ఫ్లాట్ ఫారం సిమెంట్ బెంచీలమీద కూర్చున్న ఒకరిద్దరు, పోర్టర్లు మాత్రం లేచి నిలబడ్డారు.
    
    అయిదు నిమిషాల తర్వాత, నెమ్మదిగా ఫ్లాట్ ఫారమ్మీద కొచ్చింది లోకల్ ట్రైన్...
    
    ఆ ట్రైన్ లో ఆరు కంపార్ట్ మెంట్లు మాత్రమే ఉన్నాయి.
    
    గార్డు రూమ్ పక్కనున్న కంపార్ట్ మెంట్ దాదాపు ఖాళీగా ఉంది-ఆ కంపార్ట్ మెంట్లో అక్కడక్కడ కూర్చున్న పదిమంది ప్రయాణీకులు, ట్రైన్ ఫ్లాట్ ఫారమ్మీద ఆగగానే దిగి వెళ్ళిపోయారు పదినిమిషాల్లో-
    
    మొత్తం కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీ అయిపోయాయి.....
    
    అప్పటికి స్టేషన్లో చీకటి పూర్తిగా మాయమైపోయింది.
    
    అంతవరకూ ఫ్లాట్ ఫారమ్మీద స్తంభం పక్కన బీడీ కాల్చుకుంటూ కూర్చున్న స్వీపర్ నర్సింహ, సగం కాలిన బీడీని పక్కకు విసిరేసి, చీపురును అందుకుని కంపార్ట్ మెంట్స్ ను, తుడవడానికి, ముందుకడుగేసాడు.
    
    అరగంట గడిచింది.
    
    అయిదు కంపార్ట్ మెంట్లను తుడిచేసి, ఆరో కంపార్ట్ మెంట్లోకి అడుగు పెట్టాడు.
    
    మరో పది నిమిషాల్లో ఆ కంపార్ట్ మెంట్ కూడా ఊడ్చడం పూర్తయి పోయింది- ఆ కంపార్ట్ మెంట్లోంచి, బయటికొస్తున్న స్వీపర్ నర్సింహ చూపులు, లావెటరీ మీద పడ్డాయి.
    
    యధాలాపంగా, అతని కుడిచేయి, ఆ లావెటరీ హాండిల్ మీదపడింది. హాండిల్ ను కిందకు నొక్కి డోర్ ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నించాడు స్వీపర్ నర్సింహ.
    
    ఎందుకో, ఆ డోర్ వెనక్కి వెళ్ళలేదు.
    
    రెండోసారి మళ్ళీ ప్రయత్నం చేసాడు.
    
    లోపల, ఎవరైనా, ఉన్నారేమోనని, అనుమానం వచ్చిందతనికి.
    
    "కౌన్ హై అందర్..." చేత్తో నెడుతూ, కాలితో తొయ్యడానికి ప్రయత్నించాడు-అయినా అంగుళమైనా కదలలేదు.
    
    ఆశ్చర్యంతో అతని భ్రుకుటి ముడిపడింది. ఎందుకో అతనికి తెలియకుండానే, అతన్లో విస్మయం చోటుచేసుకుంది. అదే సమయంలో అతని కళ్ళల్లో భయం కూడా కదలాడింది....
    
    వంటిలోని బలాన్నంతా కూడదీసుకుని, ముందుకు తోయడానికి ప్రయత్నించాడు... అతని ప్రయత్నం వృధా కాలేదు.
    
    బరువైన డోర్...నెమ్మదిగా ముందుకు కదిలింది....
    
    నర్సింహలో మరింత ఉత్సాహం చోటు చేసుకుంది...
    
    మళ్ళీ బలంగా నెట్టాడు....
    
    "నెమ్మది, నెమ్మదిగా తలుపు భారంగా ముందుకు కదలడం ప్రారంభించింది.
    
    మూడు క్షణాల తర్వాత-
    
    తలుపు పూర్తిగా తెరచుకోవడం, నర్సింహ లోనికి అడుగు పెట్టడం.....ఆ వెన్వెంటనే భయంకరమైన కేక వెయ్యడం జరిగిపోయింది....
    
    ఆ కేకకు, ఫ్లాట్ ఫారం మీదున్న మిగతా జనం, పరుగు పరుగున అక్కడకు చేరుకున్నారు.
    
    "హత్య... శవం.... హత్య... శవం..." అరుస్తున్నాడు నర్సింహ ఫ్రాంక్ గా.
    
    నలభై ఏళ్ళ అతని సర్వీస్ లో, అంతటి భయంకరమైన శవాన్ని చూడడం అదే మొదటిసారి.
    
