చెంగుతో ఓసారి కళ్ళు తుడుచుకుంది "హాస్యాలాడుతున్నారా? అవును కష్టాలలో వున్నవారిని చూస్తే మీరు పరిహాసం చేయడానికి ఉబలాటపడతారని మరిచిపోయాను. అపరాధం నాదే" అంది.
    
    "ఓహో! అపరాధాల మీద అపరాధాలు చేస్తూనే వున్నాను నాకు తెలియకుండానే ఎంతమందిని క్షమించమని అడిగేదీ? మరి.....నిన్నేమని సంభోదించాలో తెలియటంలేదు. నీపేరు యిప్పుడైనా చెప్పరాదా?
    
    "ఆ ప్రసక్తి యిప్పుడు ఎందుకులెండి?"
    
    "ఇంతకంటే అన్యాయం వుందా? నీపేరేమో తెలియదు. నువ్వే నాతో ఏదో పనివుండి వచ్చావు. నిన్నునేను "అనామ" అని పిలుస్తాను, ఇష్టమేనా?"
    
    "అబ్బ! ఏమిటి మీరు? ఛలోక్తులకు ఇదేనా సమయం? నేనిలా రావడం వల్లనే లోకువైపోయాను. వెళ్ళిపొమ్మంటారా?"
    
    ఈ నిష్టూరోక్తులని భరించలేక "అంతపని చేయకు. ఈ అపనింద మోయలేను. అసలేం జరిగింది?" అన్నాడు.
    
    కోపంపోయి ఆమెముఖం గంభీరంగా మారింది. వ్యక్తులు మాటలు పలకడానికి శక్తులు సన్నగిల్లే సమయం ఆసన్నమయింది. వీటిని తరచటం మధించడం అమానుషం. కానీ అవసరం...ఈ సన్నివేశం అతీతమైనది కాకుండా సామాన్యంగా వుండాలంటే చాలా కావాలి అభినివేశం.
    
    "నేనిహ ఆ యింట్లో వుండలేనండీ!"
    
    "ఏమలా?"
    
    "భార్యను యింతగా హింసించే మొగవాడ్ని నేనింతవరకూ చూడలేదు."
    
    "ఇప్పుడు చూస్తున్నావుగా" అని వాగేశాడు తెలివితక్కువగానే.
    
    "చూడడం ఏంఖర్మ? అనుభవిస్తున్నాను. మీకో చక్కనికథ చెబుతాను వినండి. మనదేశానికి పాతకథే. ఎన్నిసార్లు విన్నా తనివితీరదు, భార్యాభర్తల గాథ."
    
    "అక్కరలేదు, ఊహించగలను."
    
    "కాదు, మీరు వినాల్సిందే. ఈనాడు నా కథ మీకు చెబుదామనే వచ్చాను సరదాకి" అని పంతం పట్టింది.
    
    అతను ఏమీ అనకముందే "నీరసంగా వుంది కూర్చోమంటారా?" అని అడిగింది.
    
    "అయ్యో! అలా కుర్చీమీద కూర్చో."
    
    "వద్దండీ, అంత మర్యాదకు తగను నేను" అని గుమ్మం ప్రక్కగా నేలమీద చతికిలపడి, వీపు గోడకు ఆన్చి పమిటను కొంచెం ముఖంమీదకు లాక్కుంది.
    
    "కాఫీ తెప్పిస్తాను."
    
    "ఒద్దు, వినండి. ఈ కధకు ముందుభాగం మీకు తెలుసు. భార్య చాలా అందమైనదని అతని ఉద్దేశ్యం. అందమైనవాళ్ళంతా అలాంటివాళ్ళని ఓ నమ్మకం."
    
    "అలాంటివాళ్ళంటే?"
    
    "ఏమో నాకు తెలీదు. పేచీలు పెట్టక వినండి. అందుకని పరీక్షలు ఏమండీ మీకు అగ్ని పరీక్ష కథ తెలుసా?"
    
