఆమెలో తెలియని కసిని నిద్రలేపాడు.
    
    "కాంచీ....అంతా నీ ఇష్టప్రకారమే చేస్తాను" అన్న తని గొంతు ఆమె చెవిలో మార్మోగుతోంది. కసిగా పక్కనే వున్న ఫ్లవర్ వాజ్ ని తీసి బలంగా నేలకేసి కొట్టింది. ఆ గాజు ఫ్లవర్ వాజ్ భళ్ళున బ్రద్దలయింది.
    
    కాంచనను అతను బలంగా గుండెలకేసి అదుముకోవడం గుర్తొస్తూనే వుంది. కిందపడిన గాజుపెంకుతీసి మణికట్టు పైభాగంలో గుచ్చుకుంది. మొదట చిన్న చుక్కగా వచ్చి ఆ తరువాత అతిపెద్ద బిందువై, క్రమేణా, ఇంకా పెద్దదిగా మారి.....రక్తం బైటకి రాసాగింది.
    
    ఆమెకి నొప్పి తెలియడంలేదు. తెల్లని బెడ్ షీట్ మీద ఎర్రని రక్తం పరుచుకుంటూ వుంటే సెవ్వనగా అనిపించి ఆ హాయిని ఆస్వాదిస్తున్నట్లుగా కళ్ళు మూసుకుంది.
    
    రక్తం ఆగకుండా వస్తూనే వుంది.
    
    "ఆమె బ్రతకడం ఇంక కష్టం!" డాక్టర్ పెదవి విరుస్తూ అన్నాడు. జయచంద్ర బోనులో నిలబడ్డ ఖైదీలా తలవంచుకుని నిలబడ్డాడు "ఇలా ఎందుకు జరగనిచ్చారూ?" డాక్టర్ మందలింపుగా అన్నాడు.
    
    చాయ కళ్ళెత్తి జయచంద్రవైపు చూసింది.
    
    "ఆవిడ గుండె చాలా బలహీనం, అది ఎటువంటి స్ట్రెయిన్ తట్టుకోలేదని మీకు తెలియదా?" డాక్టర్ వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడవుతూ అన్నాడు.
    
    చాయ తలవంచుకుంది ఆమె చేతి మణికట్టుకి కట్టు వుంది.
    
    "ఆవిడ గుండె చాలా బలహీనం, అది ఎటువంటి స్ట్రెయిన్ తట్టుకోలేదని మీకు తెలియదా?" డాక్టర్ వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడవుతూ అన్నాడు.
    
    చాయ తలవంచుకుంది ఆమె చేతి మణికట్టుకి కట్టు వుంది.
    
    "కాంచన గాజుబొమ్మతో సమానం ఆమె హృదయం స్పందించే షాకింగ్ సంఘటనలేవీ ఇకమీదన్నా జరగకుండా చూసుకోండి" డాక్టర్ హితబోధ చేస్తున్నట్లుగా చెప్పి వెళ్ళిపోయాడు.
    
    జయచంద్ర వెనక్కి తిరిగి చాయవంక కోపంగా చూసాడు.
    
    ఆమె కాలి బొటనవేలితో కార్పెట్ ను నలుపుతూ కూర్చుని వుంది.
    
    "ఆత్మహత్య చేసుకోవలసినంత అవసరం ఏం వచ్చింది నీకు?" అతని గొంతు ఖంగుమని మ్రోగింది.
    
    చాయ లేచి నిలబడి "తట్టుకోలేకపోయాను" అంది.
    
    అతను ప్రశ్నార్ధకంగా చూసాడు.
    
    "మీరు ఆవిడ్ని నా కళ్ళముందే దగ్గరికి తీసుకోవడం చూసి తట్టుకోలేక పోయాను" అనేసి తన గదిలోకి వెళ్ళిపోయింది.
    
    జయచంద్రని ఆ మాట తుఫాన్ ముందు వీచే గాలితుమ్మెరలా కదిలించింది.
    
    అతను ఆమె వెళ్లినవంకే చూస్తూ వుండిపోయాడు.
    
    సంధ్య ఆ రాత్రి తల్లి గదిలోనే పడుకుంది. కాంచనకి సెడెటీన్స్ ఇవ్వడంతో స్పృహ లేకుండా నిద్రపోతోంది.
    
    జయచంద్ర సిగరెట్ వెలిగించి సోఫాలో కూర్చున్నాడు.
    
    అంతా నిశ్శబ్దంగా వుంది. భరించలేనంత నిశ్శబ్దంగా వుంది.
    
    జూలీ మొరుగుడు లేదు.....పనివాళ్ళ అడుగుల శబ్దం లేదు. కాంచన మూలుగూ లేదు. పరమ భయంకరమైన నిశ్శబ్దం అలుముకుని వుంది.
    
