స్పాండిలోసిస్ ఇక దూరం..!

 

 

పొద్దున్న లేచిన దగ్గరి నుంచి..పొద్దు పోయేవరకు ఇంటిల్లిపాది అలనా, పాలనా చూడటం దగ్గరి నుంచి ఆఫీసు పనుల దాకా మహిళలు ఒంటి చేత్తో చక్కదిద్దాల్సి ఉంటుంది. వయసులో ఉన్నపుడు అంతా ఓకే అనిపించినా..వయసు పెరుగుతున్న కొద్ది మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులకు లోనవుతుంటారు. ప్రస్తుతం ఇంటా, బయటా నిరంతర పని ఒత్తిడికి గురవుతుండటంతో ఇవన్నీ చేరి మహిళల ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వాటిలో ఒకటి స్పాండిలోసిస్..సర్వసాధారణంగా మెడనొప్పిలాగా అనిపించినప్పటికి అన్ని రకాల మెడనొప్పులు స్పాండిలోసిస్ కాదు..దీని లక్షణాలు వేరు. స్మోకింగ్, డ్రింకింగ్, కంప్యూటర్లపై ఎక్కువ సేపు పనిచేసే వారికి, డ్రైవింగ్ ఎక్కువగా చేసేవాళ్లకు స్పాండిలోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్ని రోజులు వచ్చి ఆ తర్వాత పోయే మెడనొప్పిని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు.

 

అయితే నెలల తరబడి మెడనొప్పి అలాగే ఉండి భుజం వరకు నొప్పి వస్తుంటే మాత్రం అది స్పాండిలోసిస్‌గా అనుమానించాల్సిందే. మెడ ఎముకలలో అరుగుదల వల్ల, మెడను కదిలించే ప్రదేశంలో ఉండే స్పాంజిలాంటి కండరం పల్చబడి కుషన్‌లా పనిచేసే లక్షణాన్ని కోల్పోవడం వల్ల ఈ మెడనొప్పి వస్తుంది. దీని వల్ల మెడలో, చేతులలో నొప్పి తీవ్రంగా ఉంటుంది. నీరసం కూడా ఎక్కువగా ఉంటుంది. స్పర్శలో మార్పులు వస్తాయి. నొప్పి ప్రాథమిక దశలో ఉంటే చిన్న చిన్న జాగ్రత్తలతో సమస్యను దూరం చేసుకోవచ్చు.

 

* మెడనొప్పి మరీ తీవ్రంగా ఉంటే డ్రైవింగ్ ఆపేయ్యాలి.

* టీవీ చూసే సమయంలో కూడా కాస్త ఆగి చూడాలి.

* కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వారు తల తిప్పకుండా పనిచేయడం మాని కాస్త   మెడను    అటు ఇటు తిప్పుతూ ఉండాలి.

* మెడ మీద అధిక బరువు పడకుండా కూర్చొనే పద్ధతి మార్చాలి.

* కండరాలకు శక్తినిచ్చే వ్యాయామాలు చాలా అవసరం. ముఖ్యంగా భుజాలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం ద్వారా స్పాండిలోసిస్ రాకుండా కాపాడుకోవచ్చు.

* ప్రతి రోజు గుడ్లు, పాలు తీసుకోవడం వల్ల ఎముకలకు కావాల్సినంత బలం అందుతుంది.