పక్కమీద బద్ధకంగా దొర్లుతున్న సుబ్బారావుని ఊదరగొట్టిలేపి, జిడ్డుమొహం కడిగించి చాకంటి లుంగీ, షర్టు తొడుక్కునేవరకు ప్రాణాలు తీసింది.
    "ఏమిటీ హడావిడి? వాడేం గవర్నరా, మినిష్టరా? వాడికోసం నాకెందుకీ ముస్తాబు? కొత్తవాడిని గనకా" అన్నాడు సుబ్బారావు జ్యోతి ముస్తాబు పరీక్షిస్తూ.
    జ్యోతి కాస్త సిగ్గుపడింది అతని చూపులు గుర్తించి. "బావుంది. ఎవరన్నా వచ్చేసరికి జిడ్డుమొహం వేసుకుకూర్చోవాలా ఏమిటి?" అంది దబాయింపుగా.
    ఐదున్నరకి మురారి వచ్చాడు. జ్యోతి అట్టహాసంగా, సుబ్బారావు ఆదరంగా ఆహ్వానించాడు.
    "సంతోషం, ఇన్నాళ్ళకయినా వచ్చారు" అంది జ్యోతి.
    "ఏదండీ! ఎక్కడ తీరుబాటు? నెలకి సగంరోజులు అటు ఇటూ తిరగడమే సరిపోతుంది. మిగతారోజులు ఆఫీసులో ఊపిరాడదు. కంపెనీవాళ్ళు జీతాలిస్తారు. ఇచ్చినదానికి సరిపోయేట్టు మనల్ని పిండుతారు. అన్నింటికంటె తిరగడం మహా బోరుగా వుంది....."
    "చక్కగా ప్లేనుల్లో తిరగడానికి విసుగెందుకు?" జ్యోతి నవ్వుతూ అంది.
    "ప్లేనుల్లో తిరగడం నీకు, నాకు సరదా. ఎప్పుడూ వెళ్ళేవాళ్ళకి ఏం సరదా?" సుబ్బారావు అన్నాడు.  
    "ఊ - ఇంట్లో మీకేమిటి కాలక్షేపం? ఏంచేస్తారు  రోజంతా?" అన్నాడు మురారి జ్యోతితో.
    "కాలక్షేపం ఏముంది? బోర్ కొట్టి చస్తాను. ఏదో వున్న పత్రికలు చదవడం, తినడం, పడుకోడం. అంతకంటే ఏంచేస్తాను" ఆమె నిర్లిప్తంగా అంది.
    "సాయంత్రం రోజూ ఎటన్నా వెడతారా షాపింగ్ కి, సినిమాకి?"
    "ఒరేయ్ - అసలే ఆవిడ పోరుతో చస్తున్నాను. నీవింకా నేర్పిపెట్టేట్టున్నావు. రోజూ సినిమాలు, షికార్లు నేనేం నీలాగా నాలుగువేల రూపాయల జీతగాడిని అనుకున్నావురా? రోజూ బయటికి వెడితే ఆరిపోతాం? సుబ్బారావు హాస్యంగా నవ్వాడు.
    మురారి నవ్వేసాడు. "మా ఇంట్లో బోలెడు మేగజైన్స్, ఇంగ్లీష్ నవలలు వున్నాయి. ఈసారి వచ్చినప్పుడు తెస్తాలెండి కావాలంటే" అన్నాడు.
    "ప్లీజ్." అంది జ్యోతి. లోపలికివెళ్ళి టిఫిను తీసుకొచ్చింది.
    "అయ్యో! ఇవన్నీ ఎందుకండీ చేశారు?" నొచ్చుకుంటూ అన్నాడు మురారి.
    "బాగుందిరా. నాలుగువేల జీతగాడివి, కారున్నవాడివి. నీలాంటి గొప్పవాడు మాలాంటివాడి ఇంటికివస్తే యీ మాత్రం చేయద్దురా? పాపం మా ఆవిడ కోసం ఎంత శ్రద్ధగా చేసిందో అన్నీ చూడు" అన్నాడు చమత్కారంగా గది, టిఫిన్ ప్లేటు చూపిస్తూ.