    ఆ నిశ్శబ్దంలో నీళ్ళు ధారగా పడుతున్న చప్పుడు వినిపించసాగింది.
    
    జయచంద్రకి ఒక్కసారిగా తను ఒంటరిగా, పలకరించే దిక్కుకూడా లేనంత ఏకాకిగా వుండిపోయినట్లు అనిపించింది. సమయం రాత్రి పదకొండు దాటింది. ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడాలని వుంది....ధారాళంగా.....గడగడా .....మనసులోదంతా గుమ్మరించి ఈ ఒంటరితనాన్ని పారద్రోలాలనిపిస్తోంది కానీ, ఈ సమయంలో ఎవర్ని నిద్రలేపుతాడూ? నిద్రలేపి ఏం మాట్లాడగలడు? తనకోసం ఎదురుచూస్తున్న వాళ్ళెవరూ? అతనికి వెంటనే ఇందాక చాయ అన్నమాట స్ఫురించింది. అంటే ఆ అమ్మాయి తనను.....ఆపైన ఆలోచించలేకపోయాడు. నీళ్ళ శబ్దం ఇంకా వినిపిస్తూనే వుంది.
    
    ఎక్కడైనా పంపు తిప్పి వదిలేశారేమో అన్న అనుమానం రాగానే అతను లేచి ఒక్కొక్క గదీ చూసుకుంటూ నడిచాడు.
    
    ఆ శబ్దం క్రిందనున్న చాయ గదిలోంచి వస్తోంది.
    
    అతను గది తలుపుమీద నెమ్మదిగా కొట్టాడు. తర్వాత పిలిచాడు. లోపల్నుండి చాయ గొంతు విన్పించలేదు. లుపు నెట్టగానే తెరుచుకుంది. లోపల చాయలేదు. బాత్ రూంలోంచి నీళ్ళ శబ్దం వినిపిస్తూనే వుంది.
    
    అతను అటుకేసి నడిచి "చాయా!" అంటూ బాత్ రూం తలుపుమీద తట్టబోయాడు.
    
    తలుపు బార్లా తెరుచుకుంది.
    
    నగ్నంగా షవర్ క్రింద నిలబడి నిలువెల్లా తడుస్తున్న చాయ పాలరాతి ప్రతిమలా దర్సనమిచ్చింది.
    
    అతను షాక్ తిన్నవాడిలా నోరు తెరిచి, చేష్టలుదక్కి అలాగే నిలబడిపోయాడు.
    
    చాయ చేతులతో ఎదను కప్పుకుంటూ అతనివైపు చూసింది.
    
    ఆమె పొడవాటి కురులు ఆమె శరీరాన్ని అక్కడక్కాడా మూసి, మిగతాదంతా విస్తరిలో వడ్డించి విందుచేస్తున్నట్లుగా వదిలేశాయి.
    
    ఏడమ్ తిన్న ఏపిల్ యుగాలుగా సూర్యుడ్ని బాధిస్తూనే వుంది.
    
    జయచంద్ర నరాల్లోకి ఎవరో లాఘవంగా కరెంట్ పంపిస్తున్నట్లుగా అతను నిలువెల్లా చలించాడు. తియ్యని బాధతో శరీరంలోని ప్రతి అణువూ మెలితిరుగుతోంది. కలలో నడుస్తున్నవాడిలా అతను ముందుకు నడిచాడు.
    
                                           * * *
    
    కాంచనకి తను చూస్తున్నది కలా.....నిజమా! అన్న సందేహం కలిగింది.
    
    ఏదో పీడకల వచ్చి అదాటుగా లేచి బయటికి వెళ్ళేసరికి చాయ గదిలోకి వెళుతున్న భర్త కనిపించాడు. అంతా అస్పష్టంగానూ......అర్ధమవనట్టుగానూ వుంది. అంతలోనే తేటతెల్లంగా జరుగుతున్నదేమిటో అర్ధమావుతూనే వుంది. అంత అర్ధరాత్రి భర్త ఏ అవసరంమీద ఆమె గదిలోకి వెళ్ళాడో అర్ధం కాకపోవడానికి తనేం పసిపిల్ల కాదు. ఆమెకి గుండెల్లో కలుక్కుమంది. ఆసరాకోసం మేడ మెట్లకున్న రెయిలింగ్ పట్టుకుని నిలదొక్కుకుంది. కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించాయి. వెనక్కి తిరిగి వెళ్ళడానికి కూడా శక్తిలేనట్లు నీరసంగా అక్కడే క్రిందకి జారిపోయింది.
    
                                                                * * *