ఆమె ఎలా వుంటుంది...?

 

    హుందాతనాన్ని జోడించుకున్న శరీరాకృతా?

 

    ఉద్వేగాన్ని, ఉద్రేకాన్ని కలిగించే అంగ సౌష్టవమా?

 

    శ్రీధర్ అలా ఆలోచిస్తుండగానే ఆ ఫ్లాట్ ఓనర్ సిగార్ ని వెలిగించుకుంటూ బెడ్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు.

 

    ఆయన వెనుకే ఓ పదేళ్ళ పాప చాకోబార్ ని మొదలు నుంచి చివరి వరకూ చప్పరిస్తూ బయటకు వచ్చింది.

 

    ఆ తరువాత ఆయన భార్య కాఫీ కప్పులున్న ట్రేతో బయటకు వచ్చింది.

 

    హాల్లో కూర్చున్న ముగ్గురూ ఒకింత నిరాశకు లోనయ్యారు, అసలు వ్యక్తి రంగప్రవేశం చేయనందుకు.

 

    "కాఫీ తీసుకోండి" అన్నాడాయన సిగార్ ని తన్మయంగా పీలుస్తూ. ఇష్టం లేకపోయినా ముగ్గురూ కాఫీ కప్పులను చేతుల్లోకి తీసుకుని సిప్ చేయబోతుండగా అన్నాడాయన.

 

    "మీ కజిన్ పూజని పలకరించరేం?"

 

    ముగ్గురూ ఒక్కసారిగా చిన్న ప్రకంపనలకు లోనయ్యారు.

 

    "వాట్...వేరీజ్ పూజ?" ఆశ్చర్యంనుంచి తేరుకుంటూ అడిగింది జయారెడ్డి.

 

    "మీ కజిన్ అన్నారు-ఆమాత్రం గుర్తుపట్టకపోతే ఎలా?" అన్నాడు పదేళ్ళ పాపను తన ఒళ్ళోకి తీసుకుంటూ.

 

    అంతే...ఆ మరుక్షణం అక్కడి నుంచి ఎప్పుడు బయట పడ్డారో వారికే తెలియదు.

 

    "సాదరంగా ఆహ్వానించి, కూర్చోబెట్టి, కాఫీ ఇచ్చి మరీ ఫూల్స్ ని చేశాడా ముసలాడు. ఛీ...ఛీ..." నుదురు కొట్టుకుంటున్నాడు యోగి.

 

    జయారెడ్డి, శ్రీధర్ ఏం మాట్లాడలేదు. అంతలో మోగింది ఫోన్. ఆ శబ్దం వింటూనే ముగ్గురూ ఒక్కసారి ఒకరి ముఖాలకేసి ఒకరు చూసుకున్నారు.

 

    "ఎప్పటిలాగే బేస్ పీస్ స్పీకర్ ఫోన్ స్క్రిబ్లింగ్ పేడ్...పెన్-" అన్నాడు యోగి అలర్టయిపోతూ.

 

    వాళ్ళిద్దరి మోడ్ ఆఫ్ ఆపరేషన్ తెలీక వాళ్ళకేసి ఆసక్తిగా చూడసాగింది జయారెడ్డి.

 

    "హలో..." అన్నాడు శ్రీధర్

 

    "హాయ్...నేనే...ఎలా వుంది మీ పరిశోధన...?" నవ్వుతూ అడిగిందామె.

 

    ఆమె కంఠంలో రవ్వంత వెక్కిరింత స్పష్టంగా తొంగిచూసింది.

 

    "అది కూడా చూసేశావా?" అడిగాడు శ్రీధర్.

 

    "అంతా చూసేసా... ఆముసలాడు భలే దెబ్బ కొట్టాడు గదా? పూజా అనే పేరు నా ఒక్కదానికే వుంటుందని ఎలా భావించారు? భావిస్తే భావించారు, నేనంత తేలిగ్గా దొరికిపోతానని ఎలా భావించారు?" నవ్వుతూనే అడిగిందామె.

 

    "ఎప్పటికీ దొరకవా?" ఉక్రోషంగా అడిగాడు శ్రీధర్.

 

    "ఎప్పటికి దొరకకుండా పోతే ఎలా? దొరుకుతాను-నువ్వు నన్ను దొరికించుకో గలిగితే..."

 

    "ఈ లోపు మరో పాతికేళ్ళు గడిచిపోతే?"

 

    "నిన్నంత తెలివి తక్కువ వాడిగా నేను అంచనా వేయటం లేదు..."

 

    "నేనంత తెలివికల వాడ్నని అనుకుంటున్నావా నువ్వు?" అడిగాడు శ్రీధర్.

