చితి ఇంకా వేడిగానే వుంది. ఆయన ఆవేశంలా!    
    "మూడోరోజు అస్థికలు తీసుకుని, కృష్ణలో కలిపి మరీ వెళ్ళండి" అన్నారు పెద్దలు.    
    అస్థికల కోసం నరసింహారావు పుల్లతో కదిపాడు. "బుస్స్" మంది తడి తగిలి.    
    ఇంకా ఆయనలో ఉద్రేకం, ఆవేశం తగ్గలేదన్నమాట! అనుకుంది రమణమ్మ.    
    ఆ రాత్రి బయల్దేరి విజయవాడ చేరి, అస్థికలు కృష్ణలో కలిపి, తెల్లవారి 9-00 గంటలకి ఇల్లు చేరారు.    
    "మీ నాన్నగారు మనకి ఏమీ మిగల్చలేదమ్మా! చివరికి చివరిచూపు కూడా!" అంది రమణమ్మ కూతుళ్ళని దగ్గరికి తీసుకుని.    
    ఆమె ఎప్పుడూ ఒంటరే! ఇప్పుడు కొత్తేమీకాదు. ముసలి తల్లినీ, ముగ్గురు కుమార్తెలనీ చూసుకుంటూ ఎన్నెన్ని కష్టాలు పడిందో ఆ భగవంతుడికే తెలుసు!    
    ఆమె భర్త ఆమెకంటూ చేసిన సహాయమల్లా 'మెట్రిక్' చదివించడం. ఆ చదువే ఆమెకింత అన్నం పెట్టింది. ఆమె దినచర్య ఈ విధంగా ప్రారంభమయ్యేది. "ఉదయమే నాలుగ్గంటలకు నిద్రలేచి, ఇంట్లో పనులూ, ముసలి తల్లి సేవలూ చేసి, కాలినడకన 'రెజిమెంటల్ బజార్నుండి' గాంధీభవన్ కెళ్ళేది. అక్కడ పుస్తకాల విభాగంలో లైబ్రేరియన్ గా పనిచేసి, మధ్యాహ్నం 'సర్వోదయా'  ఆఫీసు కెళ్ళేది. అక్కడ వాళ్ళిచ్చిన పట్టిక ప్రకారం, ఇంటింటికీ వెళ్ళి 'సర్వోదయా పాత్ర' పనులూ చేసుకుని వచ్చేది. అంటే....రోజూ గొప్ప గొప్ప శేట్లూ వాళ్ళూ ఒక పాత్రలో బియ్యం పోస్తూ వస్తారు. నెలకో రోజు కార్యకర్తలు వెళ్ళి అవి వసూలు చేసుకొచ్చి ఆఫీసులో అప్పచెప్పి కమీషన్ తీసుకోవాలి. అలా సాయంత్రం దాకా తిరుగుతూ, మధ్యలో ఎక్కడైనా తనతో కూడా తెచ్చుకున్న రొట్టె ముక్కో, అన్నమో తినేది. సాయంత్రానికి తిరిగి సికింద్రాబాదు చేరి అక్కడ ఇద్దరు ముగ్గురు మార్వాడీ ఇళ్ళల్లో పిల్లలకి ప్రయివేట్లు చెప్పేది. చీకటిపడి ఇల్లు చేరుతూకూడా, మధ్యలో ఓ సంగీతం టీచర్ కి హిందీ చెప్పి ఓ గంట, ఇల్లు చేరేది. అప్పటికి రాత్రి ఎనిమిదయ్యేది. ఇంటికొచ్చేటప్పటికి పదకొండుమంది మనవలు, ముగ్గురు కూతుళ్ళకీ కలిపి వారి భర్తలకి వేరేచోట్ల ఉద్యోగాలు కాబట్టి అక్కడ తెలుగు వుండదని ఇక్కడే వుంచేశారు. ఆఖరిపిల్ల ఎప్పుడూ తల్లిదగ్గరే వుండేది ఇద్దరి పిల్లలతో!    
    ఆ మనవలందరూ ఆ లెక్క చెప్పమనో, ఈ పాఠం అర్ధం కాలేదనో చుట్టూ మూగేవారు. వాళ్ళతో కాసేపు గడిపి, స్నానంచేసి, భోంచేసే సరికి పదిగంటలయ్యేది. తిరిగి తెల్లవారి అదే దినచర్య!    
