ఓ స్లీపింగ్ బ్యూటీ బాధ
స్లీపింగ్ బ్యూటీ అనే జానపద కథ మనందరికీ తెలిసిందే! ఏళ్ల తరబడి సుదీర్ఘంగా నిద్రపోయే రాజకుమారి గురించిన కథే స్లీపింగ్ బ్యూటీ. కథ కాబట్టి వినడానికీ, చదువుకోవడానికీ బాగానే ఉంటుంది. కానీ నిజంగా ఎవరికన్నా అలాంటి అనారోగ్యం ఉంటే... అది భరించేవారికే తెలుస్తుంది.
చెదిరిపోయిన కలలు
ఇంగ్లండుకి చెందిన బెత్ గుడియర్ మహా చురుకైనా పిల్ల. ఎలాగైనా చైల్డ్ సైకాలజిస్టు కావాలన్నది ఆమె ఆశయం. బెత్ తన ఆశయాన్ని సాధిస్తుందనడంలో ఎవరికీ ఏ అనుమానమూ లేదు. ఎందుకంటే బెత్ చదువులో చాలా ముందుండేది. ఇదంతా ఐదేళ్ల క్రితం మాట. బెత్కి అప్పుడే 17 ఏళ్లు వచ్చాయి. స్నేహితుల మధ్యా, సన్నిహితుల మధ్యా ఆమె పుట్టినరోజు ఘనంగా జరిగింది. కానీ పుట్టినరోజు సంతోషం కొద్ది రోజుల్లోనే ఆవిరైపోయింది. ఓ రోజు బెత్ పడుకున్న మనిషి పడుకున్నట్లే ఉండిపోయింది. ఆ రోజు పడుకున్న బెత్ దాదాపు ఆరు నెలల వరకు సరిగా నిద్ర లేవనే లేదు.
స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్
బెత్కి ఏమైందో ఆమె తల్లి జెనిన్కి అర్థం కాలేదు. భర్త తోడు లేకపోయినా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన కూతురి పరిస్థితి చూసి ఆమె మనసు తల్లడిల్లిపోయింది. మెదడులో కణితి కారణంగానో, రక్తస్రావంచేతనో ఆమె అలా నిద్రపోతోందేమో అని భయపడింది. బెత్ పరిస్థితి చూసి వైద్యులకి కూడా ఏమీ తోచలేదు. కానీ ఇంతలో ఒక వైద్యుడికి తాను విన్న స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ గుర్తుకురావడంతో... అదే ఇది అన్న నిర్ధరణకు వచ్చారు.
ఇప్పటికీ రహస్యమే!
సుదీర్ఘకాలం పాటు అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే ఈ స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్కి కారణం ఏమిటన్నది ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు తెలియనేలేదు. కాకపోతే ఇది జన్యవులలో లోపం వల్ల ఏర్పడుతుందనీ, శరీరంలో ఏదన్నా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఈ రోగం ఒక్కసారిగా బయటపడుతుందనీ అనుమానిస్తున్నారు. నిద్రనీ, ఇంద్రియాలను నియంత్రించే మెదడులోని ధాలమస్, హైపోధాలమస్ అనే భాగాలు దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందని తేలింది. 20వ శతాబ్దపు ఆరంభంలో కెల్విన్, లెవిన్ అనే ఇద్దరు వైద్యులు దీనిని గుర్తించడంతో... వారి పేరు మీదుగా Kleine–Levin syndrome (KLS) అన్న పేరు పెట్టారు. కానీ స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ అన్న పేరుతోనే ఇది ప్రచారంలో ఉంది.
నూటికి కాదు కోటికి
స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ ఎక్కడో లక్షల్లో ఒకరికి మాత్రమే సోకే అవకాశం ఉందట. సాధారణంగా 16 ఏళ్ల యుక్తవయసులో ఈ రోగం దాడి చేస్తుంది. ఈ వ్యాధి సోకినవారు వారాల తరబడి దీర్ఘనిద్రలో ఉండిపోతారు. రోజులో ఒకటి రెండు గంటలు మాత్రమే కాస్త మెలకువగా ఉంటారు. అది కూడా ఏదో మత్తులో ఉన్నవారిలాగా తూగుతూ ఉంటారు. ఆ కాస్త సమయమూ కాలకృత్యాలను తీర్చుకోవడం, ఆహారం తీసుకోవడంలో గడిచిపోతుంది. ఇలా కొన్నాళ్ల నిద్రావస్థ తరువాత మళ్లీ ఓ రెండు వారాలు మామూలుగా ఉంటారు. ఆ తరువాత మళ్లీ నిద్ర! ఇలా ఓ పదేళ్ల పాటు ఈ విషవలయం తప్పదు. అదృష్టం ఏమిటంటే ఓ పది, పన్నెండేళ్ల తరువాత రోగం దానంతట అదే తగ్గిపోతుంది.
జీవితం వృధా
స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్కి ఇప్పటివరకూ తగిన చికిత్స ఏదీ అందుబాటులో లేదు. అందుబాటులో ఉన్న మందులు కూడా ఎంతవరకు క్షేమం అన్నదాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ రోగం వల్ల శారీరికంగా కలిగే బాధకంటే మానసికమైన వేదన ఎక్కువ. నిద్రావస్థ నుంచి బయటకు వచ్చిన తరువాత, రోగి మామూలు స్థితికి చేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఆ అయోమయం వల్లనైతేనేమీ, తన కాలం వృధా అయిపోయిందన్న బాధతో అయితేనేమి తీవ్రమైన క్రుంగుబాటులోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది. పైగా ఆడుతూపాడుతూ తిరగాల్సిన యుక్తవయసులో, కెరీర్ మంచి ఊపులో ఉండే దశలో ఈ వ్యాధి దాడి చేయడం వల్ల వారి జీవితమే తలకిందులైపోతుంది. అలాంటి సమయంలో వారికి నేనున్నానన్న భరోసాని అందించడం అవసరం. అదృష్టవశాత్తూ బెత్కి అలాంటి భరోసా ఉంది. ఆమెను కంటికి రెప్పలా చూసుకునే తల్లి ఎలాగూ ఉంది, దానికి తోడు బెత్ గురించి తెలిసి ఆమెకు దగ్గరైన ఓ యువకుడు కూడా ఆమె బాగోగులను గమనించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. తమ ప్రాణమైన బెత్ ఈ సిండ్రోమ్ నుంచి త్వరగా కోలుకోవాలని వారిద్దరూ ఆశిస్తున్నారు.
- నిర్జర.