ప్రబంధ, ఆదిత్యల కథ తాను కోరుకున్న మలుపు తిరిగింది కాబట్టి ఇదే సమయంలో ప్రబంధ పైన పెళ్ళి విషయం వత్తిడి ప్రారంభమైతే ఆమె తిరస్కరిస్తుంది. అది చాలు వాసుదేవరావు మానసికంగా చావుదెబ్బతినడానికి, ప్రబంధ అనే అతడి ఆయువుపట్టు అధిష్టాన వర్గాన్ని మించి వూపిరందని పరిస్థితి కలిగిస్తే రాజకీయ బొంగరాన్ని తిరుగులేకుండా తిప్పుతున్న వాసుదేవరావు మేధ తెగిన తాడైపోతుంది.
    
    సర్వశక్తులూ కోల్పోయాక రాజకీయ కురుక్షేత్రంలో కర్ణుడిలా నిస్సహాయుడైపోయే వాసుదేవరావు ధనుష్టంకారాలు అతడి ముగిసిపోయిన చరిత్రకి నేపథ్య గీతికలవుతాయి.
    
    రాజకీయాలలో ఇలాంటి ఓ మార్గాన్ని ఎన్నుకున్న పద్మనాభం ఇంతకాలం ఎదురుచూసింది ఈ క్షణం కోసమే. అయితే, అతను బలంగానే సాధించాడనటానికి సాక్ష్యం ఆ తర్వాత జరిగిన సంఘటనలే.
    
    ఇక్కడ భాగ్యనగరంలో.... జరగాల్సిన ప్రబంధ పెళ్ళి గురించి వాసుదేవరావు ఉద్విగ్నంగా ఆలోచిస్తున్న సమయానికి....
    
    ఆంధ్రా యూనివర్శిటీ కేంపస్ లో ఓ వార్త వేగంగా పాకిపోయింది.
    
    అది ఆదిత్య, ప్రబంధ కలిసి క్విజ్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారన్న విషయం.
    
    ముందు నమ్మలేకపోయాడు శౌరి.
    
    ఉదయం పదిగంటల సమయంలో గుంపులుగా నిలబడ్డ యూనివర్శిటీ విద్యార్ధులు ఇదే విషయాన్ని చర్చించుకుంటూండగా క్లాస్ రూంలో కూర్చున్న చెల్లి ప్రబంధను పిలిచాడు. ఆమె సవ్యంగా జవాబు చెప్పదని తెలుసు. అయినా ఆమె నోటినుంచి వినాలనుకున్నాడు.
    
    "అవునన్నయ్యా! నిజమే" ఖండించలేదు ప్రబంధ.
    
    "అంటే.... ఇది రూమర్ కాదన్న మాట!"
    
    "ప్రణయతో కలిసి ఆదిత్య రంగంలోకి దిగాడనే వార్త వస్తే అది రూమరవుతుంది."
    
    శౌరికి ఒళ్ళు మండిపోతోంది ప్రబంధ విశ్లేషణ వింటుంటే అయినా నిభాయించుకున్నాడు.
    
    "అదేమిటి? లెక్కప్రకారం ప్రణయ రావాలిగా!"
    
    "పోటీ నుంచి పక్కకు జరిగింది కాదు. నేనే తెలివిగా తప్పించాను"
    
    ఆ చివరి వాక్యం శౌరిని ఎంత ఉద్రేకపరిచిందీ అంటే చాచి ప్రబంధ చెంప పగలగొట్టాలనుకుంటూ అతికష్టంమీద నిగ్రహించుకున్నాడు.
    
    లాభం లేదు. ఆదిత్య విషయంలో ప్రబంధ చాలా త్వరపడుతోంది. ఎంత తెలివైన వ్యక్తి అయినా గాని ఆదిత్యలాంటి ఓ సామాన్యుడి వెంటపడటం తను అంగీకరించలేడు.
    
    కాని ఎలా! ప్రబంధని ఎలా వారించాలి?
    
    ప్రణయలాంటి అమ్మాయిని పక్కకి తొలగించగలిగిందీ అంటే, ఆదిత్యతో తను అనుకున్నదానికన్నా ఎక్కువగానే అటాచ్ మెంట్ పెంచుకుని వుంటుంది.
    
    యూనివర్శిటీలో వుండలేకపోయాడు.
    
    మిత్రులతో కాదు, కేవలం సుధీర్ తో మాత్రం క్లాసులెగ్గొట్టి బయటి కొచ్చేశాడు.
    
