"తన ఇల్లు ఇదని ఇప్పుడే తెలియజెప్పటం యిష్టంలేక అలా చేసుండవచ్చుగా?" మాథ్యూస్ ఎక్కడో ఆలోచిస్తూ అంది.

 

    "అయితే ఇప్పుడు పూజ స్థావరం కనుక్కోవడమే మనముందున్న ప్రధాన కర్తవ్యం. అవునా?"

 

    "అవును."

 

    "మరేం చేద్దామంటారు?" అడిగాడు యోగి.

 

    "ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది ఫ్లోర్సులో వున్న ఏదో ఒక ఫ్లాట్ లో పూజ నివసిస్తోందన్నది పచ్చి నిజం. అపశృతుల హార్మోనియంగాడి ఫ్లాట్ కి దగ్గర్లోనే ఆమె ఫ్లాట్ కూడా వుందన్నది అంతకంటే పచ్చినిజం! కనుక మనమిప్పుడు చిన్న ట్రిక్ ప్లే చేయాలి..." అందామె, మరోపక్క ఆలోచిస్తూనే.

 

    "ఏమిటా ట్రిక్?" ఆతృత పడిపోతూ అడిగాడు శ్రీధర్.

 

    "ఈ రోజు వదిలేయండి. రేపు రాత్రికి సరీగ్గా ఏడింటికి పూజ నీకు ఫోన్ చేసేలా నువ్వు చూసుకోవాలి. ఆమెను స్వీట్ నథింగ్స్ లోకి తీసుకెళ్ళి షుమారు గంట సేపైనా ఫోన్ లో నువ్వు ఆమెతో మాట్లాడుతూ వుండాలి. అప్పుడు నీ దగ్గర స్టాప్ వాచీ ఒకటి పెట్టుకోవాలి.

 

    ఈలోపు నేను ఐరన్ రాడ్ తీసుకుని ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది ఫ్లోర్స్ లో వున్న బాల్కనీల్లోకి వెళ్ళి, ఆ రాడ్ తో సీలింగ్ ని కొడుతుంటాను.

 

    నీకెప్పుడయితే ఫోన్ లో ఠంగ్...ఠంగ్...మని సౌండ్ వినిపిస్తుందో, అప్పుడు నువ్వు నీదగ్గరున్న స్టాప్ వాచ్ ని నొక్కేయాలి.

 

    అదే సమయంలో నేనిక్కడ ఏ ఫ్లాట్ దగ్గర, సరీగ్గా ఎన్ని నిమిషాలకు సౌండ్ చేశానో నోట్ చేసుకుంటూ వెళతాను. నువ్వు స్టాప్ వాచ్ ని నొక్కిన సమయానికి నేనే ప్లాట్ దగ్గర సౌండ్ చేశానో, అది స్క్రిబ్లింగ్ పేడ్ మీద రికార్డయి వుంటుంది.

 

    ఆ రెండూ ఐడెంటికల్ కాగానే ఆమె ఏ ఫ్లాట్ లో వుంటోందన్నది తేలిగ్గా తెలిసిపోతుంది.

 

    ఆ తరువాత ఆ ఫ్లాట్ మీద మీరు కాకుండా, నేను నిఘా వేస్తాను. ఆమె లోపలకు వెళుతూ, వస్తూ, నాలుగైదుసార్లు నాకు కనిపించగానే, ఆమెని రెడ్ హేండెడ్ గా పట్టుకుంటాను. ఇదీ నా ప్లాన్...ఎలా వుంది?" అందామె ఆ యిద్దరి మొహాలకేసి పరిశీలనగా చూస్తూ.

 

    ఆ ఇద్దరూ ఆమె తెలివితేటలకు దిమ్మెరపోయి, కొద్దిక్షణాలవరకు సౌండ్ లేకుండా వుండిపోయారు.

 

    "ఫెంటాస్టిక్... ఫెంటాబ్యులస్...ఇంక్రిడబుల్...మదరిండియా! అందుకేనేమో నథింగ్ బీట్స్ ఎక్స్ పీరియన్స్ అనేది. మీ ప్లాన్ అమోఘం! అయితే రేపు రాత్రికి ఈ సస్పెన్స్ కి భరత వాక్యం పలకవచ్చు" యోగి మహదానంద పడిపోతూ అన్నాడు.

 

    "మార్వలెస్ మమ్మీ! రేపు రాత్రికి ఏదో రకంగా ఏడు గంటలనుంచి ఎనిమిది గంటలవరకు ఆమెను ఏదో మాటల్లో పెట్టి మాట్లాడుతూనే వుంటాను" అన్నాడు శ్రీధర్ ఆనందోద్వేగంతో.

 

    మరో గంట అక్కడే గడిపి, డిన్నర్ పూర్తిచేసుకున్నాక శ్రీధర్ తన ఫ్లాట్ కి వెళ్ళిపోతే, యోగి నిర్మల ఫ్లాట్ కెళ్ళిపోయాడు.


