"ముట్టుకోకండి....మీకు ఆ అర్హత లేదు!" కఠినంగా అన్నాడు మాధవ్.
    
    ప్రకాశం వెనక్కి తిరిగి ఊహించని వేగంతో గిరిని యీడ్చి చెంపమీద కొట్టాడు.
    
    ఆ దెబ్బకి కళ్ళముందు చుక్కలు కనిపించిన గిరి "బావా!" అన్నాడు.
    
    "పోరా... పో! నేను యిల్లు చేరేలోగా నువ్వూ మీ అమ్మా.... నీ అక్కకూతురూ మూటా ముల్లే సర్దుకుని వెళ్ళిపోండి....! ఛ! ఛ! నన్నో మూర్ఖుడిలా మార్చి నీ ఇష్టం వచ్చినట్లు ఆడించావు, అన్నయ్య వస్తే ఈ మొహం ఎలా చూపించగలను..... నే నెందులోనయినా దూకి చావడమే మేలు!" అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు ప్రకాశం.
    
    గిరి అవమానంగా చూసి వెనక్కి వెళ్ళిపోయాడు.
    
    "బాబూ, మాధవ్! ఇవే కాళ్ళనుకో.... నా రాధ తల్లిని రక్షించు!" మాధవ్ చేతులు పట్టుకుని బతిమాలాడు ప్రకాశం.
    
    "ఏం కాదు, ప్రకాశం! పద, నువ్వు కూడా కారెక్కు!" భుజంమీద తట్టిధైర్యం చెప్పాడు కేశవరావు.
    
    "నేనూ వస్తాను!" అంటూ పరుగెత్తుకొచ్చింది యశోద.
    
    కేశవరావూ, యశోదా, ప్రకాశం, మాధవ్ లు రాధని తీసుకుని కారులో టౌన్ కి బయలుదేరారు.
    
                                                            * * *
    
    "బుజ్జిగాడు చెప్పేదంతా వింటుంటే తల తిరిగిపోతోంది..." అన్నాడు ఫోన్ ఆఫ్ చేస్తూ సుబ్బారాయుడు.
    
    నీరసంగా నోరు తెరిచి "మీ పంతాలూ, పట్టింపులూ... పందేలూ పక్కికి పెట్టి వెంటనే బయల్దేరండీ! లేకపోతే యింకా ఎన్ని దారుణాలు చూడవలసి వస్తుందో!" అంది బాధగా పార్వతమ్మ.
    
    "ఇప్పుడే హైదరాబాద్ కి ప్లేన్ టికెట్స్ బుక్ చేయిస్తానమ్మా.... ఇంక మీరేం ఆలోచించకుండా సామాన్లు సర్దేయండి!" చెప్పాడు రామ్ బల్.
    
    సుబ్బారాయుడు రెండు చేతులతో తలని పట్టుకుని, "ఉమ్మడి కుటుంబం గచ్చపొదలా చీకాకుగా ఉందనీ, అది నిన్నూ నీ ఆశల్నీ తీర్చనివ్వలేదనీ భావించి నా కూతుర్ని అలాంటి యింట్లో యివ్వకూడదనుకుని మొండిగా ప్రవర్తించాను పార్వతీ!" అన్నాడు.
    
    పార్వతమ్మ శుష్కహాసం చేసి, "మొన్నటిరాత్రి పలుకాడే దిక్కులేక, పట్టించుకునే నాథుడు లేక యీ మహానగరంలో పిచ్చివాడిలా యెలా పరుగులు పెట్టారో గుర్తు చేసుకోండి. అన్నయ్య సమయానికి రాకపోతే నేను ఉండేదాన్నే కాదు! ఇటువంటి దిక్కులేని జీవితమా నా కూతురికి బహుమతిగా ఇస్తానంటున్నారు?" అంది.
    
    "పెళ్ళయిన నాటినుండీ ఆడబిడ్డల పెళ్ళిళ్ళు అనీ, పురుళ్ళనీ, వాళ్ళ పిల్లల ముద్దు ముచ్చట్లనీ, ముసలివాళ్ళ సేవలనీ విసిగిపోయిన నిన్నుచూసి, నీకష్టం నా కూతురికి రాకూడదని ఒక కన్నతండ్రిగా ఆశపడటం తప్పంటావా పార్వతీ?" అన్నాడు.
    