    "ఆఁ రెండు మూడు వున్నాయి ఆ శీర్షికతో."
    
    "ఓసారిట ఆయనకు రైల్లో మొగుడ్ని విడిచి మరెవర్తోనో పలాయనం చిత్తగిస్తోన్న ఓ భామ దర్శనభాగ్యం కలిగిందట. అంచేత ఆడదాన్ని నమ్మకూడదట. మంటలో చేయివుంచి తాను పవిత్రమైనదని చెప్పాలిట. పవిత్రమైనదైతే చేతులు కాలవట!"
    
    "చేసిందా అలా?"
    
    "తనదీ శరీరమే, చెయ్యలా కానీ తర్వాత విచారించింది-చేసినా బాగుండేదని ఎందుచేతంటే అట్లకాడ వాతలకన్నా అవే కొంతవరకు నయంకదా."
    
    మెల్లగా నిట్టూర్చి యిలా కొనసాగించింది. గాద్గదికంగా "లాభంలేదు. నోరు రావటంలేదు, ఇవాళ మీకు చాలా వివరించుదామనే వచ్చింది. గొంతు పెగలడంలేదు. ఆమె అనుభవించిన శిక్షలు చాలా కొత్తకొత్తవి. ఆకలయితే అన్నం పెట్టకపోయినా సహించవచ్చు. కానీ దాహంతో గొంతు ఆరిపోతుంటే రెండురోజులు మంచినీళ్ళు యివ్వకుండా యాతనపెడితే ఎలా సహించడం? చలిగాలి వేస్తోంది మొర్రో అంటే ఏమైనాసరే-ఆరుబయటే మంచులో పడుకోమని శాసిస్తే అది శరీరమా, యంత్రమా? వీపుమీద వంద గుద్దులు పడ్డాక, పది చిరునవ్వులు నవ్వాలి లేకపోతే మరో యిరవైతాపులు. అనుమానపడటం ఆయనవంతు. అందుకు అనుభవించటం నావంతు అనుమానం రాకుండా ప్రవర్తించటం పెద్దనేరం. వద్దులెండి చెప్పను. అదేమిటి?"
    
    "ఏమిటి?" అని తల ఎత్తాడు.
    
    "భలేవారే! కన్నీటితో చెలగాటమాడుతున్నారా?"
    
    జేబులోంచి రుమాలుతీసి తుడుచుకుని "అవును నీ మాటలు వింటుంటే అలా ఆడుదామని బుద్ది పుట్టింది. నేను చాలా కఠినుడ్ని సుమీ."
    
    "అవును. మీకు బొత్తిగా దయలేదు. కానీ చిత్రం చూశారా, దయలేనివారి దగ్గరకు వచ్చాను సహాయంకోసం" అని ముచ్చటగా నవ్వి "పోనీ సలహాకోసం" అంది.
    
    అలా ముచ్చటగా నవ్వితే అతనికి మనసులో సరోజిని గిర్రున తిరిగింది. అదేనవ్వు. సరోజనిని పిలిచి ఈ అమ్మాయిని చూపించుదామనుకున్నాడు. కానీ సంకోచం.
    
    "అనామా! నేను నీకేం సహాయం చేయగలను? పరాయివ్యక్తిని, పురుషుడ్ని అదీకాక నువ్వనాధవి కాదు, తల్లికూడా వుందే."
    
    "నాకు అమ్మవుందికానీ నన్ను కడుపులో పెట్టి దాచుకునేటంతటి ధైర్యం ఆమెకులేదు. కష్టాలు ఆడదానికి కాక మొగవాడికి వస్తాయా?" అన్నది ఆమె ఊరడింపు.
    
    "అసలు నీ ఉద్దేశ్యం ఏం చేద్దామని?"
    
    "పారిపొమ్మంటారా?"

    "నువ్వు పలికినంత మృదువుగా ఆ మాటను ఎవరూ పలకరు. తూచినట్లు ఉపయోగిస్తారు ఓ కఠినమైన పదం."
    