    తను స్టూడెంట్ యూనియన్ లీడర్ మాత్రమే కాదు రాష్ట్రముఖ్యమంత్రి కొడుక్కూడా కాని నిస్సహాయుడైపోతున్నాడు.
    
    లాభంలేదు. ప్రబంధ ఇంకా చెయ్యి దాటిపోవడం తను సహించలేడు.
    
    ఇంటికి వస్తూనే హైదరాబాద్ ఫోన్ చేశాడు.
    
    ఆదిత్య అనే ఓ స్టూడెంట్ తో తన కూతురు పెంచుకున్న పరిచయ విషయం మరో అశనిపాతమైంది వాసుదేవరావుకి.
    
    "నో!" గావుకేకలా వినిపించింది రాష్ట్ర ముఖ్యమంత్రి గొంతు. "అలా జరగటానికి వీలులేదు! ప్రబంధక్కాదు, ఆదిత్యగాడికి మనమేమిటీ అన్నది తెలియచెప్పు. ఎప్పుడోకాదు., వెంటనే! ఎందుకంటే ప్రబంధకి పెళ్ళి సెటిల్ చేశాను కాబట్టి."
    
    ఆమాత్రం ఆదేశంచాలు శౌరికి. అవసరమైతే ఆదిత్యను లేపేస్తాడు.
    
    "సౌదామిని వుందా?" వాసుదేవరావు అడిగాడు.
    
    ఇందాకట్నుంచి అంతా గమనిస్తూనే వుంది సౌదామిని. పేపర్లో వార్త చదివిన సౌదామిని నిజానికి వాసుదేవరావు నుంచి ఫోన్ వస్తుందని అనుకుంటోంది కూడా.
    
    "ఆంటీ!" రిసీవర్ ని అందించాడు సౌదామినిని పిలిచి.
    
    "చెప్పండి" అంది ఉద్విగ్నతని కప్పిపుచ్చుకుంటూ.
    
    "ఈ రోజు పేపర్లో వార్త చదివే వుంటావ్."
    
    "చదివాను."
    
    "ఇబ్బందిలో కూరుకుపోయాను"
    
    "మీరలా దిగులుపడకండి."
    
    "నీకు తెలియదు సౌదామినీ"
    
    అర్దోక్తిగా అంది సౌదామిని. "మీ శక్తి మీద నాకు నమ్మకముంది. ఈ ఆపదనుంచి సునాయాసంగా మీరు గట్టెక్కగలరు."
    
    "గట్టెక్కేవాడినే కాని ప్రబంధ ఇంకో సమస్య తెచ్చిపెట్టిందిగా!"
    
    వెంటనే జవాబు చెప్పలేకపోయిందామె. ఇలాంటి ప్రశ్నని ఆమె ఊహించింది కాని ఇంత త్వరగా కాదు.
    
    "నీ మీద చాలా ఆశతో అక్కడికి పంపించాను సౌదామినీ! కాని ఇలాంటి ఫలితాన్ని నేను ఆశించలేదు"
    
    "నేను చెబుతాను" ఓదార్పుగా అనబోయింది.
    
    "నీకు తెలీదు సౌదామిని! వ్యవధి లేదు. వెంటనే పెళ్ళి జరిపించాలి. లేకపోతే ఈ సంబంధం దక్కే అవకాశం లేదు."
    
    "ప్రబంధతో మాట్లాడతాను."
    
    "అదికాదు సౌదీ!" వాసుదేవరావు గొంతులో బాధ ధ్వనించింది. ఇంత జరిగినా నువ్వెందుకు గుర్తించలేకపోయావు?"
    
    తప్పనిసరైంది ప్రబంధకి ప్రతికూలంగా మాట్లాడ్డం "ప్రబంధని చిన్నపిల్లలాగానే అనుకుంటున్నాను తప్ప ఇలాంటి సాహసం చేస్తుందనుకోలేదు. అయినా ఈ విషయం నాకు విడిచిపెట్టండి" అప్పటికి ఆ ప్రసక్తిని మళ్ళించాలనుకుందే తప్ప ఆమె హామీ యివ్వలేదు.
    
    "బహుశా ఓ వారంలో రాయ్ కొడుకుతో పెళ్ళి జరిపించాల్సి రావచ్చు ప్రబంధను ఒప్పించే బాధ్యత నీదే."
    
    "అలాగే!" ఫోన్ కట్టయింది.