    జ్యోతి మొహం సిగ్గుతో కందింది. ఏమిటీయన అనేమాట, అననిమాట తెలీదు. తనకోసం అలంకరించాం అనుకుంటే ఎంత సిగ్గు. మొగుడు వైపు కోపంగా చూసింది. లజ్జితురాలైన జ్యోతి మొహంలోకి చూసి -
    "నోర్ముయరా ఫూల్. పాపం భర్తగారి స్నేహితులని ఆహ్వానించడానికి ఇంత శ్రద్ధగాచేస్తే వెధవ వేళాకోళం నీవూ." అన్నాడు హల్వా తింటూ. "చాలా బావుందండీ. ఎంతయినా ఇంట్లో ఆడవాళ్ళుండి చేసేది వేరుగా వుంటుంది. మా వంటవెధవ వున్నాడు. అన్నింటికీ ఒకటే రుచి తెస్తాడు" అన్నాడు మురారి.
    "అందుకేరా నాయనా! త్వరగా ఓ ఇంటివాడివి అవు. పకోడీలు చాలా బాగున్నాయ్. ఇంత బాగా మా ఆవిడ ఈరోజే చేసింది. అదృష్టం నీది" అన్నాడు సుబ్బారావు నవ్వుతూ.
    "ఎప్పుడూ నా మొహాన ఇంత ఉండలుండల ఉప్మా పారేస్తుంది" హాస్యంగా అన్నాడు.
    "అబ్బ. వూరుకుంటారా, నిజం అనుకుంటారు ఆయన" జ్యోతి కసిరింది.
    "మైగాడ్. అబద్ధమా? ఒరేయ్ ఓరోజు చెప్పాపెట్టకుండా రారా. మా ఆవిడని, ఇల్లుని, మా ఆవిడ నాకిచ్చే ట్రీట్ మెంటుని, మా ఆవిడ చేసిన ఉప్మాని చూద్దుగాని" అన్నాడు సుబ్బారావు మరింత హాస్యంగా.
    జ్యోతి మొహం ఎర్రబడింది. "మావాడి కబుర్లు కేంలెండి. ఇంట్లో భార్యలు చక్కగా అమరుస్తుంటే నీలాంటివాళ్ళు ఇలాగే అంటారులే. బయటతింటే ఏం చెత్తో తెలుస్తుంది."
    "పోరా. ఈవిడగారు వచ్చి పట్టుమని నాలుగునెలలు కాలేదు. ఇన్నాళ్ళు బైటలేనా ఏమిటి? నీకెందుకంత అసూయ? నీవూ చక్కగా పెళ్ళాడి, ఓ ఇల్లాలుని తెచ్చుకో హాయిగా. అప్పుడా సుఖం నీకూ అర్థం అవుతుంది. ఒరేయ్ నాయనా. పెళ్ళి అయ్యేవరకు అందులో మజా కనిపిస్తుంది. అయ్యాకగాని మనం ఎంత మునిగామో తెలియదు....."సుబ్బారావు అన్నాడు నవ్వుతూ,
    "ఏమిటండీ! మావాడ్ని అష్టకష్టాలు పెడుతున్నట్టున్నారు - ఇలా మాట్లాడుతున్నాడేమిటి? కొత్తగా పెళ్ళిచేసుకున్నవాడివి. అప్పుడే ఏం కష్టాలు వచ్చాయిరా నాయనా నీకు?"
    "ఏమో! ఆ కష్టాలేమిటో ఆయన్నే అడగండి, లేదంటే పెళ్ళిచేసుకుని స్వయంగా తెలుసుకోండి" అంది దబాయింపుగా జ్యోతి.
    "ఒరేయ్! హాస్యానికేంగానీ, ఇంకా పెళ్ళెప్పుడురా చేసుకుంటావు?"
    "ఏదీ, మొన్ననేగా ఫారిన్ నుంచి వచ్చాను. కాస్త ఉద్యోగంలో సెటిలయ్యాను. ఇంక చూడాలి. ఇంట్లో మా అమ్మ ప్రాణాలు తీస్తుంది. రెండు మూడు సంబంధాలు చూశాను. నచ్చలేదు. ఒకటి వుంటే మరోటి వుండదు" అన్నాడు మురారి కాస్త సిగ్గుపడుతూ.
    "అంటే రంభ, ఊర్వశుల్లా అందం, విద్యాసరస్వతి, లక్ష్మీపుత్రి - ఇవన్నీ ఉన్నమ్మాయి కావాలా? మీ కోరిక ఏమిటో చెప్పండి. మేము వెతుకుతాం రోడ్లన్నీ" జ్యోతి సరదాగా అంది.
    "కోరికలకేం భాగ్యం? మీరన్నవి అన్నీ కావాలని ప్రతివాళ్ళకీ వుంటుంది, దొరకాలిగా?" మురారి నవ్వాడు.