సూర్యవంశీ మూగవాడిలా ఆయన వేపు చూసాడు.
    
    మళ్ళీ ఆయనే తేరుకున్నాడు.
    
    "నేను ఇవన్నీ చెప్తున్నానంటే, పిరికి తనంతోకాదు- నేను పిరికి వాడ్నికాదు -ఈ సమాజాన్నీ, ఈ వ్యవస్థనూ, ఆకళింపు చేసుకున్న వ్యక్తిని -నీలాగా నాకూ ఆత్మవిశ్వాసం, శ్వాస....ధైర్యం.... ఉన్నాయి. భయపడేవా డెప్పుడూ... జీవితాన్ని జయించలేడు.... నీలో నాకు నచ్చిన గుణం అదే.... ఆవేశం ఒక్కటే మనిషికి పనికిరాదు... మేధస్సు.... ఈనాటి సమాజాన్ని పీడిస్తున్న అతిభయంకరమైన పొలిటికల్ పవర్ ని ఢీకొనాలంటే.... మేధస్సు....మేధస్సుకావాలి....ఎత్తులు, పై ఎత్తులు.... డ్రామాలు.... వెరసి, ప్లే దాని ముసుగులూ, తొలగించే మగాడు, మొనగాడు కావాలి....అప్పుడు ఒక కేసుకాదు.....ఎన్నో కేసులు బయటికొస్తాయి. నిజంగా ఆ రోజుకోసం, నేను ఎదురుచూస్తున్నాను...." చెప్పి సిగరెట్ వెలిగించాడాయన.
    
    "చెప్పండి...సర్... నన్నేం చెయ్యమంటారు" ద్రోణుడ్ని, అర్జునుడు అడిగినట్టుగా అడిగాడు సూర్యవంశీ.
    
    "ఈ కేసుని, సిన్సియర్ గా టేకప్ చేస్తావా...." మళ్ళీ నిరంజనరావు ఆ ప్రశ్న వేయడం ఆశ్చర్యంగా ఉంది సూర్యవంశీకి.
    
    "ఎస్సర్... ఇవాళ మీకు ప్రయాణంచేసి చెపుతున్నాను... ఈ కేసు వెనక, ఎంతటి భయంకరమైన వ్యక్తులున్నా, వాళ్ళను నేను ఢీకొనడానికి సిద్దంగా ఉన్నాను.... అవసరమైతే..." సూర్యవంశీ పెదాల్ని, తనవేళ్ళతో మూసాడు ఎ.సి.పి. నిరంజనరావు.
    
    "నీ కార్యదీక్ష, నీ మేధస్సు, నీ ఆత్మవిశ్వాసమ్మీద నాకు నమ్మకం ఉంది. ఈ కేసుని నువ్వు డీల్ చెయ్యి... ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్... చచ్చిపోయినవాడు బబ్లూ అని నువ్వు నాకు కన్ ఫర్మ్ చెయ్యగలిగితే.... నువ్వేం కోరుకున్నా.... నేనివ్వడానికి సిద్దంగా ఉన్నాను.....ఈ కేసుకి, ఎంత అవసరం అవుతుందో, ఆ ఎమౌంట్ ని, నా పాకెట్లోంచి ఇవ్వడానికి నేను సిద్దంగా ఉన్నాను...."    

    ఆశ్చర్యంగా నిరంజనరావు కళ్ళవేపు చూశాడు సూర్యవంశీ.
    
    "ఈ విషయం... నీకూ, నాకూ తప్ప, మరెవ్వరికీ తెలియడానికి వీల్లేదు....కేసుని, నువ్వెక్కడనుంచి స్టార్ట్ చేసినా నాకు రిజల్ట్స్ ముఖ్యం! ఇంకో విషయం...నాకీ కేసు వారం రోజుల్లో సాల్వ్ కావాలి..."
    
    "అంటే... 168 గంటలు కరెక్టుగా....168 గంటలు పూర్తయ్యేలోపల నేను మీ ముందుంటాను..... ఎప్పటికప్పుడు....డిటైల్స్... ఫోన్ ద్వారా చెప్తాను.....ఓకే...సార్" లేచి నిలబడ్డాడు సూర్యవంశీ అప్రయత్నంగానే పోలీసు పద్దతిలో సెల్యూట్ చేశాడు.
    
    నిరంజనరావు పెదవులమీద చిరునవ్వు కదలాడింది.
    
                                                     *    *    *    *    *
    
    బబ్లూ కేసుని సూర్యవంశీ టేకప్ చేయటానికి వేరే కారణం ఉందన్న సంగతి నిరంజనరావుకి తెలీదు. సూర్యవంశీ కావాలనే చెప్పలేదు.
    
    తన గురువు, దైవం అయిన జగన్నాయకులు హత్యకు కారణం ఏదో ఒక వివాదస్పదమయిన భూమని సూర్యవంశీకి చూచాయగా తెలుసు.
    
    అదే లాండ్? దాని యజమాని ఎవరు? ప్రస్తుతం ఆ యజమాని ఎక్కడున్నది? దాన్ని ఎవరు కబ్జాచేసుకున్నది? దాని గురించి జగన్నాయకులు సేకరించిన నిజం ఏమిటి? అనే వివరాలు తెలీదు.
    