    భయంతో వణికి పోతున్నాడు నర్సింహ.... అతని వంటికి పూర్తిగా చెమటలు పట్టేసాయి-
    
    వార్త అందడంతో, రైల్వే పోలీసులు.... పరుగు, పరుగున అక్కడికి వచ్చారు..... రైల్వే పోలీస్ ఇన్స్ పెక్టర్ శశిరామ్ ఆదరాబాదరాగా, ఆ లావెట్రీలోకి అడుగుపెట్టి, అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి జుగుప్సగా కళ్ళు మూసుకున్నాడు...
    
    ఆ లావెట్రీలో-
    
    అడ్డంగా పడిఉందా ఆ గోనెసంచి... ఆ సంచిలోంచి బయటపడి....ఒక మొండి చెయ్యి.... ఒక మొండికాలు.... కనిపిస్తున్నాయి....
    
    గోనె సంచి నిండా, లావెట్రీ నిండా రక్తం.... గడ్డకట్టిన రక్తం...
    
    శశిరామ్ ఆధ్వర్యంలో-
    
    పోలీసులు.... ఆ గోనెసంచిలోంచి....ఆ మానవ మృత దేహాన్ని బయటకు లాగడానికి ప్రయత్నించారు...
    
    రెండు కాళ్ళు... రెండు చేతులు.... ఆ తర్వాత మొండెం.... తలకాయ లేదు...
    
    గుండె ప్రాంతంలో...వరుసగా కనిపిస్తున్న కత్తిపోట్లు....
    
    ఆ దృశ్యాన్ని చూడగానే పోలీసు ఇన్ స్పెక్టర్ శశిరామ్.... నుదిటిమీద అప్రయత్నంగా చెమట పట్టేసింది....
    
    నాంపల్లి, లోకల్ ట్రైన్లో..... తల లేని మొండెం.... మాంసం కత్తితో.....చెట్టుకొమ్మల్ని నరికేసినట్టుగా కాళ్ళూ... చేతులు...
    
    పోలీస్ వర్గాల్లోకి ఆ వార్త క్షణకాలంలో దావానలంలా ప్రాకిపోయింది.
    
    మరో అరగంట తర్వాత -
    
    నాంపల్లి స్టేషన్, పోలీస్ ఉన్నతాధికారులతోనూ, ప్రెస్ రిపోర్టర్లు, ఫోటో గ్రాఫర్లతోనూ నిండిపోయింది.
    
                                                   *    *    *    *    *
    
    తలుపు దబ దబా చప్పుడవడంతో మెలుకువొచ్చింది సూర్యవంశికి.
    
    భారంగా కళ్ళిప్పాడు.
    
    కళ్ళంతా మండుతున్నాయి.... చికాగ్గా డోర్ వేపు చూసాడు. ఆ వెన్వెంటనే అతని చూపులు టేబిల్ మీదున్న టైమ్ పీస్ మీద పడ్డాయి.
    
    వాచీ... మూడుగంటలు చూపిస్తోంది.
    
    వాచీ పనిచేస్తోందో, ఆగిపోయిందో వెంటనే తెలియలేదు.... గాభరాగా లేచి, బెడ్ రూమ్ లోంచి డ్రాయింగ్ రూమ్ లోకొచ్చి, విసురుగా డోర్ తెరిచాడు.
    
    ఎదురుగా-
    
    పోలీస్ కానిస్టేబుల్.... మఫ్టీలో ఉన్నాడు.
    
    "ఎ.సి.పి సాబ్.... మిమ్మల్ని అర్జంటుగా తోలుకురమ్మన్నారు." సెల్యూట్ చేసి బొంగురు గొంతుకతో చెప్పాడు కానిస్టేబుల్.
    
    "ఎందుకు..."
    
    "తెల్వదీ..."
    
    "ఎ.సి.పి. సాబ్ ఎక్కడున్నారు" అడిగాడు సూర్యవంశీ.
    
    "సుల్తాన్ బజార్ ఆఫీసులో."
    
    "ఒక గంటలో వస్తానని చెప్పు..."
    
    "అర్జంటని చెప్పమన్నారు సాబ్...."
    
    "నువ్వెళ్ళు.... వస్తాను" చెప్పేసి వెనక్కి తిరిగాడు సూర్యవంశీ.
    
    ఏ పనీ లేకపోయినా, ఎవ్వరూ నిద్రలేపకపోయినా....అలా నిద్రపోతూనే ఉంటాడు సూర్యవంశీ.