పైగా రాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారేసరికి ఇరవై లక్షల కేష్ కలెక్ట్ చేయటం కష్టం కాకపోయినా... ఆడ్ టైమ్ లో గనుక ఒకింత ఇబ్బందే అయింది. ఆ పనే చేసుండకపొతే నెలకు పదివేల జీతం, కారు, కంపెనీ ఇచ్చిన డీలక్స్ క్వార్టర్స్, ఏసీ ఆఫీసు రూమ్, టిఏలు, డిఏలు మొత్తం స్టేక్ గా పెట్టవలసి వచ్చేది.

 

    మధుకర్ ఆగ్రహం ఎన్ని ప్రమాదాల్ని, కష్టనష్టాల్ని తెచ్చిపెడుతుందో అనుగ్రహమూ అంతే లాభాన్ని, సుఖాల్ని, సంపదల్ని హోదా ని తెచ్చిపెడుతుంది.

 

    మధుకర్ విషయంలో ఏ పని చేయవలసి వచ్చినా, ఎవ్వరికీ చెప్పనక్కర్లేదు. చివరకు రాఘవేంద్రనాయుడి ధర్మపత్నికి కూడా.

 

    మంచిదైనా, చెడుదైనా మధుకర్ కోరింది ముందు నెరవేర్చాలి. అక్కడితో మధుకర్ సంతృప్తి చెందుతాడు. ఆ పైన కొడుకు చేసిన పనిని సరిదిద్ది, అందు మూలంగా వచ్చిన నష్టాన్ని లాభంగా మార్చేవరకు రాఘవేంద్ర నాయుడు నిద్రపోడు. తనక్రింద పనిచేసేవార్ని కూడా నిద్రపోనివ్వడని వారందరికీ తెలుసు.

 

    ఆరోజు ఉదయం పదిన్నరకు మధుకర్ ఇండస్ట్రీస్ పదిహేను అంతస్తుల రిజష్టర్డ్ ఆఫీసులో పనిచేసే వేలమంది సిబ్బంది మెదళ్ళల్లో ఒక్కటే ప్రశ్న పురుగులా తొలుస్తోంది.

 

    పదిలక్షలు కూడా చేయని మధుకర్ బార్ ని, తమ భవిష్యత్ యజమాని అహంతో పొగరుతో ముప్ఫై లక్షలకు కొనిపించాడు. ఆ నష్టాన్ని తమ ప్రస్తుతపు యజమాని ఎలా పూరిస్తారు? ఆ ప్రశ్న దగ్గరే వాళ్ళ ఆలోచనలు స్తంభించి పోయాయి.

 

    కాని వాళ్ళకు మాత్రం ఒకటి ఖచ్చితంగా తెలుసు - తమ చైర్ మెన్ రాఘవేంద్ర నాయుడు జపాన్ నుంచి రాగానే కేవలం గంటలోపే ఆ డీల్ ని ప్రాఫిటబుల్ గా మార్చివేస్తారు. అది ఖాయం. కాని ఎలా?

 

    అదే ప్రశ్నని ఒకర్ని ఒకరు ప్రశ్నించుకోవటంలో లంచ్ టైమ్ అయిపోయింది తప్ప, సమాధానం తట్టలేదు.

 

    అప్పుడొకరన్నారు. "అది మనకు తెలిస్తే ఇలా గానుగెద్దుల్లా ఈ ఉద్యోగాలెందుకు చేస్తాం? సొంతగా మనమే ఏదో ఒక వ్యాపారాన్ని ఆరంభించుకొని పైకి వచ్చేవాళ్ళం. ఇక పనిలో తలదూర్చండి. ఛైర్ మెన్ గారు ఏం చేసి దాన్ని లాభంగా మార్చుతారనే విషయం రేపటివరకు సస్పెన్స్. అంతే-" అతను చెప్పటం పూర్తికాగానే అందరూ తిరిగి పనిలో తలదూర్చారు.