    "అనుకోనివ్వండి. పోయాక ఎవరేమి అనుకుంటే ఏమి?"
    
    అతనో చిన్న నిట్టూర్పువిడిచి "ఎంతమాట అన్నావు? ఈమాట విన్నవారు నిన్ను చీదరించుకోరని నీ నమ్మకమా? ఇది ఆడది పలకాల్సిన మాటకాదు."
    
    ఆమెముఖం ఓ క్షణంపాటు పాలిపోయింది. 'నయం అది ఆడది చేయాల్సిన పనికాదని అన్నారుకాదు.'
    
    "అర్ధంఅదే నువ్వింత వెర్రిదానివి ఏమిటి? ఏ సుఖం ఆశించి నువ్వు పారిపోదామనుకుంటున్నావో అది చివరకు అపోహే అవుతుంది. అసలు నిజమైన సుఖం ఎక్కడా లేదు. అదంతా కపట భ్రమ."
    
    "ఓహో! ధర్మపన్నాలు చెబుతున్నారే."
    
    "అయితే ధన్యుడ్నే ఎందుకంటే వాటిని యితరులకు చెప్పగలనని యింత వరకూ నాకు తెలీదు."
    
    "అందుకు మిమ్మల్నభినందిస్తున్నాను." అని తీవ్రంగా ఓ చూపు చూసి "మీరు నాకు గురుతుల్యులు. మీ మాట నేను శిరసావహిస్తాను. పతియే సతులకు పరమదైవము. ఆహా ఆ ఉపదేశాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడ్ని మరి మెచ్చుకోవాల్సిందే" అని పొంగి పారే దుఃఖాన్ని అణగద్రొక్కుకుంటూ, అంతటితో ఆపారేం? మనదేశం పతివ్రతామ తల్లులకి పుట్టినిల్లు, సుమతి కుష్టురోగిని భరించింది, సావిత్రి మృత్యుదేవతను జయించింది. ఇంక మన పతివ్రతలు చేసిన అద్భుతకార్యాలు వర్ణనాతీతములు. ఆ కథలన్నీ మీరు చెప్పలేదేం? అటువంటి పవిత్ర భారతదేశంలో నారినై జనించిన నేను యిటువంటి దురాలోచన తలలోకి రానీయటమే పాపం! యిలాగే బాధలుపడుతోన్న ....పొరపాటు- పతిసేవా తత్పరణలో కించిత్ దోష మాచరించిన కొంతమంది సాధ్వీమణుల్ని నేనెరుగుదును. వాళ్ళందర్నీ మీ దగ్గరకు తప్పక పంపిస్తాను. మీ అమూల్యమైన సలహాతో వారినీ తరింప చేయండి. మహాశయా! ఏదీ ఓసారి పలకండి...పతియే ప్రత్యక్ష- అయ్యో మాట్లాడరేం?"
    
    అచేతనుడై, గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్నాడు.
    
    "పోనీ వద్దులెండి. శ్రమపడవద్దు, వస్తాను. మిమ్మల్ని మొదటిసారి చాలా విచిత్ర పరిస్థితులలో కలుసుకున్నాను. ఇప్పుడూ అంతేమరి. రెండుసార్లూ మీరే జయించారు. కానీ యిలా సిగ్గువిడిచి వచ్చిన యీ పనికిమాలిన స్త్రీ మాత్రం మీకు మరెప్పుడూ కనబడదేమో! సెలవిప్పించండి" అంటూ అంతకు ముందే లేచి నిలబడిన ఆమె అతని జవాబుకోసం నిరీక్షించకుండా గిరుక్కున వెనక్కు తిరిగింది.
        
    "అనామా, ఆగు."
    
    ఆమె చప్పున ఆగి...యిటు తిరిగి దిగ్భ్రమంతో 'ఆశ్చర్యం! ఈ స్థితిలో కూడా నన్ను ఆపగలిగే శక్తి మీకొక్కరికె వుంది' అంది.
    
    "సరోజిని" అన్నాడతను వ్యాకులపాటుతో.