లెక్కపెట్టుకుంటూ మెట్లు దిగుతోంది.

 

    చలిగాలి వీచినప్పుడల్లా సన్నటి చలి.

 

    మెట్లు దిగుతూ పక్కకు చూసింది. మెట్ల పక్కన పెద్ద పళ్ళెంతో అమ్ముతున్న పులిహోర, దేవతా ప్రసాదం.

 

    అయిదు రూపాయలకు ఒక పొట్లాన్ని చేతిలో పెట్టాడతను.

 

    తండ్రితో ఒకసారి ద్రౌపది జాతరకు వెళ్ళినప్పుడు కొనుక్కుని తిన్న పులిహోర గుర్తుకొచ్చింది.

 

    హోటల్ కెళ్ళి తీరుబడిగా తినాలి. అప్పటికే అతను రాడని రూఢీ చేసుకున్న నిశాంత గబగబా మెట్లు దిగుతూ-

 

    మెట్ల చివర చెట్టు కింద చలికి వణికిపోతూ, అర్ధనగ్నంగా కూర్చుని అడుక్కుంటున్న యాభై ఏళ్ళ వృద్ధురాలిని చూసింది.

 

    ఆమె వైపు అడుగువేసింది నిశాంత.

 

    'ఇదిగో... ఇది తీసుకో" వంగొని ఆమె చేతికి అందివ్వబోతూ ఆగిపోయింది నిశాంత.

 

    అదే సమయంలో ఆ వృద్ధురాలి వంటిమీద ఎవరో శాలువా కప్పుతున్నారు.

 

    చటుక్కున తలెత్తి చూసింది నిశాంత.

 

    సిద్ధార్ధ!

 

    ఎప్పుడొచ్చాడు... ఎక్కడ్నించొచ్చాడు... ఎలా వచ్చాడు... నిశాంతలో రకరకాల ప్రశ్నలు. ఆశ్చర్యంగా చూస్తోంది.

 

    "ఈ వృద్ధురాలికి మొదట కావల్సింది చలి నుంచి రక్షణ. కాదంటారా?"

 

    ఆ ప్రశ్న తననే అని నిశాంత అర్ధం చేసుకోడానికి కొన్ని నిమిషాలు పట్టింది.

 

    తన మీద శాలువా కప్పిన సిద్ధార్ధవైపు, తన చేతిలో పొట్లాన్ని వుంచిన నిశాంతవైపు ఆశ్చర్యంగా చూసి-

 

    ఆ పొట్లాన్ని ఆత్రంగా విప్పుకుంటోంది ఆ వృద్ధురాలు.

 

    "భారతదేశంలో ఎక్కడయినా రోటీ, కపడాజార్ మకాన్. కానీ ఇక్కడ కాదు. ఎందుకంటారా... ఇది చలి ప్రదేశం. ఇక్కడ ముందు కావల్సింది కపడా తర్వాతే రోటీ" విశాలమైన నిశాంత కళ్ళవైపు సూటిగా చూసి ముందు కడుగేశాడు సిద్ధార్ధ. అతని వెనక రఘువీర్.

 

    కొండెక్కుతున్నాడు సిద్ధార్ధ.

 

    ఏం చేయాలో పాలుపోలేదు ఆమెకు.

 

    మళ్ళీ తను కొండెక్కితే? నో... కొండమీంచి తను రావడం చూసుంటాడు.

 

    ఠీవిగా మెట్లెక్కుతున్న సిద్ధార్ధవైపు చూసి, అతని మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ తన వ్యాన్ వైపు నడిచింది ఆమె.

 

    ఆ వ్యాన్ కి కొంచెం దూరంలో బ్లూ కలర్ మారుతీ కారు.

 

    వ్యాన్ వైపు వెళుతున్న నిశాంతను మెట్లెక్కుతున్న సిద్ధార్ధ తల తిప్పి ఆరాధనగా చూశాడని ఆమెకు తెలీదు.

 

    పక్కన రఘువీర్ లేకపోతే అతను వెంటనే వెనక్కి వచ్చేసే వాడని తెలీదు.

 

    నాలుగువైపులా చూసింది ఆమె.

 

    కారు దగ్గర కానీ, చుట్టుపక్కల కానీ ఎవరూ లేరు. గబగబా కారు దగ్గరకెళ్ళి, ఫ్రంట్ టైర్ గాలి తీసేసి తన వ్యాన్ ఎక్కి ఆ వ్యాన్ ని రోడ్డు పక్కన ఆపు చేసింది.

