ఇంద్రధనుస్సులా ఉన్న ఓ ఏడురంగుల డ్రెస్సుని చేతిలో పట్టుకుని సంశయంగా అప్సర వైపు చూసింది మరియం.

 

    నవ్వింది అప్సర. "అది నీ సొంతం...: ఇంక నీ డ్రెస్సు నాకు యివ్వు" అంది.

 

    బాత్ రూమ్ లో కెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చింది మరియం. తను విడిచిన పాత స్కర్టునీ, టాప్ నీ జంకుతూ అప్సరకి యిచ్చింది.

 

    "ఇంక నువ్వు వెళ్ళు" అంది అప్సర.

 

    "మిగిలిన పని..."

 

    "రేపు చేద్దువుగాని: ఇదిగో ఇది ఉంచు" అని ఒక నోటు అందించింది అప్సర. అది ఐదు వందల హాంగ్ కాంగ్ డాలర్ల నోటు చాలా పెద్ద సైజ్ లో వుంటుంది. "నీ ఇష్టం వచ్చింది కొనుక్కో" అంది.  

 

    మరియం మొహం వెలిగిపోయింది. వందనం చేసి వెళ్ళిపోయింది సంతోషంగా.

 

    మళ్ళీ గుర్తుకొచ్చింది ఆ పాట.

 

    "ఇంకోళ్ళకి సంతోషం కలిగించటంతోనే
    నీకు సంతోషం కలుగుతుంది."

 

    ఎంత నిజం:

 

    సన్నగా కూనిరాగం తీస్తూ, మరియం బట్టలను తను వేసుకుంది అప్సర. మొహానికి ఉన్న కొద్దిపాటి మేకప్ ని సోపుతో కడిగేసుకుంది... సాధ్యమైనంత సాదాగా కనబడటానికి మరికొన్ని ప్రయత్నాలు చేసి తరువాత అపార్ట్ మెంట్ లాక్ చేసి బయటికి వచ్చింది.  

 

    కనీసం ఈ ఒక్కరోజయినా, ఒక్కరోజయినా తను టెన్షన్స్ లో నుంచి బయటపడి, మామూలు ఆడపిల్లలాగా గడపాలి.  

 

    ఈ కృత్రిమ శృంఖలాలు తెంచుకొని ఒక్కరోజయినా గుండెనిండా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలి.

 

    లేకపోతే తనకు పిచ్చెత్తిపోతుంది: నిజం:

 

    పార్కింగ్ లాట్ లో ఆమెకు రెండు కార్లున్నాయి. కానీ వాటివైపు పోలేదు అప్సర. బస్ టెర్మినస్ వైపు నడిచింది. హాంగ్ కాంగ్ లో బస్సులు చాలావరకూ డబుల్ డెక్కర్లు, మధ్యలో కాకుండా టెర్మినస్ లో ఎక్కితే, బస్సు ఫై అంతస్తులో కూర్చుని ఊరంతా తీరిగ్గా చూడొచ్చు. డ్రయివర్ దగ్గర ఉన్న కాయిన్ బాక్స్ మీద ఏ స్టేజీకి ఎంత ఛార్జి అవుతుందో రాసివుంది. కొన్ని నాణాలు అందులో పడేసి పై అంతస్తులో ఒక సీటులో కూర్చుంది అప్సర. ఆమె కూర్చోగానే ఆమె పక్కనఒకతను వచ్చి కూర్చున్నాడు.         

 

    కొద్దిగా జరిగి, అతనివైపు చూసింది అప్సర. బాగా పొడుగ్గా ఉన్నాడతను. చూడగానే ఇండియన్ అని తెలిసిపోతుంది. ఒత్తయిన నల్లటిజుట్టు, పది జేబులు వున్న తెల్ల లూజ్ షర్టుని నల్లటి బాగీ ప్యాంటులోకి టక్ చేశాడు.  

 

    టిక్కెట్టు కొనగా మిగిలిన కాసిని డబ్బులు అతని చేతిలోనే వున్నాయి. అవి లెక్ఖ పెట్టుకుని, "ఇన్ని జేబులు వున్నాయి గానీ జేబుల నిండా డబ్బులు లేవు" అన్నాడు నవ్వుతూ. ఆ మాటలు అతను వున్న స్థితిని చాటిచెప్పడానికంటే, ఆ అందమైన అమ్మాయితో మాటలు కలపడానికి ఉద్దేశించినట్లే ధ్వనిస్తున్నాయి.

 

    సమాధానంగా నవ్వింది అప్సర. తర్వాత ఆమెకు హఠాత్తుగా ఏదో స్ఫురణకు వచ్చి, అతనివైపు చురుగ్గా చూసింది. అతనెవరో గుర్తుకువచ్చింది ఆమెకు.

 

    "మొన్న డ్రాగన్ కాసినోలో రష్యన్ రూలెట్ ఆడుతూ పదిలక్షల డాలర్లు పందెం కట్టి ఓడిపోయింది మీరే కదూ?" అంది.

 

    "అవును." అన్నాడతను.

 

    "ఆ రోజున అక్కడున్న వాళ్ళందరూ మీమీద జాలిపడ్డారు. కానీ మీరు మాత్రం ఏమాత్రం బాధపడినట్లు కనబడలేదు."

 

    తేలిగ్గా అన్నాడు అతను. "డబ్బుదేముంది: ఇవాళ వస్తుంది: రేపు పోతుంది: ఎల్లుండి మళ్ళీ వస్తుంది: డబ్బంటే నాకు చాలా నిర్లక్ష్యం. మన కోసం డబ్బుగానీ డబ్బుకోసం మనం కాదు. కాదంటారా?"

 

    మాట్లాడకుండా అతనివైపే చూస్తూ వుండిపోయింది అప్సర. తరువాత నెమ్మదిగా అంది. "మీ పేరు?"

 

    "రుద్రప్రసాద్: మీ పేరు?"

 

    కొద్దిగా తటపటాయించి "జలంధర అంది అప్సర. తర్వాత ఆ పేరుని పదిసార్లు మనసులోనే అనుకుంది. జలంధర... జలంధర... ఈ పేరు మర్చిపోయి మళ్ళీ మరో పేరు చెప్పకూడదు తను.

 

    "హాయ్ జలంధరా:"

 

    "హాయ్ రుద్రప్రసాద్:"

 

    ఇద్దరూ నవ్వుకున్నారు.

 

    మామూలుగా అయితే కొత్తవాళ్ళతో అంత త్వరగా మాట్లాడదు అప్సర. కానీ ఇవాళ వేరు. కొత్త ప్రపంచాన్నీ, కొత్త మనుషులనీ చూడాలి తను.

 

    వద్దనుకుంటున్నా మళ్ళీ టెర్మినస్ వచ్చేదాకా ఆలోచనల్లోనే వుండిపోయింది అప్సర. అబర్డీన్ మెరీనా రెస్టారెంట్ కి మైకేల్ వచ్చి వుంటాడా? తనవల్ల డాడీకి ఒక డీల్ నష్టమైపోయింది. నష్టం ఎన్ని లక్షలలో లేదా, కోట్లలో వుంటుంది?