వేసవిలో స్కిన్ ఆరోగ్యంగా... అందంగా ఉండాలంటే...

 

 

వేసవి వస్తే చర్మ సంబంధిత సమస్యలు ఒక్కసారిగా దాడి చేస్తాయి. స్కిన్ డ్రైగా అయిపోవడం, కళ కోల్పోయి నిర్జీవంగా కనిపించడం, నల్లబడిపోవడం, వేడి పొక్కులు, మొటిమలు, మచ్చలు... అబ్బబ్బబ్బ... ఒక్క ఇబ్బంది కాదు. వీటన్నిటి బారి నుంచి చర్మాన్ని కాపాడుకోవడం తలకు మించిన పని. అయితే అసలు అవి దగ్గరకు రాకుండా చేయడం చాలా తేలికని మీకు తెలుసా? వేసవిలో మనకు దొరికే మామిడిపండుతో వీటన్నిటికీ చెక్ పెట్టొచ్చంటే మీరు నమ్ముతారా? నమ్మండి. ఎందుకంటే ఇది నిజం. రుచులకు రారాజైన మామిడి పండు చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో కూడా దిట్ట. మామిడితో కొన్ని రకాల ఫేస్ ప్యాకులు తయారు చేసి వేసుకుంటే వేడి వేడి సమ్మర్ కూడా కూల్ కూల్ గా మారిపోతుంది. మీ స్కిన్ వేసవిలో కూడా ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది.

మామిడిపండు గుజ్జులో బాదం పొడి, ఓట్స్ పొడి సమపాళ్లలో కలిపి... కొద్దిగా పాలు కూడా చేర్చి పేస్ట్ లా చేసుకోవాలి. దీనితో ఫేస్ ప్యాక్ వేసుకుని, అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే ఎండకు కమిలిన చర్మం మళ్లీ ఫ్రెష్ గా అయిపోతుంది.

మామిడిపండు గుజ్జులో ముల్తానీ మట్టి కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మం తేమగా ఉండి తళుకులీనుతుంది. అలాగే మామిడిపండు గుజ్జులో శనగపిండి, బాదం పొడి కలిపి ప్యాక్ వేసుకుంటే ట్యాన్ పోయి ముఖం మెరుస్తుంది. మామిడిగుజ్జులో ఓట్స్ పౌడర్ కలిపి బాగా రుద్దుకుంటే ఎండకు డల్ అయిపోయిన చర్మం మళ్లీ కొత్త కళను పుంజుకుంటుంది. నిజానికి ఈ పేస్ట్ తో ముఖమే కాదు... కాళ్లు, చేతులు కూడా రుద్దుకోవచ్చు. అదే విధంగా మామిడి గుజ్జులో రోజ్ వాటర్ కలిపి ప్యాక్ వేసుకుంటే నలుపు పోతుంది. స్కిన్ మెరుస్తుంది. మచ్చలు కూడా తగ్గుతాయి. మామిడి, తేనెల మిశ్రమం కూడా చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఈ రెండిటితో పాటు కాసిన్ని పాలు కానీ కాస్త పెరుగు కానీ వేసి ప్యాక్ వేసుకున్నారో... ఇక ఎంత వేడయినా మీ చర్మాన్ని ఏమీ చేయలేదు.

అలాగే మామిడిపండు గుజ్జులో పాలు, కొద్దిగా బాదం నూనె వేసుకుని ముఖం, కాళ్లు, చేతులు రుద్దుకుంటే ఎండ వల్ల వచ్చిన నలుపు పోయి స్కిన్ తళుకులీనుతుంది. అది మాత్రమే కాక... మామిడిపండు, పాలు, అరటిపండు కలిపి గ్రైండ్ చేసి, దానితో వేసుకునే ప్యాక్... చర్మంలోని పొడిదనాన్ని మాయం చేసి, తేమను పుట్టిస్తుంది. నిర్జీవంగా మారిన చర్మాన్ని మళ్లీ కాంతివంతంగా మార్చేస్తుంది.

చూశారు కదా ఎన్ని ఉపయోగాలో! అందుకే ఈ సమ్మర్ లో మీరు మామిడిపండుతో స్నేహం చేయండి. దాని సాయంతో మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి.

 - Sameera