 

    సరిగ్గా అదే సమయంలో రాఘవేంద్రనాయుడు ఇండియా వచ్చేందుకు, జపాన్ ఎయిర్ లైన్స్ ఆయన టిక్కెట్ ని కన్ ఫర్మ్ చేసింది.

 

                                      *    *    *    *    *  

 

    జరిగింది తెలుసుకుని మధుకర్ తల్లి చాలా బాధపడింది. కొడుకు పంతం, పట్టుదల, మొండితనం, ఉక్రోషం ఎక్కడికి దారితీస్తాయో - ఏ అంచుకు విసిరి వేస్తాయోనని మధనపడిపోయింది.

 

    ఆరోజు ఉదయానికి ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగిన రాఘవేంద్రనాయుడు ఎయిర్ పోర్టు నుంచే ఇంటికి ఫోన్ చేశాడు.

 

    ఆయన భార్య భువనేశ్వరి రెస్పాండ్ చేసింది. ఆమె జరిగిందంతా భర్తకు చెప్పి బాధపడింది. జరిగింది తెలుసుకున్న రాఘవేంద్రనాయుడు పెద్దగా రియాక్టు అవ్వలేదు.

 

    అందుకు ఆరు కారణాలున్నాయి.

 

    ఒకటి: కొడుకు మనస్తత్వం బాగా ఎరిగుండటం.

 

    రెండు: కొడుకు ఏ తప్పు చేసినా క్షమించగలిగేంత ప్రేమని గుండెల నిండా నింపుకుని వుండటం.

 

    మూడు : తన తండ్రి మాధవరావు చనిపోయాక ఆ కుటుంబంలో పుట్టినవాడు తన కొడుకే గనుక. తన తండ్రే తిరిగి తన కొడుకుగా పుట్టాడని నమ్మి తండ్రి పేరే పెట్టుకోవటం!

 

    నాలుగు: తను అనవరతం శ్రమించి సంపాదించిన అపార సంపదకు వారసుడు మధుకర్ ఒక్కడే కావటం.

 

 

    ఐదు: మరి కొన్నాళ్ళకయినా మధుకర్, తన బాధ్యతని తాను గుర్తించే స్థాయికి ఎదగగలడనే నమ్మకం ఉండటం.

 

    ఆరు: కొడుకే నష్టం తెచ్చిపెట్టినా తను దాన్ని లాభంగా మార్చగల వ్యాపార చాతుర్యం తనకుంది గనుక - రియాక్ట్ అవ్వలేదు.

 

    వ్యాపారపరంగా చేతులు చూడకుండా జాతకం చెప్పగల శక్తి యుక్తులు నాయుడికున్నాయి. లక్షల నక్షత్రాల గొడుగు క్రింద ఎన్నో ఒంటరి రాత్రిల్ని గడిపిన దురదృష్టకరమైన అనుభవాలెన్నో ఇప్పుడాయన అభివృద్ధికి మెట్లుగా మారిపోయాయి.

 

    కష్టసుఖాలు- లాభ నష్టాలు- ఎత్తుపల్లాలు- శాంతి, అశాంతి ప్రతిదాని రెండవ మొహాన్ని కూడా చూసిచూసి అలవాటై, అబ్సెషనయి చలించని స్థితికి చేరుకొని, దేనికయినా ఒకే విధంగా రియాక్ట్ అయ్యే స్థితికి ఎదిగిన రాఘవేంద్రనాయుడుకి వచ్చిన నష్టం, కొడుకు ఆడుకున్న ఆటగానే అనిపించింది.

 

    చిన్నప్పుడు బొమ్మలిచ్చాను-

 

    వాటిని విరగ్గొట్టటమే ఆటనుకున్నాడు మా నాన్న. (కొడుకులో తన తండ్రిని చూసుకుంటాడు గనుక మధుకర్ ని నాన్నా అంటాడు.)

