అతని చూపులు ఆమె మీదే వున్నాయి.

 

    అంత సూటిగా తనవేపే ఎందుకు చూస్తున్నాడో అర్ధం కాలేదు ఆమెకు.

 

    రెస్టారెంటుకు కొంచెం దూరంలో ఆగింది కారు. కిందకు దిగింది నిశాంత.

 

    "నా ప్రశ్నకు జవాబెప్పుడు చెప్తావ్?"

 

    ఒక్కక్షణం తటపటాయించింది నిశాంత.

 

    "నువ్వు మామూలు ప్రేమికుడివా? గొప్ప ప్రేమికుడివా?"

 

    "అంటే?"

 

    "ప్రేమ ప్రేమనే కోరుతుంది."

 

    "నేనడిగింది సూక్తులు కావు... ఇలాంటి సూక్తులు నేనూ చాలా చెప్తాను" చిరుకోపాన్ని నటించాడతను.

 

    "గొప్ప ప్రేమకు కావల్సింది గొప్ప సహనం" ఆ మాట అనేసి ముందుకెళ్ళిపోయిందామె.

 

    ఆశ్చర్యంగా చూస్తూ కారు స్టార్ట్ చేశాడతను. కానీ వాళ్ళిద్దరకు తెలీదు- ఆ ముగ్గురూ దేశ్ ముఖ్ పంపగా వచ్చిన మనుష్యులని.


                            *    *    *    *


    బోయ్ ఒక కవరుని తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు.

 

    బ్లూ కలర్ కవరు. కార్నర్స్ ని జాగ్రత్తగా సిజర్ తో కత్తిరించింది. కలర్ ఫోటోలు!

 

    ఆ ఫోటోల్ని చూడగానే అవి ఎక్కడ నుంచి వచ్చాయో, ఎవరు పంపారో అర్థమైపోయింది నిశాంతకు.

 

    గంగిరెడ్డిపల్లి ఫోటోలవి! నీళ్లు చిమ్ముతున్న రెండు బోరింగు పంపులు...

 

    సగం లేచిన శివాలయం గోడ... పాతిపెట్టిన బోరింగు పంపులు...

 

    సగం లేచిన శివాలయం గోడ... పాతిపెట్టిన విద్యుత్ స్థంభాలు...

 

    ఒక్కక్షణం ఆనందంతో ఆమె మనసు వుప్పొంగిపోయింది.

 

    అదే సమయంలో-

 

    టెలీఫోన్ మోగింది. వెంటనే అందుకుందామె.

 

    దేశ్ ముఖ్!

 

    "చూశావా ఫోటోలు?"

 

    "చూశాను... సార్..." మా ఊరు బాగుపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా వుంది" అంది నిశాంత.

 

    "బట్... అయామ్ నాట్ హేపీ! ఎందుకో తెలుసా? డెహ్రాడూన్ గెస్ట్ హౌస్ లో ఖాళీ విస్కీ సీసాలు నా దగ్గరున్నాయి."

 

    "ఖాళీ విస్కీ సీసాలా?..." ఆమె గొంతు తడారిపోయింది.

 

    "నిశాంతా! నీది ప్రేమించే వయసని నాకు తెలుసు. సిద్ధార్ధలాంటి మగాడు నీలాంటివాళ్ళకు దొరకడని కూడా నాకు తెలుసు. నీకు ప్రేమే కావాలనుకో... నేనేం అభ్యంతరపెట్టను. ఈ క్షణం నుంచి మరిచిపోతాను. మరుక్షణంలో నువ్వు రెడ్ లైట్ ఏరియాలో వుంటావు. అప్పుడు సిద్ధార్ధ నీ వెంటే వుంటాడనుకుంటున్నావా?" దేశ్ ముఖ్ గొంతులోని కోపానికి వణికిపోయింది నిశాంత.

 

    "అది కాదు సర్!"

 

    "నో మోర్ ఆర్గ్యుమెంట్స్. అయ్ డోంట్ నాట్ టు లిజన్ యువర్ కాక్ అండ్ బుల్ స్టోరీస్- నిశాంతా. నీ స్థానంలో మరో వ్యక్తిని పెట్టడానికి... ఫైవ్ మినిట్స్... ఫైవ్ మినిట్స్ జాబ్ ఫర్ మి. అలాగే... సిద్ధార్ధను కిడ్నాప్ చేసి, మర్డర్ చేయించడం నాకు పెద్ద కష్టం కాదని నీకు తెలుసు. నీ తెలివితేటల్ని నన్ను మోసగించడానికి వుపయోగించడం..." నవ్వాడు దేశ్ ముఖ్.

 

    ఆయన నవ్వులోని ఆగ్రహాన్ని మొట్టమొదటిసారి గమనించింది నిశాంత.