    వి.వి. గిరిగారు శ్రీహరిరావుగారి మరణవార్త తెలిసి, రెండు వందల రూపాయలు పంపారు. పెద్ద కుమార్తె సావిత్రికి తండ్రి పోలిక!    
    "ఈ రెండు వందల రూపాయలతో మా అమ్మ జీవితం గడిచిపోదు! ఆమె కుమార్తెలింకా అంత దిక్కుమాలిన స్థితిలో లేరు" అని లేఖరాసింది.    
    ఆమె ముగ్గురు కుమార్తెలూ స్వశక్తితో తమ కాళ్ళమీద తాము నిలబడ్డారు.    
    పెద్దకూతురు మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డులో, రెండో కూతురు ఆంద్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డులో, మూడో కూతురు ఆర్.టి.సి.లో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. తల్లికి కొడుకులు లేని లోటు తీర్చారు.    
                                       *    *    *    *    
    1972లో.....అందరు స్వాతంత్ర్య సమరయోధుల భార్యలకీ, స్వయంగా పాల్గొన్న వాళ్ళకీ పెన్షన్ యిస్తున్నారని తెలిసి, ఆఖరి కూతురు సత్యవతి శ్రీహరిరావుగారి ప్రాణస్నేహితుడైన ఎమ్.ఎస్. రాజలింగంగారి వద్దకు వెళ్ళింది.    
    "మావయ్యా! అమ్మకి పెన్షన్ రాలేదు. అందరికీ వచ్చింది" అని చెప్పింది.    
    ఆయన ఎంతో శ్రద్ద తీసుకుని, శ్రీహరిరావుగారు ఏ ఏ జైళ్ళలో వున్నదీ తెలుసుకుని, ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపి, అతికష్టంమీద జైలర్ల దగ్గరనుంచి ఆయన ఆ కాలంలో జైల్లో గడిపినట్లు ఎవిడెన్స్ లు పొందారు.    
    నెల్లూరి వస్తవ్యురాలు పాణకా కనకమ్మగారూ, చెంచలగూడా జైల్లో గురవారెడ్డిగారూ, పూడిపెద్ద సుబ్బారావుగారూ, వావిలాల గోపాల కృష్ణయ్యగారూ, బెజవాడ గోపాలరెడ్డిగారూ, బోయి భీమన్నగారూ మొదలగు ఆయన జైలుమేట్సు నుండి లేఖలు సంపాదించారు.    
    గవర్నమెంటు సొమ్ము ఆయనకి ఇష్టం వుండదు! చాలా కాలం పెన్షన్ రాకుండా ఆయన ఆత్మ అడ్డుపడింది!    
    "చచ్చిక్కోడా మీ నాన్న సాధిస్తున్నారు" అని రమణమ్మ కుమార్తె లతో అనేది.    
    ఒకనాడు.....    
    పేపర్లో "ప్రెసిడెంట్ వరాహ వెంకట గిరిగారు హైద్రాబాదు విచ్చేస్తున్నారు" అన్నవార్త చదివింది సత్యవతి. వెంటనే రాజలింగంగారి వద్దకు వెళ్ళింది.    
    "మావయ్యా! వి.వి. గిరిగారు వస్తున్నారట. ఆయన నాన్నగారికి మంచి స్నేహితులని విన్నాను. మనకేమైనా సహాయం చేస్తారేమో" అంది అమాయకంగా.    
    రాజలింగంగారు నవ్వి, "వెళ్ళు! వెళ్ళి అడుగు!" అన్నారు.    
    ఆయన నిజంగా అన్నారో, హేళనగా అన్నారో ఆమెకి తెలీయదు.    
    "వెళ్ళచ్చా అలా? కలుస్తారా?" అనడిగింది.    
    "ఆ......మహారాజులా, నువ్వు శ్రీహరిరావు కూతురివే! మీనాన్నలా దూసుకుపోవాలి. అంతే!"  అన్నారు మళ్ళీ నవ్వుతూ.    
    "ఆయన ఎక్కడ దిగుతారు మావయ్యా! ప్రెసిడెంట్ ఎక్కడ బస చేస్తారో కూడా ఆమెకు తెలియదు.