దేన్నీ కేన్సిల్ చేసే వీలులేదు.
    
    జోహ్రాకి ఏది అనువుగా వుంటుంది.
    
    ఏ ప్రోగ్రాంని జోహ్రా ఎన్నుకునే అవకాశముంటుంది?
    
    మిల్లర్ తెల్లకాగితం మీద పెన్సిల్ తో పిచ్చిగీతాలు గీస్తూ సీరియస్ గా ఆలోచిస్తున్నాడు.
    
    "మాస్టర్ మదర్ కి పుణ్యకార్యాలు ఎక్కువయి పోయాయి. ఆమెది మరీ చాదస్తం. వాటిని తగ్గించలేమా...?" మిల్లర్ పి.ఏ. అడిగాడు నెమ్మదిగా.
    
    "ప్చ్... లాభం లేదు దాని గురించి ఆలోచించటం కంటే ఏ ప్రోగ్రామ్ లో ప్రమాదం ఎక్కువగా పొంచి వుండే అవకాశం ఉంటుందని ఆలోచించటమే బెటర్.... మిల్లర్ నిస్పృహగా తల విదిలిస్తూ అన్నాడు.
    
    నారిమన్ పాయింట్ లోని ఓబరాయ్ టవర్ హోటల్ ఎనిమిదవ అంతస్థులోని మూడో నెంబర్ సూట్ లో త్రిమూర్తులు, ప్రణవ ఆసీనులై ఉన్నారు.
    
    ఆ గదిలో డిమ్ లైట్ వెలుగుతోంది.
    
    గదంతా నిశ్శబ్దంగా వుంది.
    
    వేడెక్కిన వారి మస్తిష్కాలు సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ ఛానెల్ నుంచి వస్తున్న చల్లటి పెర్ ఫ్యూమ్డ్ ఎయిర్ మూలంగా ఒకింత సేద తీరుతున్నాయి.
    
    గదిలో మూలగా వున్న టీవికి త్రిమూర్తులు తెచ్చిన వి.సి.ఆర్. కనెక్ట్ చేయబడింది.
    
    ప్రస్తుతం టీవి తెరమీద మాస్టర్ మీద రహస్యంగా షూట్ చేసిన కేసట్ తాలూకు దృశ్యాలు నెమ్మదిగా కదిలిపోతున్నాయి.
    
    "నాకు భయంతో వళ్ళు చల్లబడిపోతోంది- కేసట్ చూస్తుంటే రక్తం గడ్డ కట్టుకు పోతున్నట్లుగా ఉంది- నన్ను వదిలేయవచ్చుగా..." ప్రణవ తడారిపోయిన గొంతుకతో అన్నాడు.
    
    "నీ ఇష్టం ప్రస్తుతం నీ ఉద్యోగం పోయింది. నీవు పనిచేసే బ్యాంకు నిన్ను సస్పెండ్ చేసింది. ఎంక్వయిరీ నడుస్తోంది. నువ్వు నీ లవర్ ని సంతృప్తి పరచడం కోసం లక్షన్నర రూపాయల్ని బ్యాంక్ నుంచి నీకు దొరికిన డి.డి. బుక్ ద్వారా లాగేసుకున్నావ్. మరో నెలలోపు నువ్వు లక్షన్నర బ్యాంకుకి తిరిగి కట్టాలి. పైగా వడ్డీ కూడా. నువ్వు పోగొట్టుకున్నది సాధరణమయిన ఉద్యోగం కాదు. ప్రోబెషనరీ ఆఫీసర్ పోస్టు నువ్వు మంచి స్పోర్ట్స్ మెన్ వి. కనుక నిన్ను బ్యాంకు క్షమించవచ్చు. అయినా దొంగిలించిన సొమ్ము కడితేనే తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటుంది. ఓ ప్రక్క నిన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోకూడదనే బోర్డ్ డైరెక్టర్ కూడా వున్నారు. ఉద్యోగం పోయిందని నీ లవర్ కి తెలిస్తే నిన్ను ప్రేమించదు- పెళ్ళి చేసుకోదు. ఇప్పుడు చెప్పు వెనక్కి వెళ్ళిపోతావా...? మేం చెప్పినట్లు చేసి కావాల్సినంత డబ్బు తీసుకొని నీ అప్పులు తీర్చుకొని, నీ ఉద్యోగాన్ని తిరిగి నువ్వు పొందుతావా? బాగా ఆలోచించుకో... నీ అప్పు తీరిపోతుంది. నీ ఉద్యోగం నీకొస్తుంది. నీమీద ఎంక్వయిరీ ఎత్తి వేయబడుతుంది. నీ లవర్ కోర్కెలన్నింటికి మేమిచ్చే డబ్బుతో తీర్చవచ్చు అవసరమైతే నీమీద కత్తి కట్టిన బ్యాంక్ డైరెక్టర్ ని మనీతో, మందుతో, మంచి మంచి బహుమతులతో నీ దారికి తెచ్చుకోవచ్చు. నీకు సోషల్ ప్రెస్టీజ్ కావాలంటే నీ ఉద్యోగం తిరిగి నీకు రావాలి.... ఇప్పుడు ఇంకా బాగా ఆలోచించు..." బ్రహ్మ అలుపు లేకుండా ఏకబిగిన అంటుంటే అవన్నీ అతనికెలా తెలిసాయని ప్రణవ విస్తుపోయి చూసాడు.
    
