అంత పెద్దమనిషి చెబుతుంటే అయన ఏమీ అనలేక, జాగ్రత్తగా మళ్ళీ నా కొడుకుని అప్పగించే పూచీ మీదే" అని చెప్పి వెళ్ళిపోయాడు.    
    గుణదల నుండి కొవ్వూరు వరకూ మధ్యలో ఎన్నెన్నో చిన్న మజిలీలు చేసుకుంటూ చేరారు.    
    కొవ్వూరులో అలసట తీర్చుకుని, పడవెక్కి అక్కడనుండి రాజమండ్రి చేరారు. అక్కడ 'నాళం' వారి సత్రంలో బసచేశారు. అందరూ స్నానాధికాలు ముగించుకున్న తరువాత రమణమ్మ వంటచేసింది. ముందుగా పిల్లకి పెట్టిన తరువాత, అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ భోజనాలు చేస్తున్నారు.    
    "నమస్కారం! నా పేరు శాస్త్రి. స్కూల్ మాష్టర్ ని కడియం నుండొస్తున్నాను" అని ఒకాయనొచ్చారు. అందరూ పరస్పరం పరిచయాలు చేసుకున్నారు. భోజనాలయిన పిమ్మట సత్రం అరుగుమీద కూర్చుని మాటామంతీ ఆడుకుంటున్నప్పుడు," మీరొస్తున్నట్టు వార్తా పత్రికలో చూసి చాలా సంతోషించాను తప్పకుండా ఆతిధ్యమివ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నాను కూడా! కడియం ఎప్పుడొస్తున్నారూ?" అనడిగారు.    
    "బహుశా సాయంత్రానికి చేరుకుంటామేమో!"
    "వంటలవీ చేయించి మీ కోసం ఎదురుచూస్తూ వుంటాను" అని చెప్పి, ఆయన అందరివద్దా శలవు తీసుకుని వెళ్ళిపోయారు.    
    బెజవాడనుండి బయల్దేరినప్పటినుండీ నీళ్ళ బృందం మీద పోలీస్ నిఘా వుంది. అందుచేత శ్రీహరిరావుగారు ఎంత స్నేహితులైనా, ఎవరిళ్ళ లోనూ బస చెయ్యకుండా, జాగ్రత్త తీసుకుని, దేవాలయాల్లో కానీ, సత్రం అరుగుల మీద కానీ బస చేస్తుండేవారు.    
    సాయంత్రం ఐదున్నర, ఆరవుతుండగా కడియం చేరారు. ఊరిమొదట్లోనే ఒక దేవాలయం కనిపించింది.    
    "దేవుడు తనంతట తానే ఎదురయి తగిన వసతి ఏర్పాటుచేశాడు అందరూ మీ పెట్టే-బేడా అరుగుమీద పెట్టుకుని మొహం, కాళ్ళూ, చేతులూ కడుక్కుని సేద తీర్చుకోండి. ఎలాగూ మాస్టారుగారు మన కోసం వంటలవీ చేయించే వుంటారు" అన్నారు.    
    త్వరగా కానియ్యండి! కడుపులో కాలిపోతోంది" అన్నాడు కోటయ్య.    
    అందరూ సరదాగా నీళ్ళు తోడుకుని బావిలోంచి, స్నానాలవీ చేస్తుండగా, ఓ చిన్న కుర్రాడొచ్చి అటూ ఇటూ చూసి, ఓ చీటీ వుండ కింద చుట్టి, ఆ గుడిమెట్లమీద పడవేసి వెళ్ళిపోయాడు.    
    ఆ పని ఆ కుర్రవాడు చిటికెలో చేసి మాయమయ్యాడు.
    ఇది శ్రీహరిరావు దృష్టిని దాటిపోలేదు. నెమ్మదిగా లేచి వెళ్ళి ఆ చీటీ మధుకుని చదువుకున్నారు.    
    "నమస్కారం!    
    మీ కోసం వంటలవీ చేయించాను. మీరొస్తారని ఎదురుచూస్తుండగా పోలీసులొచ్చారు. మీ కాతిధ్యం యివ్వడానికి వీల్లేదని నన్ను 'హెరాజ్' చేస్తున్నారు. నాకేమీ పాలుపోవడంలేదు. మీరు సమర్ధులు ఏదో ఒకటి చేయగలరు" అని రాసి వుంది. ఆ చీటీ చదివి శ్రీహరిరావు కొంతసేపు ఆలోచించాడు. చివరికి దాన్ని వెనక్కి తిప్పి ఇలా రాశాడు.    