    "ఏమిటండీ కష్టం? "వదినా! మా యింట్లో నీ చెయ్యిలేకుండా శుభకార్యం జరగదు!" "పెద్దమ్మా! నువ్వు పెడితే కానీ అన్నం తినం..." "అత్తయ్యా! నీ దగ్గర నాలుగు రోజులు ఉంటాము!" అంటూ అందరూ నా మీద ఆధారపడి న అచుట్టూ తిరగడాన్ని చూసి నేనెంత పొంగిపోయేదాన్నో మీకు తెలుసా? మనిషిని పట్టించుకోకపోవడం.... మనిషి సాటివాడికి పనికిరాని వస్తువుగా మారడం మించిన నరకం లేదండీ! ఈ నాలుగు నెలలూ నాకు నాలుగు యుగాలుగా గడిచాయి. ఒక పక్షపాతం రోగిలా నాశరీరం, మనసూ చచ్చుబడిపోయినట్లుగా గడిపాను. కేవలం మీ కోసం ఆనందం నటించాను. మీకు మాత్రం యిక్కడ దొరికిన ఆనందం యేమిటండీ? సూటూ బూటు వేసుకుని నాలుగు బజార్లూ మనం ఇద్దరం తిరగడంలో నిజమైన సంతోషం లభించిందా? వరదరాజపురంలో మనకి కోడితో తెల్లవారేది.. ఇలకోడితో రాత్రయ్యేదీ! మధ్యలో ఎంత పని? అత్తయ్య సపర్యలు, చిన్నవాళ్ళ బాగోగులు.... పనివాళ్ళమీద అజమాయిషీ! నా పాంజేబులు ఇంట్లో ఘల్లుఘల్లుమణి ఎన్ని రోజులయిందీ? ఆ కొండమీద కోదండరాముడూ, నా గోదారమ్మ తల్లీ..... పంటచేల పచ్చదనం.... పలకరింపులతోనే పన్నీటివాన కురిపించే నా ఊరి మనుషులూ.... ఇవన్నీ లేని బతుకు ఎందుకండీ? ఏ క్లాసు ఖైదీలాంటి ఈ జీవితం కోసమా మీరు కొట్టుకుపోయిందీ? అక్కడ నా రాధ... ఎలా ఉందో ఏమో? నచ్చినవాడిని మనువాడుతా నన్నందుకా దానికీ శిక్ష? ఇదా మీ తండ్రి ప్రేమ..... బిడ్డని ఎలాంటి స్థితిలో చూస్తామో?" అంటూండగానే ఆమెకి దుఃఖం ముందుకు వచ్చింది.
    
    "ఆ చాకిరీ, ఊపిరి సలపని బాధ్యతలూ నీకు కష్టం అనిపించేవి కావా పారూ!" అర్ధం కానట్లు ఆమెను కొత్తగా అప్పుడే అర్ధం చేసుకుంటున్నట్లూ అర్ధాంగివైపు విచిత్రంగా చూస్తూ అడిగాడు సుబ్బారాయుడు.
    
    ఆమె కళ్ళు తుడుచుకుని, "లేదండీ.... అలా వాళ్ళందరూ న అచుట్టూ తిరుగుతూ నామీద ఆధారపడడం నాకు గొప్ప సంతృప్తి నిచ్చేది! ఆ ఇంటి సుఖం, సంతోషం.... బరువులూ బాధ్యతలూ నేనే మోస్తున్నానన్న భావన. నన్ను హిమాలయంలా ఎత్తుగా నిలిపింది! వాళ్ళకు నేను చేసింది చాకిరీ కాదండీ! పెద్దరికం! జీతగాళ్ళని పెట్టి డబ్బులు పారేసి చేయించుకోలేక కాదండి..... కలసి మెలసి పని చేయించుకోవడంలో ఆ పల్లెలో మేమంతా ఒక్కటి అనే భావనని బలపరుచుకునే వాళ్ళం. అత్తా.... అమ్మా.... పిన్నీ.... బాబాయ్.... మావయ్యా అనే ఆత్మీయమైన పిలుపులే విడిపూలని కలిపే దారంలా పనిచేసే అనురాగ మూలికలల్లుతాయి ఎదుటి వాడిని కర్రెత్తి నెత్తిన కొట్టాలన్నంత కోపం వచ్చినా, వాడి భార్య అపురూపంగా పిలిచే 'అన్నయ్యా' అన్న పిలుపు గుర్తొచ్చి కర్ర దించనివాడు పల్లెలో ఉండడు. అందుకే పెద్దలు కొన్ని సంప్రదాయాల్నీ, కట్టుబాట్లనీ పెట్టారు. ఎవరికి వారే యమునా తీరే అని బతికితే, ఇదిగో.... ఇలాగే ఆపదొచ్చినప్పుడు ఆదుకునే దిక్కూ, కన్నీళ్ళు కారిస్తే తుడిచే చెయ్యీ ఉండదు! నా కూతుర్ని అలాంటి అభాగ్యపు బ్రతుకు బ్రతకమని శపించకండి. అనుబంధాలూ, ఆత్మీయతలూ గోరుముద్దలుగా తిని పెరిగిన పిల్లది. ఇలాంటి జీవితం అది జీర్ణించుకోలేదు!" అంది.
    
    ఎంత బాగా చెప్పావు పార్వతీ! ఇంటికి పెద్దకొడుకుగా పుట్టి ఎంతో కష్టపడుతున్నానని ఇన్నాళ్ళూ అనుకుంటూ వచ్చాను. ఇక్కడ ఈ చౌకీదారూ, చెప్పులు కుట్టేవాడూ కూడా మర్యాద ఇవ్వక ఎంతో మదనపడ్డాను. అక్కడ నాకోసం నేను నోరు తెరిచి చెప్పే మాటకోసం ఎదురుచూస్తున్న నా మనుషులున్నారు. పద..... మూర్ఖత్వంతో మాధవ్ నీ, రాధనీ ఎంతో బాధపెట్టాను. కేశవుడు ఎంత హుందాగా ప్రవర్తించాడూ! ఎలాగైనా చదువుకున్నవాడు చదువుకున్నవాడేనే! అసలు హైదరాబాదు వెళ్ళినప్పుడు చూశాను..... వాడొస్తుంటే కలెక్టరైనా ఆగి నమస్కారం పెడ్తాడే.....మినిష్టరైనా వాడు ఫోన్ చేస్తే చాలు..."
    
    పార్వతమ్మ నవ్వుతూ "మళ్ళీ మొదలుపెట్టారా మీ కేశవుడి సుత్తీ? ఈ మధ్య తప్పిపోయిందనుకున్నాను!" అంది.