 

    అయిదే అయిదు నిమిషాలు.

 

    అతను అంత త్వరగా కిందకు వస్తాడని వూహించలేదు ఆమె.

 

    నిశాంతను మరోసారి చూడాలనే ఉద్దేశంతోనే అతను గబగబా కిందకొచ్చేశాడని తెలీని నిశాంత-

 

    ఠీవిగా తన కారువైపు నడుచుకుంటూ వెళుతున్న సిద్ధార్ధను చూసి మనసులోనే నవ్వుకుంది.

 

    "ఎక్కడో టైర్ పంక్చరయ్యింది" రఘువీర్ అన్నాడు ఒకింత విచారంగా.

 

    "ఇప్పుడెలా?" సిద్ధార్ధ ఆలోచనలో పడ్డాడు.

 

    ఆ సమయం కోసమే ఎదురుచూస్తోంది నిశాంత.

 

    వ్యాన్ ని స్టార్ట్ చేసి సిద్ధార్ధ పక్కన ఆపి "కెన్ ఐ హెల్ప్ యూ?" అని అడిగింది.

 

    రఘువీర్ భయంగా సిద్ధార్ధ వైపు చూసి చుట్టూ చూశాడు.

 

    చుట్టుపక్కల జనంలో మారువేషంలో సెక్యూరిటీ గార్డులున్నారని ఈ విషయం అనంతమూర్తికి తెలిస్తే తన ఉద్యోగం వూడటం ఖాయమని భయపడ్డ రఘువీర్...

 

    "సిద్ధార్ధ బాబూ! అయిదు నిమిషాలలో మెకానిక్ ను తీసుకొస్తాను-"

 

    అతని నోటినుంచి ఆ మాట బయటికొచ్చేలోపునే...

 

    సిద్ధార్ధ నిశాంత వ్యాన్ లో వున్నాడు. ఆ వ్యాన్ తన కళ్ళముందే సర్రున ముందుకు దూసుకుపోవటంతో రఘువీర్ గుండెలు గుబగుబ లాడాయి.


                                                 *    *    *    *


    సిద్ధార్ధకు చాలా ఎక్సయిటింగ్ గా వుంది.

 

    జీవితంలో మొట్టమొదటిసారి ఒక ఆడపిల్ల పక్కన కూర్చున్నందుకు.

 

    నిశాంతకు చాలా గర్వంగా వుంది. ముస్సోరీ వచ్చిన రెండోరోజునే అతన్ని అలా పట్టుకున్నందుకు.

 

    గాలికి ఎగురుతున్న నిశాంత ముంగురులు సిద్ధార్ధ ముఖమ్మీద పడుతున్నాయి.

 

    అతని వంటికి రాసుకున్న యార్డ్ లీ సెంటు పరిమళం మెత్తగా, మత్తుగా నిశాంత ముక్కుపుటాలకు తాకుతోంది.

 

    అతని మనసులో ఎన్నో ప్రశ్నలు... ఒక్క ప్రశ్న కూడా బయటికి రావడం లేదు.

 

    "ఒక ఆడపిల్లతో ఒక మగవాడు మొట్టమొదట ఏంటంటాడు?" తీవ్రంగా ఆలోచిస్తున్నాడతను.

 

    మీరెక్కడుంటారని అడిగితే? ఛ... పోస్ట్ మేన్ వేసినట్టుగా ఏంటా ప్రశ్న మరి?

 

    "యూ ఆర్ సో బ్యూటిఫుల్... బ్యూటీఫుల్" నిశాంత సూది ముక్కువైపు, కనుబొమ్మల వైపు చూస్తున్నాడతను.

 

    ముందు పేరు కనుక్కోవాలి. తర్వాత... తర్వాత...

 

    "మీ పేరు..." చిట్టచివరకు అడిగేశాడతను. ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు తన వంటికి అకస్మాత్తుగా చెమటలు ఎందుకు పట్టాయో అర్ధం కాలేదతనికి.

 

    ఓరకంట చూసింది నిశాంత అతనివైపు.

 

    "మీ పేరు?" ఎదురు ప్రశ్న వేసింది నిశాంత.

 

    "సిద్ధార్ధ... సిద్ధార్ధ...మ..." మహంత అని చెప్పబోయి ఆగిపోయాడు.

 

    "ఏం చేస్తుంటారు?" మళ్ళీ అడిగిందామె.

 

    "నేనా?"

 

    "లేకపోతే నేనా?" నవ్వింది నిశాంత.