నిన్నగాక మొన్న ప్రణయతో తన అభిప్రాయం వ్యక్తంచేసిన ఆదిత్య ఇలాంటి పరిస్థితిని ఊహించలేకపోతున్నాడు.
    
    గుంభనంగా, గంభీరంగా వుంటూ తనలోని వ్యక్తిత్వ పరిణతికి దోహదం చేసిన ప్రణయనే తను కోరుకుంటున్నాడు తప్ప ఇదేమిటి?
    
    ఇంతవరకూ తను అలాంటి ఆసక్తిని ప్రదర్శించకపోయినా ప్రబంధ వున్నట్టుండి ఎందుకిలా మారింది?
    
    స్వప్నంలోలా నడుస్తున్నాడు.
    
                                                            * * *
    
    రాత్రి ఎనిమిది కావస్తుండగా ఫోన్ రింగయింది.
    
    రిసీవరు అందుకున్న సౌదామిని వెంటనే అలర్టయిపోయింది.
    
    అది రాజధాని నుంచి ముఖ్యమంత్రి వాసుదేవరావు చేసిన ఫోన్..."నేనే....సౌదామినిని మాట్లాడుతున్నాను."
    
    "బేబీ ఎక్కడ...?"
    
    నిశ్చలంగా అంది. "ఎవరో ఫ్రెండుకు బాగోకపోతే హాస్పిటల్ కి వెళ్ళింది. రాగానే చెబుతాను."
    
    "అవసరంలేదు సౌదీ... అంతకన్నా ముందు నీకు నేనో శుభవార్త చెప్పాలనుకుంటున్నాను"
    
    "ఏమిటి...?"
    
    "రాయ్ తో మాట్లాడాను నిన్న రాత్రి"
    
    చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించింది...."నిజంగా....?"
    
    "సంతోషంగా అంగీకరించాడు సౌదామిని నా పరంగా నేను చేసిన సహాయమూ తక్కువకాదుగా? మొత్తానికి ఈ ఏడాది చివర్లో పెళ్ళి జరిపించేద్దామని నిర్ణయించుకున్నాం."    
    
    "ఆనందంగా వుంది...." తల పంకించింది సౌదామిని అదోలా నవ్వుతూ "మొత్తానికి సాధించారు"
    
    "నీ సాధన ఎంతవరకూ వచ్చింది....?"
    
    "ఇప్పుడిప్పుడే విత్తనం నాటి నీరు పోశాను. పెరుగుదల మొదలైనట్టు కనిపిస్తూంది."
    
    "అంటే.... నీ మాట వింటుందంటావ్?"
    
    "వినేట్టు చేసుకుంటున్నాను. వచ్చింది ఆ పనిమీదేగా? అన్నమాట ప్రకారం మరో రెండు నెలలు తిరక్కుండా ప్రబంధ పెళ్ళంటూ వెంటపడేట్టు చేస్తాను."
    
    "మరీ అంత తొందరేం అక్కర్లేదు."
    
    "నాకు తొందరగా వుంది."
    
    పకల్న నవ్వాడు... "పెళ్ళొకటే కాదు, ఎవర్ని పెళ్ళిచేసుకోవాలో కూడా తెలియచేసి నచ్చచెప్పాలి."
    
    "ముందు క్లాత్ దొరకాలి తప్ప టైలర్ కేముంది ముఖ్యమంత్రిగారూ.!" ఆప్రయోగం ఎందుకుచేసిందీ ముఖ్యమంత్రి ఆలోచించలేదు. సౌదామిని తన మనిషిగా తనకోసం ఏదయినా సాధించగలుగుతుందన్న నమ్మకంతో అడిగాడు.... "అమ్మాయి యూనివర్శిటీలో ఏదో అల్లరి చేస్తూందట."
    
    అప్రతిభురాలయింది సౌదామిని.
    
    "అదే అ అక్విజ్ ప్రోగ్రాం వీసితో చెప్పి కాన్సిల్ చేయించిందటగా శౌరి చెప్పాడు."
    
    తేరుకుంది సౌదామిని. "అవును... శౌరి మేనేజ్ చేయడం తెలిసి పోయిందట"
    
    "అయితే దీనికేమైందట...?" విసుగ్గా అన్నాడు.
    
    "ఒక్కమాట చెప్పనా?.... మృదువుగా అంది..." శౌరి గురించి నాకు తెలీదుకాని, ప్రబంధ ముమ్మూర్తులా మీ పోలిక. ఓటమిని ఎలా భరించలేదో, అయాచితంగా వచ్చిన గెలుపునీ అంగీకరించలేదు. పోరాటంతో సాధించి గెలవాలనుకుంటుంది."
    
    "అవును..." గర్వంగా వినిపించింది ముఖ్యమంత్రి కంఠం.
    
    సరిగ్గా ఈ వాక్యాలు చెబుతుండగా ప్రబంధ రావటం సౌదామిని గమనించింది కాని, గమనించనట్టు చాలా ఏకాగ్రతగా మాట్లాడింది.
    
    "ప్రబంధ మీకే కాదు, నాకూ బిడ్డ లాంటిది. కాబట్టే ప్రబంధ నిర్ణయాన్ని నేనూ గౌరవించాను. మీ అంతస్తుకు తగ్గట్టు ఏం చేసినా గర్వపడతాను కూడా ప్రబంధ విషయం నాకు వదిలేయండి. ఎవరేం చెప్పినా మీరు పట్టించుకోకండి."
    
    ఫోన్ క్రెడిల్ చేసిన సౌదామిని వెనక్కి తిరిగి ప్రబంధని చూస్తూ "పిచ్చిపిల్లా! ఎప్పుడొచ్చావ్...?" అంది ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ.
    
    "డాడీయా...?"
    
    "అవును అయినా ముందే వచ్చి ఫోన్ తీసుకోవచ్చుగా....పాపం! నీ గురించి కంగారుపడుతున్నారు."
    
    "అర్ధమైంది ఆంటీ....! మీరు చెబుతున్న జవాబుని బట్టి డాడీ దేని విషయంలోనో కంగారుపడుతున్నట్టు బోధపడింది. అందుకే రిసీవరు తీసుకోనిది...!"
    
    "తండ్రి కదమ్మా! ఆందోళన వుంటుందిగా...?"
    
    ప్రబంధలో చాలినంత రియాక్షన్ కనిపించకపోవడంతో మళ్ళీ సౌదామినే అంది "అయినా నువ్వు చేసింది తప్పేంకాదుగా!"
    
    "ఏమిటి ఆంటీ?" ఇక నిభాయించుకోలేకపోయింది ప్రబంధ "డాడీ అడుగుతున్నది దేనిగురించి....?"
    
    "ఒక విషయమని ఏం చెప్పను ప్రబంధా? అయినా శౌరి యిలాంటి విషయాలు మీడాడీకి చేరేయడం ఏం బాగోలేదు"
    
    "ఏమిటి...? ఏ విషయం....?"
    
    "అదిగో నేనుండగా కంగారుపడొద్దన్నానా....!"
    
    అయినా ఎలా నిశ్చింతగా వుండగలదని? "అంటే అన్నయ్య ఏదో చెప్పాడన్న మాటేగా?"
    
    "చెప్పకపోవడమేమిటి? వైస్ ఛాన్సలర్ ని నువ్వు చీవాట్లుపెట్టడం మొదలుకుని..." ఆగిపోయింది సౌదామిని.
    
    "ఇంకా...?"
    
    "అవన్నీ నీకెందుకమ్మా....?"