                                *    *    *    *


    "ఇంద్రియ వాంఛల్ని తీర్చుకోవటం అన్నది మనిషికి గాలి, ఆహారం, నీరు ఎంత అవసరమో- అంత అవసరం. దాన్ని నేను కాదనలేను. కానీ స్త్రీ కూడా మనసులో సదరు వ్యక్తి మీద ప్రేమానురాగాల్ని నింపుకుని, వాంఛని ప్రోదిచేసుకుని, తనని తాను మనస్పూర్తిగా అర్పించుకున్నప్పుడే శృంగార స్వర్గానికి తలుపులు తెరుచుకునేది" అంది నిర్మల కిచెన్ లోంచి బ్లాక్ టీ తెస్తూ.

 

    "నేనంటే నీకిష్టం పోయిందా?" అడిగాడు యోగి. ఆమె వెనక్కి వెళ్ళి నగ్నంగా వున్న ఆమె మెడమీద సున్నితంగా పెదవులతో స్పృజిస్తూ.

 

    "ప్రేమనేది రాజకీయ మార్పులమీద ఆధారపడే షేర్ మార్కెట్ కాదు..." అంది నిర్మల యోగిని ముందుకి లాక్కుని అతని నుదుటిమీద ముద్దు పెట్టుకుంటూ.

 

    "ఇప్పుడు నేనది కావాలనుకుంటే స్వర్గానికి తలుపులు తెరుచుకుంటాయా?" మైకానికి లోనవుతూ అడిగాడు యోగి.

 

    "ఇప్పటికిప్పుడయితే నరకానికి ద్వారాలు తెరుచుకుంటాయి..." అందామె అతని ఒడిలో వాలిపోతూ.

 

    యోగి బుద్ధిగా ఆమె కురుల్ని సవరిస్తూ వుండిపోయాడు.


                              *    *    *    *


    "నీకు తెలుసు నా బ్యాగ్రౌండ్ ఏమిటన్నది. మా అమ్మా, నాన్న నాకో  సంబంధం తీసుకొచ్చారు. నచ్చలేదు. మరో సంబంధం... మరో సంబంధం... అలా ఎన్నో సంబంధాలు తీసుకొచ్చారు. నాకు నచ్చలేదు. పెళ్ళి అనేది స్త్రీ జీవితంలో గొప్ప సంఘటన...! అతి ప్రమాదకరమైన మలుపు- ఆ తర్వాత జీవితం స్వర్గం కావచ్చు. నరకం కావచ్చు. ప్రాబబిలిటీ మీద బేస్ అయి, రిస్క్ తీసుకోవాలని లేదు నాకు. ఫార్చ్యూస్ టాస్ ఎగురవేయాలని లేదు. అందుకే - చివరిగా, ఈ మధ్య విసుగేసిన పరిస్థితుల్లో మా అమ్మానాన్నలు మరో సంబంధం చూశారు.

 

    అది ఒక రకంగా బాగుందనే అనిపించింది.

 

    కాని అతనేమిటో, అతని మనస్తత్వమేమిటో, అలవాట్లేమిటో తెలీకుండా చేసుకోవడం మంచిది కాదనిపించింది. పైగా అతను మిలియనీర్. అమెరికాలో స్టడీస్. అందుకే అతని అడ్రస్ తీసుకుని యిక్కడకొచ్చి, అతనుండే ఈ ఎదురు ఫ్లాట్స్ లో సెటిలయిపోయాను.

 

    వాస్తవానికి అపరిచితురాలిగా వుంటూ, శ్రీధర్ ని పరిశీలించాలనుకున్నాను. అలాగే చేస్తున్నాను. ఈ లోపు నువ్వోరోజు రెస్టారెంట్ లో సడన్ గా నన్ను శ్రీధర్ కి పరిచయం చేసేశావ్. ఇకప్పటినుంచి ఒక మనిషిని, రెండుగా చీలిపోయి అతన్ని స్టడీచేయడం ప్రారంభించాను..." చెప్పడం ఆపింది పూజ ఉరఫ్ మాళవిక.

 

    చాలాసేపటివరకు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయింది నిర్మల.

 

    "అందుకా ఇన్ని అబద్దాలాడేది...?" షాక్ నుంచి నెమ్మదిగా తేరుకుంటూ అంది నిర్మల.

 

    "అవును" అంది పూజ విలాసంగా.

 

    "దీనికి భారత వాక్యం ఎలా పలుకుతావో?" అడిగింది నిర్మల.

 

    "అదే ...ఆలోచిస్తున్నాను."

 

    "తను, నిన్ను పూజగా ఎక్కువ ప్రేమిస్తున్నాడా? మాళవికగా ఎక్కువ ప్రేమిస్తున్నాడా?"

 

    "పూజగానే కావొచ్చు."

 

    "పూజగా బయటపడితే, మాళవిక కూడా నువ్వేనని తెలిసిపోతుంది. అప్పుడతను నువ్వు మోసం చేశావని భావిస్తే...?"