 

    ఆమె ముఖంలో ఆమెకు తెలియకుండానే రంగులు మారిపోయాయి.

 

    "నిశాంతా! దిసీజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ... నువ్వనుకున్నంత అమాయకుడు కాదు సిద్ధార్ధ. తుడిచెయ్... ప్రేమను తుడిచెయ్... తుడిచేస్తావా?" భీకరంగా వుంది ఆయన గొంతు.

 

    "ఎస్ సర్!"

 

    "గుడ్! వారం రోజులు టైమిస్తున్నాను. ఓన్లీ ఒన్ వీక్. అతను డ్రింక్ కి బానిస కావాలి, అమ్మాయిలకి బానిస కావాలి, నీ వెంట పిచ్చికుక్కలా తిరగాలి. తండ్రిని కూడా పట్టించుకోని పరిస్థితికి అతన్ని తీసికెళ్ళాలి... ఏం చేస్తావు?"

 

    "అంటే! నా ప్లాన్ ని నేనే రెడీ చేసుకోవాలా?"

 

    "ఎస్!"

 

    "నువ్వు చేసిన తప్పుకి అదే మొదటి శిక్ష."

 

    "టెల్ మీ! ఏం చేస్తావ్?" దేశ్ ముఖ్ వేసిన ప్రశ్నకు జవాబు చెప్పడానికి వేగంగా ఆలోచిస్తోంది ఆమె. రెండు క్షణాల తర్వాత నిశాంత బ్రెయిన్లోకి ఓ ఆలోచన మెరుపులా వచ్చింది.

 

    "నేనే యంగ్ ప్యాలెస్ కి వెళ్తాను. సిద్ధార్ధను డ్రింక్స్ కి బానిసగా చెయ్యడానికి అక్కడే శ్రీకారం చుడతాను."

 

    "నిజమా" నవ్వాడు దేశ్ ముఖ్.

 

    "ఎస్ సర్!"

 

    "ఎప్పుడు?"

 

    "రేపు రాత్రి తొమ్మిది గంటలకు" చెప్పింది నిశాంత.

 

    ఒక్క క్షణం ఫోన్లో ఏ చప్పుడూ విన్పించలేదు తర్వాత-

 

    "నా కళ్ళు నిన్ను చూడకపోయినా... నా బ్రెయిన్ నిన్ను వెంటాడుతూనే వుంటుంది... గుర్తుంచుకో" ఫోన్ లైన్ చటుక్కున కట్ అయింది.

 

    ఆమె అయోమయంగా ఫోను వైపు చూసింది.

 

    అయిదు నిమిషాలసేపు మనిషి కాలేకపోయిందామె.

 

    "నా జీవితంలో ప్రేమకు స్థానం లేదు. ద్వేషానికి తప్ప... నాకు మనసు లేదు. నాకు అనుభూతి లేదు. నా కళ్ళంట కన్నీళ్ళురావు. నేను మనుషుల్ని ద్వేషిస్తూనే బ్రతకాలి..." నిశాంత కళ్ళంట అప్రయత్నంగా కన్నీళ్ళొచ్చాయి.


                                                 *    *    *    *


    రాత్రి పదిగంటలు దాటింది.

 

    మసక వెన్నెల్లో యంగ్ ప్యాలెస్ వెనక కొండలు మెరుస్తున్నాయి. నిశితంగా చూస్తేగానీ తెలీదు. ఆ బండరాళ్ళ మీద ఒక వ్యక్తి నిల్చుని... వుందని.

 

    ఆ వ్యక్తి నిశాంత. ఆమె చేతిలో బైనాక్యులర్స్.

 

    అరగంట నుంచీ ఆమె యంగ్ ప్యాలెస్ పరిసరాల్ని పరిశీలిస్తోంది.

 

    సరిగ్గా తొమ్మిదిన్నర గంటలకు ప్యాలెస్ లో లైట్లు ఆరిపోయాయి.

 

    సెక్యూరిటీ పాయింట్స్ దగ్గర లైట్లు వెలుగుతున్నాయి.

 

    నిశాంతను ఆ సమయంలో ఎవరు చూసినా ఒక ఆడపిల్ల అనుకోరు. మహంత సెక్యూరిటీ స్టాఫ్ లో ఒక వ్యక్తి అనుకుంటారు.

 

    ఆలివ్ కలర్ యూనిఫామ్, తలమీద టోపీ, భుజానికి వేలాడుతూ హేండ్ బాగ్.

 

    ప్యాలెస్ లో సంచారం తగ్గిందని రుజువు చేసుకున్న ఆమె బండరాళ్ళ మీంచి కిందకు దిగి యంగ్ ప్యాలెస్ వెనక గోడవైపు నడిచింది.