 

    ఎన్నో ఆటవస్తువులిచ్చాను ఆడి పారేశాడు నాన్న. ఇప్పుడు పెద్దయ్యాడు కనుకే కొంచెం పెద్ద ఆటలాడుకుంటున్నాడు. తప్పేముంది? తనకైనా తెలిసిరాక పోతుందా?

 

    ఈ ప్రపంచంలో ఉన్నింట్లో పుట్టిన పిల్లలు ఎందరు ఎర్లీ ఏజ్ లోనే బాధ్యతల్ని గుర్తించారు? ఆక్వర్డు టీనేజ్! ఎక్స్యూస్ చేయదగ్గ జీవితమే గదా!

 

    చేయాలనుకున్న తప్పు మధుకర్ చేసినప్పుసు అప్పుడు తన తండ్రి కళ్ళలో కనిపించే ఆనందపు మెరుపులు పవర్ ఫుల్ హాలో జెన్ లాంప్స్ కన్నా కాంతివంతంగా వుంటాయి.

 

    నాన్న- నీలో మా నాన్నను చూసుకుంటున్నాను. మా నాన్న చేతిలో పార, గునపం తప్ప మరేమీ లేవు. అవే ఆయన ఆస్తి. ఆర్థర్ కాటన్ దొర ఆనకట్ట కట్టేముందు వరకు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరువు విలయ తాండవం చేసేది. అప్పుడు మా నాన్న కఠోరమైన శారీరక శ్రమచేసి, నాలుగు ఎకరాల భూమి కొన్నాడు. కాటన్ దొర మనస్తత్వపు వెలుగుల్లోంచి వచ్చిన నీటి కాలువలు ఈ భూమిని బంగారం పండే ప్రాంతంగా మార్చివేశాయి. మా నాన్న అప్పుడు ఎకరం రెండొందల రూపాయలకే కొన్నాడు. ఆ ఎకరం నేను ఎదగాలనుకున్నప్పుడు పదివేలయింది. నాలుగు ఎకరాలు నలభై వేలు! అదే నా జీవిత పరమపదానికి మెట్లయి నన్ను పైకి తీసుకెళ్ళాయి. ఆయన- నేనూ అలాగే కాకూడదని కడుపు కట్టుకుని ఆ నాలుగెకరాలు కొన్నారు.

 

    ఆయన చనిపోతూ తనను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తల నిమురుతూ నీకు నేను బిడ్డనైపుడతాను. నన్ను మరో జన్మలో కూడా కష్టపెట్టకు నాన్న అని అడిగినప్పుడు నా గుండె ద్రవించి అనంత దిగంతాలకు వ్యాపించింది.

 

    అదిగో అలాంటి నమ్మకాల నుంచి, సెంటిమెంట్ల నుంచి ఎదిగిన నేను, నా కొడుకు బాధపడితే ఎలా చూడగలను? చూడలేను.

 

    అందుకే చూసేవారికి నా ప్రేమ పిచ్చిగా, వెర్రిగా, తిక్కగా అనిపించినా లెక్కచేయకూడదు కదా? అసలు నా బిడ్డ మధుకర్ ముఖంలో నీలి నీడల్ని నేను చూడలేను. వాటిని తొలగించటానికి ఈవెన్ ఐ కెన్ స్టేక్ మై హోల్ ప్రాపర్టీ-

 

    పిచ్చో, మూర్ఖత్వమో, అంధత్వమో ఏమో తెలీదు. అయినా రాఘవేంద్రనాయుడు లెక్కచేయడు.

 

    ఢిల్లీ నేషనల్ టెర్మినల్ లోకి ఎంటరవుతూ ఇరవై లక్షల నష్టం వచ్చినా, ఆ బార్ ని కొన్నప్పుడు నా తండ్రి కళ్ళల్లో ఎంత ఆనందం తొంగిచూసిందో? వెధవ జపాన్ ట్రిప్ లేకుంటే ఆ ఆనందాన్ని ప్రత్యక్షంగా చూడగలిగేవాడ్నే కదా! అని అనుకున్నాడు ఒకసారి.