 

    "ఒక స్త్రీ మగవాడిలో ఏం చూసి ప్రేమిస్తుందో తెలుసా? మొదట- నిజాయితీ, రెండు-హాస్యచతురత, మూడు-తెలివితేటలు... మొదటిది మూడవది నీలో వున్నాయి. అందుకే నువ్వు నాకు నచ్చావు. మధ్యలోది మనం ఎదురుపడితే గాని తెలీదు.

 

    ఎవరు, ఎవరికైనా ఎప్పుడు దగ్గరవుతారో, ఎప్పుడు గుర్తింప బడతారో, ఎప్పుడు గౌరవింపబడతారో తెలుసా?" అడిగిందామె.

 

    శ్రీధర్ వెంటనే సమాధానం ఇవ్వకుండా, లేచి కార్డ్ లెస్ ఫోన్ తో విండో దగ్గరకెళ్ళి ఎదురుగా ఉన్న ఫ్లాట్స్ కేసి చూడసాగాడు.

 

    అతని కళ్ళు ఎదురుగా ఉన్న 32కిటికీల్ని, పదహారు డోర్స్ ని 16 సిటౌట్స్ ని స్కాన్ చేస్తున్నట్లుగా వున్నాయా క్షణాన.

 

    "కనిపిస్తున్నానా?" అడిగిందామె హస్కీగా.

 

    "లేదు..." అన్నాడు శ్రీధర్ నిస్పృహగా.

 

    "మీరూహించినట్లుగానే-మీకెదురుగా ఉన్న ఫ్లాట్స్ లోనే వుంటున్నాను. చూద్దాం-ఎప్పటికి నేను ఏ ఫ్లాట్ లో వుంది కనుక్కుంటావో... ఇట్స్ ఏ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ స్వీట్ ఛాలెంజ్...నేను నిన్ను ప్రతి గంట, ప్రతిరోజూ చూస్తూనే వుంటాను. కాని నువ్వు మాత్రం నన్ను గుర్తించలేవు..."

 

    "అదీ చూద్దాం...ఇంతకు ముందేదో అన్నావ్- అదేదో చెప్పు" అన్నాడు శ్రీధర్ ఆమెతో సంభాషణని కొనసాగించాలని.

 

    అప్పటికే యోగి, జయారెడ్డి ఆ ఫ్లాట్ లోంచి బయటపడి, ఎదురుగా ఉన్న ఫ్లాట్స్ కేసి పరుగెత్తసాగారు- ఆ రాత్రివేళ.

 

    "నాలుక, కోపం, ఆకర్షణ- ఈ మూడింటిని అదుపులో వుంచుకోవాలి.

 

    వాగ్దానం, స్నేహం, వాత్సల్యం- ఈ మూడింటిని నిలబెట్టుకోవాలి.

 

    మాట, నడత, పని- మూడింటిని గమనిస్తూ ఉండాలి.

 

    సోమరితనం, అసత్యం, అపవాచం- ఈ మూడింటిని అరికట్టాలి.

 

    ముసలితనం, సంస్కృతి, చట్టం- ఈ మూడింటిని ప్రేమించాలి.

 

    పవిత్రత, నిజాయితీ, కఠిన పరిశ్రమ- ఈ మూడింటిని ఆరాధించాలి.

 

    ధైర్యం, ప్రసన్నత, త్రుప్తి- ఈ మూడింటిని అలవాటు చేసుకోవాలి..." చెప్పిందామె మృదువుగా.

 

    "అలాగే...మహాతల్లి...అదుపులో వుంచుకుంటూ-నిలబెట్టుకుంటూ- గమనిస్తూ వుంటా- అరికడతాను- గౌరవిస్తాను- ప్రేమిస్తాను- ఆరాధిస్తాను- అలవాటు చేసుకుంటాను అలా అని మాటిస్తున్నాను. ప్లీజ్... నేనుండలేక పోతున్నాను- త్వరగా ఎదురుపడవా?" అలవికాని ఉద్రేకాన్ని అణుచుకోలేక అన్నాడు శ్రీధర్.

 

    "నెమ్మదిగా పోతున్నందుకు భయపడకూడదు. నిశ్చలంగా నిలబడి నప్పుడే భయపడాలి. ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే వున్నావుగా! ఎందుకు ఆ తొందర?"

 

    "నువ్వుంటున్న ఫ్లాట్స్ కేసి చూడటమే తప్ప నేనేం ప్రయత్నం చేస్తున్నాను!"

 

    "పిచ్చికన్నా...నీ ఫ్రెండ్స్ ఇద్దరూ మా బ్లాక్స్ కేసి పరుగెత్తుకు వచ్చారు. నన్ను సంభాషణలో పెట్టమని, బహుశ వాళ్ళు నీకు చెప్పే వుంటారు. అవునా...?" చిలిపిగా నవ్వుతూ అడిగిందామె.