    నగరంలో పేరుమోసిన భుజకారుసుడు హోంమంత్రి జనార్ధన్ ఠాగూర్ అన్న విషయం జగమెరిగిన సత్యం.
    
    చంపబడ్డాడనుకుంటున్న రౌడీ షీటర్ బబ్లూ, జనార్ధన్ ఠాగూర్ మనిషని నిరంజనరావు చెప్పిన దగ్గర్నుంచి - ఏదో అనుమానం సూర్యవంశీలో వేళ్ళూనుకుంది.
    
    జగన్నాయకులు హత్యగావింపబడే క్షణంవరకు ఆయన పరిశోధిస్తున్నది ఒక భూకబ్జా గురించి-
    
    భూకబ్జాలకు మకుటంలేని మహారాజు జనార్ధన్ ఠాగూర్.
    
    ఆ జనార్ధన్ ఠాగూర్ అనుచరుడే బబ్లూ....వీటిమధ్య కళ్ళకు కనిపించని లింకేదో ఉన్నట్లుగా తోస్తోంది-ఏ చిన్న ఆధారం దొరికినా కేసు మొత్తం కూకటి వేళ్ళతో కదిలిపోతుంది.
    
    అందుకే బబ్లూ కేసుపట్ల శ్రద్ద కనబర్చాడు సూర్యవంశీ.
    
    ఈ గందరగోళాల మధ్య బావా అంటూ వచ్చిన అమ్మాయి ఎవరు? నన్ను మళ్ళీ చూడాలనుకుంటున్నారు గదూ? నాపేరు తెలుసుకోవాలను కుంటున్నారు గదూ? నా పేరు తెల్సుకోవటం చాలా ఈజీ.... మనిషి ఆలోచనల వెనుక ఉండేది నేనే.... కనుక్కోండి చూద్దాం.... అంటూ ఛాలెంజ్ చేసిన ఆ అమ్మాయి పేరేమిటి? ఏమై ఉంటుంది?
    
    మనిషి ఆలోచనల వెనుక ఉండేది నేనే అంటూ ఆ అమ్మాయి వదిలిన పజిల్ వెనుక దాగున్న పేరేమిటి?
    
    ఈ అమ్మాయికి - బబ్లూ చావుకి - జనార్ధన్ ఠాగూర్ ఏక్టివిటీస్ కి- జగన్నాయకుల చావుకి ఏదైనా లింకు ఉందా....?
    
    లేదంటే సడన్ గా ఈ టైమ్ లోనే ఆ అమ్మాయి ఎందు కూడిపడుతుంది.
    
    చూస్తే పిచ్చిదానిలా లేదు-
    
    పిచ్చిదయితే - తన బైక్ మీద - తన రూమ్ కే వచ్చి- తన రూమ్ ని శుభ్రంచేసి- పొందికైన అక్షరాలతో ఒక లెటర్ రాసి-అక్కడ వదిలి ఎలా వెళ్తుంది?
    
    తనపేరు కనుక్కోమని క్లూ ఎలా ఇచ్చి వెళ్తుంది?
    
    ఎక్కడో పీటముడి పడింది-
    
    ఆ ముడి వెనుకే అసలు రహస్యం దాగి ఉండాలి-
    
    దాన్నెలా ఛేదించటం...?
    
    డి.ఐ.జి. బబ్లూ కేసుని పొడిగించటానికి - పరిశోధించటానికి ఎందుకు అంగీకరించటంలేదు?
    
    చనిపోయింది నిజంగానే బబ్లూ అయితే జనార్ధన్ ఠాగూర్ తన శత్రువుల మీద ఎటాక్ చేయకుండా ఉంటాడా?
    
    పగ ప్రతీకారంతో రగిలిపోకుండా ఉంటాడా? అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం - బబ్లూ ఐడెంటి ఫికేషన్స్ పోలీస్ రికార్డ్ లో లేకపోవటం-
    
    బబ్లూ ఎత్తు ఆరడుగుల మూడంగుళాలు... సన్నగా పొడవుగా ఉంటాడు- బబ్లూ కుడిచేతికి వెండి కడియం ఉంటుంది - ఒక క్రిమినల్ లోని గుర్తు పట్టగలిగే ఐడెంటిఫికేషన్స్ ఇలా? ఎంత హాస్యాస్పదంగా ఉంది-
    
    ఫోటో లేదు-వేలిముద్రలు లేవు - ఫుల్ ఫిజికల్ మెజర్ మెంట్స్ లేవు - స్పెషల్ ఫీచర్స్ ఏమీలేవు-వాడు నేరాలుచేసే పద్దతులు తెలీవు-అందుకు ఏ ఆయుధాలు ఉపయోగించేది అంతకంటే తెలీదు. వాడుండే ప్రాంతం గురించి తెలీదు - కాని బబ్లూ జనార్ధన్ ఠాగూర్ మనిషని పోలీసులకి తెలుసు-