    వి.సి.ఆర్.లో కేసట్ పూర్తయి పోయింది.
    
    గదిలో లైట్స్ వెలిగాయి.
    
    మరి కాసేపట్లో అందరికీ మైసూర్ స్పెషల్ కాఫీలొచ్చాయి.
    
    కాఫీ తాగుతూ ఆలోచిస్తున్నాడు ప్రణవ. తన గురించే తెలీదనుకున్నాడు. అంతా తెలిసిపోయింది. అన్ని వివరాలు అందాయి. ఈ ముగ్గురూ సామాన్యులు కాదు. సామాన్యులే అయితే తన జన్మరహస్యంతోపాటు తన బయోగ్రఫీ అంత తెలిసేది కాదు. సామాన్యులే అయితే సామన్యుడయిన మాస్టర్ దినచర్యని మిల్లర్ కి తెలీకుండా వీడియో కేసట్స్ లో ఎక్కించగలిగే వాళ్ళు కాదు. ఇప్పుడు తను కాదని వెనక్కి వెళ్ళినా తనను వీళ్ళు వదిలిపెట్టరు. తనని వెంటాడుతారు. వేధిస్తారు.
    
    ఆ మాస్టర్ లా తనుండడం ఒకరకంగా అదృష్టమైతే మరోరకంగా దురదృష్టం కూడా... ఏమిటి దారి?
    
    ప్రణవ మౌనాన్ని అంగీకారంగా భావించిన బ్రహ్మ మరో క్యాసెట్ ని వి.సి.ఆర్. లో ఇన్సర్ట్ చేసి ప్లే బటన్ ప్రెస్ చేశాడు.
    
    తిరిగి తన గదిలోని లైట్స్ ఆరిపోయాయి.
    
    యధావిధిగా నిశ్శబ్దం అలుముకుంది.
    
    తెరమీద మాస్టర్ మూమెంట్ కనిపించసాగాయి.
    
    ఆలోపు ఒక నిర్ణయానికొచ్చిన ప్రణవ బుద్దిగా బుల్లి తెరకేసి చూడసాగాడు.
    
                                                      *    *    *    *    *
    
    "నాలుగు రోజుల్లోనే నాకీ వివరాలు కావాలి- వారిమీద నిఘా ఏర్పాట్లు నేను చూసుకుంటాను. మూడోకంటికి తెలీకూడదు. నీమీద ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగిస్తున్నాను. వాళ్ళు మంచి వాళ్ళయినా, చెడ్డవాళ్ళయినా సరే- అందరి అడ్రసులు కావాలి నాకు." సిద్దేశ్వర్ ఓబరాయ్ తన కెదురుగా ఉన్న సి.ఐ.డి. ఇన్ స్పెక్టర్ తో అన్నాడు గంభీరంగా.
    
    "ఇది నా అదృష్టం- మీలాంటి సిన్సియర్ పోలీసు అధికారి ఎంతో నమ్మకంతో నాకీ పని అప్పగించటం అంటే నా అదృష్టమే. మీరిచ్చిన గడువు లోపే బొంబాయిలో ఉన్న ఫెయిర్ ఆర్మ్స్ ఎక్స్ పర్ట్శ్ అడ్రస్ ల్ని సేకరిస్తాను. థాంక్యూ సార్..." అంటూ సెల్యూట్ చేసి అతను బయటకెళ్ళి పోయాడు వేగంగా.
    
    అతనలా వెళ్ళిపోగానే ఓబారాయ్ సొరుగులోంచి ఒక కవర్ ని బయటకు తీసి, దాహ్న్ని ఓపెన్ చేసి, అందులోంచి ఒక పేపర్ తీసి చదవసాగాడు.
    
    అందులో మాస్టర్ ప్రోగ్రామ్స్ క్లియర్ గా రాసి ఉన్నాయి. అవన్నీ జూన్ నెలకు సంబంధించిన ప్రోగ్రామ్స్.... వాటిని పరిశీలనగా చూస్తున్నంతలో ఐనాందార్ లోపలకు వచ్చాడు.
    
    "ఎట్టకేలకు ప్రోగ్రామ్స్ షీట్ మన చేతికొచ్చింది. మీకోసమే ఎదురు చూస్తున్నాను...." అంటూ సిద్దేశ్వర్ తన ముందున్న మాస్టర్ ప్రోగ్రామ్స్ షీట్ ని ఐనాందార్ కి అందించాడు.
    
    ఆ గదిలో కొద్దిక్షణాలు నిశ్శబ్దం అలుముకుంది. ఐనాందార్ ఆ షీట్ లో వున్న వివరాలను ఒకటికి నాలుగుసార్లు చదువుకున్నాడు. మరికొద్ది క్షణాల్లో ఏదో ఆలోచిస్తూండిపోయి అప్పుడు తలెత్తి సిద్దేశ్వర్ కేసి చూసాడు.