    "మీరేమీ ఈ విషయమై ఆదుర్దాపడొద్దు. మా భోజనం సురక్షితంగా మా వద్దకు మేము తెప్పించుకోగలము" అని రాసి మళ్ళీ వుండచుట్టి మెట్లమీద పడవేశాడు.    
    ఆ కుర్రాడెక్కడ్నుంచో రివ్వున వచ్చి, ఆ చీటీ తీసుకుని పారిపోయాడు.    
    రాత్రి ఏడవుతుండగా - "సుబ్రహ్మణ్యం, పద భోజనం  తెచ్చుకుందాం" అన్నారు.    
    "పంతులుగారూ! పోలీసులు..................    
    "పర్వాలేదు నా వెంట మాట్లాడకుండా రా!"    
    ఇద్దరూ వెళ్ళి రెండు తాటాకు బుట్టలు కొని తెచ్చారు. తలలకి తల పాగాలు చుట్టుకున్నారు ఉత్తరీయాలతో మాస్టారుగారింటికి కొంచెం సమీపంగా వచ్చి, చీకట్లో నిలబడ్డా    
    మాస్టారుగారు అరుగుమీద పడక కుర్చీలో చాలా దిగులుగా కూర్చుని కనిపించారు.    
    "మధూకరం" అన్న కేక వినిపించింది.    
    ఆ కేక చాలా కొత్తగా బిగ్గరగా వినిపించి అయన తలతిప్పి చూశారు.    
    ఈసారి మరింత గట్టిగా "మధూకరం" అని కేకవేస్తూ, యింటి గుమ్మంలోకెళ్ళి నిలబడ్డారు.    
    ఆ వచ్చిన యిద్దర్నీ, వాళ్ళ చేతుల్లోకి తాటాకు బుట్టల్నీ చూశాకా ఆయనకి అర్ధమయిపోయింది. వెంటనే అయన "అమ్మా! మధూకరమని వచ్చారు వీళ్ళు, కాస్త ఏదయినా యిచ్చి పంపించు" అన్నారు.    
    వీళ్ళు తాటాకు బుట్టలు అరుగుమీద పెట్టి నిలబడ్డారు. వాళ్ళమ్మగారు లోపల్నుండొచ్చి, కొడుకువైపు చూసింది. ఆయన కళ్ళతో బుట్టలకేసి సైగచేసి చూపించారు. ఆవిడకూడా అర్ధం చేసుకున్నారు.    
    "రండి నాయనా! బంధువులొస్తున్నారని వంట చేశాను. తీరా వాళ్ళు ఇబ్బందొచ్చి ఆగిపోయారు. వంటంతా మిగిలిపోతుందేమోనని తెగ బాధపడుతున్నాను" అంటూనే బుట్టలు రెండూ లోపలికి తీసుకెళ్ళి, వాటిలో అరిటాకులు అడ్డుగా పెడుతూ, కలిసిపోకుండా అన్నం, వంకాయ కూరా, కొబ్బరిపచ్చడీ, వూరగాయా మొదలయినవన్నీ సర్ది తెచ్చి అరుగుమీద పెట్టింది.    
    కృతజ్ఞత నిండిన కళ్ళతో ఆవిడ్నీ, మాస్టార్నీ ఓమారు చూసి, బుట్టలు తీసుకుని వెనక్కొచ్చేశారు.    
    మాష్టారుగారికి కంట నీరాగలేదు! అతిథులకి నట్టింట్లో పీటవేసి భోజనం పెట్టలేకపోయానే అని!    
    కానీ, వారి భోజనం వారికి అందజెయ్యబడింది కదా అన్న తృప్తి కూడా లీలగా ఆ కళ్ళల్లో మెరిసింది.    
    భోజనాలయిన పిమ్మట అందరూ ఎవరి సామాన్లు వారు తీసుకుని ముందుకు నడవసాగారు. కొంతదూరం నడిచేసరికే ఒక గెస్ట్ హౌస్ లాంటి బంగళా కనిపించింది.    
    "నేవెళ్ళి మనకేమన్నా వసతి దొరుకుతుందేమో కనుక్కొస్తాను" అని శ్రీహరిరావుగారు అటు నడిచాడు ఇంతలో.