మార్బెల్లా సిటీలో జరిగే ఆ రేర్ ఫంక్షన్ ఒక బర్త్ డే ఫంక్షన్!

 

    పదేళ్ళ కాలంలో ప్రపంచాన్ని శాసించగలిగే ఎత్తుకి ఎదిగిన గ్రేట్ బిజినెస్ టైకూన్ బర్త్ డే ఫంక్షన్!

 

    ఆ బిజినెస్ టైకూన్ పేరు :

 

    శుక్రవర్ణ మహంత.

 

    యాభై అయిదేళ్ళ శుక్రవర్ణ మహంత ఇండియన్. అందులోనూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి అని ప్రపంచం ఆశ్చర్యంగా చెప్పుకుంటుంది. శుక్రవర్ణ మహంత గత పదేళ్ళ కాలంలో ఇండియా రాలేదు.

 

    శుక్రవర్ణ మహంత బిజినెస్ కేపిటల్ న్యూయార్క్. కానీ ప్రపంచంలోని ప్రతి కేపిటల్ సిటీలో మహంతకు బిజినెస్ రెసిడెన్స్ లున్నాయి. ప్యారిస్, కేన్స్, కెన్యా, కేనరీ వేలెండ్స్, మాడ్రిడ్, రోమ్, జెడ్డా, రియాచ్, బీరుట్, మాంటెకార్లో, న్యూఢిల్లీ, హైద్రాబాద్ ప్రతి బిజినెస్ సెంటర్ లోనూ ఎస్.ఎమ్ (శుక్రవర్ణ మహంత) బిజినెస్ వరల్డ్ కు చెందిన స్టాఫ్ వుంటారు.

 

    ఎస్.ఎమ్. బిజినెస్ వరల్డ్ ఆర్డినరీ సంస్థకాదు. ప్రపంచ వ్యాప్తంగా ఆసంస్థలో ముప్పై లక్షలమంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. అంటే మన రాష్ట్ర రాజధాని హైద్రాబాద్, సికింద్రాబాద్ జనాభాతో సరి సమానమన్న మాట.

 

    (ఇలాంటి, ఇంతటి స్థాయి వ్యక్తి నిజంగానే వున్నారు. అతని పేరు అద్నాక్ ఖషోగ్గి- వరల్డ్ లగ్గెస్ట్ వెపన్ డీలర్, సౌదీ అరేబియా జాతీయుడు. అత్యద్భుతమైన ఖషోగ్గి జీవన విధానం బాంబే. శుక్రవర్ణ మహంత పాత్ర సృష్టించటం జరిగింది. అంతటి స్థాయీ సంపన్నులలో మన ఇండియన్స్ కూడా వున్నారు. స్వరాజ్ పాల్, హిందూజా సోదరులు ఆ కోవకి చెందినవారే. ఈ నవలలో పాత్రలు నిజ జీవితంలో వున్నవే. ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇంతటి స్థాయి సంపన్నులు ప్రపంచంలో వుంటారా అనే సందేహం కలుగుతుందని, ఒకరోజు పాకెట్ మనీ క్రింద యాభై లక్షలు, కోటి రూపాయలు ఖర్చుపెట్టే వ్యక్తులు నిజజీవితంలో లక్షల్లో కాకపోయినా వేలల్లో వున్నారు. అలాంటి రిచ్ అండ్ ఫేమస్ వ్యక్తుల జీవితాలే ఈ నవలకు వుత్తేజం- రచయిత.)

 

    అయిదువేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మార్బెల్లా సిటీ మధ్యలో నున్న ఎస్.ఎమ్.లీజర్ అవర్ రిసార్ట్ మణి దీపంలా వెలిగిపోతోంది.

 

    విశాలమైన గార్డెన్...

 

    ఆ పక్కన గార్డెన్లోని వింతల్ని తనలో ప్రతిఫలింపచేస్తున్న స్విమ్మింగ్ ఫూల్.

 

    స్పెషల్ సెక్యూరిటీ స్టాఫ్ గన్ పాయింట్ నిఘా మధ్య పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్ మఫ్టీ డ్రస్సుల్లోని అప్రమత్తత డేగకళ్ళ మధ్య-

 

    ఉత్సాహంగా సంచరిస్తున్న వివిఐపీ... గెస్టులు.

 

    ఆ గెస్టులకు ఏమాత్రం అలసట కలగకుండా మంద్ర సంగీతంతో సమ్మోహన పరుస్తున్న వాద్య బృందాలు.

 

    వెండి కుర్చీల్లో విలాసంగా కూర్చున్న అతిధులకు ప్రపంచంలోని అతి ఖరీదయిన డ్రింకుల్ని గోల్డెన్ గ్లాసులతో అందిస్తున్న టాప్ లెస్ యువతులు.

 

    ఈ ఫంక్షన్ కోసం రాయల్ ఫంక్షన్స్ నిర్వహణలో స్పెషల్ గా శిక్షణ పొందిన ఆ యువతుల్ని స్వీడన్, ఫ్రాన్స్ ల నుంచి ప్రత్యేకంగా తెప్పించారు.

 

    పారిస్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో తెప్పించిన డామ్ పెరినాన్ షాంపైన్ వాసన ఆ విశాలమైన రిసార్ట్ లోని అతిధుల ఆలోచనల్ని, మాటల్ని శుక్రవర్ణ మహంత వైపు మళ్ళిస్తున్నాయి.

 

    భారత కాలమానం ప్రకారం-

 

    సాయంత్రం 7-45 నిమిషాలైంది.

 

    శుక్రవర్ణ మహంత బర్త్ డే ఫంక్షన్ ని కవర్ చేయడానికి దేశ విదేశాల నుంచి వచ్చిన స్పెషల్ న్యూస్ రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు, టెలివిజన్ బృందాలు ఆత్రంగా ప్రధానమైన బిల్డింగ్ లిబర్టీ హాల్ వైపు చూస్తున్నారు.

 

    నిమిషాలు గడుస్తున్నాయి.

 

    అదే సమయంలో...

 

    శుక్రవర్ణ మహంత తన ప్రైవేట్ రూమ్ లోంచి బయటికొచ్చాడు.

 

    హాల్లో ఒక్కసారిగా చప్పట్లు మార్మోగాయి. మహంత సెకెండ్ వైఫ్ ఇటాలియన్ బ్యూటీ కుందనిక ప్రేమగా మహంతను కౌగలించుకుని, అరచేతుల్ని ముద్దుపెట్టుకుంది.

 

    అదే సమయంలో వందల కెమెరాలు క్లిక్ మన్నాయి.

 

    సముద్రపు నురుగు రంగు ప్యాంటు, టక్ చేసిన షర్టు, పైన గోల్డెన్ లైనింగ్ బ్లూ కలర్ జాకెట్... క్రీమ్ కలర్ టై.

 

    విశాలమైన కళ్ళు, సన్నపాటి మీసం, తీర్చిదిద్దిన పెదాలు, బంగారు రంగువంటి ఛాయ.

 

    దట్టమైన కనుబొమలు, దృఢమైన దేహం, అయిదడుగుల అయిదు అంగుళాల పొడవు.

 

    హాల్లో కూర్చున్న రాయల్ గెస్టుల అభినందల్ని అందుకుంటూ కుందనికతోపాటు పర్సనల్ స్టాఫ్ వెంటరాగా...

 

    ఒక్కొక్కరితో ముచ్చటిస్తున్నాడు బిలియన్ మిలియనీర్ శుక్రవర్ణ మహంత.

 

    ఒక్కొక్కదేశపు ఒక్కో రాయల్ గెస్ట్ కి మహంత షేక్ హాండ్ ఇచ్చినప్పుడల్లా ఆ దేశపు థీమ్ సాంగ్ తో అభినందనల గీతాన్ని గానం చేస్తున్నారు అందుకు సిద్ధంగా వున్న మ్యూజీషియన్స్.

 

    అదే సమయంలో బయట గార్డెన్లో అయిదువేల బెలూన్లు గాలిలోకి ఎగిరాయి. ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యాలతో నింపిన ఆ బెలూన్లు గాలిలోకి ఎగిరి ఒక్కసారిగా పగిలిపోయాయి.

 

    ఆ పగిలిన శబ్దం పియానో మోతలా వుంది.

 

    ఒక్కసారిగా గాల్లో ఎగిరిన సుగంధ ద్రవ్యాల సువాసనలతో ఆ ప్రాంతం మరింత ఆహ్లాదమయమైపోయింది.

 

    చీకటి మచ్చుకైనా కానరాని వెల్తురు ప్రపంచం.

 

    క్వీన్ ఎలిజబెత్ దగ్గర్నించి బ్రూక్ షీల్డ్స్ వరకూ చిరునవ్వుల అభినందల్ని, విలువైన కానుకల్ని అందుకుంటున్న...

 

    శుక్రవర్ణ మహంత తన వైపు రాగానే-

 

    సీట్లోంచి లేచి షేక్ హాండిచ్చాడు ఇండియన్ మెజీషియన్ పి.సి. సర్కార్ జూనియర్.

 

    మరో క్షణంలో తన చేతిని వెనక్కి తీసుకుని ఆ చేతిని గాలిలో చాపాడు పి.సి. సర్కార్. లిప్తకాలంలో సర్కార్ చేతిలో పొగడపూల దండ.

 

    ఆహుతుల చప్పట్లతో హాలు మార్మోగిపోతున్న సమయంలో ఆ దండను మహంత మెడలో వేశాడు పి.సి.సర్కార్ జూనియర్.

 

    శుక్రవర్ణ మహంత హాల్లోంచి బయటికొస్తున్నాడు...

 

    అదే సమయంలో...

 

    రేర్ బర్త్ డే గిఫ్ట్ తో మహంత వైపు నడిచాడు ప్రమోద్ పుష్కర్ణ-