"నే చెప్తా నువ్వుండు. అమ్మాయ్... మా ఇంట్లో ఓ వాటా ఖాళీగా వుంది. నీకిష్టమైతే అందులో చేరిపో ఇంక నీ బాబు గురించి ఏ దిగులూ లేకుండా నా మనవరాలితోబాటు వాడ్నీ చూసుకుంటాను" అందావిడ.
పూజలు చేయకుండానే వరాలిచ్చే దేవత ప్రత్యక్షమైనట్లు అబ్బురంగా చూసింది ఆవిడవైపు శక్తిమతి. ఆ నిముషంలో ఆవిడ నిలువెల్లా నగలతో దేదీప్యమానంగా వెలిగిపోయే సినిమాలో అమ్మవారిలా ఆమె మనో నేత్రానికి కనిపించింది.
"ఇంత మంచివాళ్ళు కూడా వుంటారా? అని ఆశ్చర్యం కలుగుతోంది. నేను కాదు.... ఈ మాట మీనోట పలికించిన మా బాబు అదృష్టవంతుడు" ఆనందంగా అంది శక్తి.
ఇంతలో గోపాలరావు కూరలసంచితో వచ్చాడు.
శక్తిమతి తండ్రిని ఆవిడకి పరిచయం చేసి, బాబు ఏడుపు వినిపించి బెడ్ రూంలోకి వెళ్ళింది.
విశ్వనాథ్ ద్వారా ఇంటి విషయం విని ఆయన సంతోషించాడు.
"మా అల్లుడు ఇక్కడ వుండడు. చాలా మంచిపిల్లాడు. పనిమీద బయట ఊళ్ళో వుంటున్నాడు" అన్నాడు.
ఆ మూడు వాక్యాల్లో తండ్రికి ఇంద్రనీల్ మీద ఇంకా మిగిలిన అభిమానాన్ని గుర్తించి, నుదురు చిట్లించుకుంది శక్తి.
బాబుని ఎత్తుకుని బయటికి వచ్చింది. ముసలావిడ బాబుని ముద్దు పెట్టుకుని "చందమామలా వున్నాడు. నీ పోలికలుకూడా కొన్ని వున్నాయి. కానీ ఈ బుగ్గమీద సొట్టమాత్రం..." అనగానే, "మా అల్లుడి పోలిక" అన్నాడు గోపాలరావు.
శక్తి తండ్రివంక వాడిగా చూసింది.
సింధు బాబుని ఎత్తుకుని "ఇప్పుడే బాబుని మాతో తీసుకుపోతాం ఆంటీ!" అంది.
"మీ నాన్నని అడిగి పదిరూపాయలు పట్రా ఇచ్చేస్తాను" అంది శక్తి.
సింధు అమాయకంగా తండ్రిని "నాన్నా.... పదిరూపాయలియ్యి... ఊ... ఇయ్యి.... బాబుని కొంటాను" అని మారాం చేస్తుంటే అందరూ నవ్వేశారు.
"ఇకనుంచీ అక్కడే వుంటాంలే అమ్మా!" అన్నాడు గోపాలరావు.
ఇల్లు వాళ్ళు వున్న కాసేపూ సందడిగా వుండి, ఆ తర్వాత మళ్ళీ బావురు మంటూ నిశ్శబ్దంగా మిగిలిపోయింది.
గోపాలరావు బాబుతో కబుర్లు చెబుతుంటే బాబు కేకలు పెడుతున్నాడు.
"వీడుకూడా లేకపోతే నేను ఏమైపోయేదాన్నో కదా!' అనుకుంది కూరలు తరుగుతూ శక్తి.
    
                                                              * * *
స్కూటర్ మీద వెళుతున్న ఇంద్రనీల్ కి జనం ఓ చోట గుంపుగా చేరి వుండటం కనిపించి అప్రయత్నంగా స్కూటర్ ఆపి దిగాడు. తనూ వాళ్ళల్లో దారి చేసుకుని ముందుకి నడుస్తూ "ఏమైందీ?" అడిగాడు ఒకతన్ని.
"ఏక్సిడెంట్ తాగి మోటార్ సైకిల్ నడుపుతున్నట్లున్నాడు పాపం" అన్నాడతను హేళనగా.
ఇంద్రనీల్ అతనివైపు అడుగులువేసి కిందపడి వున్న వ్యక్తిని పైకి లేప బోయాడు. అతనికి బాగా గాయాలయ్యాయి. నుదుటినుంచి రక్తం కారుతోంది. కానీ స్పృహ కోల్పోలేదు. అతను కళ్ళు తెరిచి.... "ఇంద్రనీల్!" అన్నాడు.
ఇంద్రనీల్ కూడా అతడ్ని గుర్తించి, "మీరా? పదండి..... హాస్పిటల్ కి పోదాం" అన్నాడు.
అతను ఆ బలహీనమైన స్థితిలో ఇంద్రనీల్ తనని చేతులమీద ఎత్తుకుని తీసుకెళుతుంటే, ఎందుకో కంటతడి పెట్టుకున్నాడు.
అతను..... సుమతి భర్త.
    
                                                               * * *
గిరి ఇచ్చిన ఎడ్రెస్ ప్రకారం సుమతి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు ఇంద్రనీల్.
సుమతి ఆ సమయంలో మిషన్ మీద దుస్తులు కుడుతోంది. జుట్టు ముడివేసుకుని, పాత చిరుగుల చీర కట్టుకుని అశోకవనంలో సీతాదేవిలా వుంది. కానీ ఆ సీతమ్మకి భోజనం ఎలా వస్తుందీ? అన్న సమస్యలేదు. ఈవిడకి వుంది. ఆమెకి కాస్త దూరంలో నేలమీద కూర్చుని ఏడుస్తున్న పాప- బక్కచిక్కి పొట్ట వీపుకి అంటుకుపోయి వుంది.
ఇంద్రనీల్ ని చూడగానే ఆమె మొదట ఆశ్చర్యపోయింది. ఆ తరువాత హడావుడి పడుతూ లేచి "రండి.... రండి" అంది.
ఆమె చేతులకి వున్న మట్టిగాజుల్నీ, మెడలో వున్న పసుపుతాడునీ, ఇంట్లో తాండవిస్తున్న దారిద్ర్యాన్నీ అతను పరిశీలించాడు.
"ఇలా వచ్చారేం? మా అడ్రెస్ ఎలా తెలిసిందీ?" అని అడిగింది.
ఇంద్రనీల్ పాపని ఎత్తుకుని "మీ ఆయన ఇచ్చాడు" అన్నాడు.
ఆమె ముఖంలో ఆశ్చర్యం తారట్లాడింది. "మా ఆయనా?" అంది.
"మీ ఆయనకీ యాక్సిడెంట్ అయింది వదినగారూ" అన్నాడు.
"ఆ!" ఆమె గాభరాగా చూసింది.
"ప్రాణానికేం ప్రమాదం లేదు" వెంటనే అన్నాడు.
ఆమె పైటకొంగు నోటికి అడ్డంగా పెట్టుకుని సన్నగా వెక్కిళ్ళు పెట్టి ఏడవసాగింది.
"హాస్పిటల్లో ఎడ్మిట్ చేశాను. చాలా రక్తం పోయింది. నాది 'ఓ' గ్రూప్ యూనివర్శల్ డోనర్ ని కాబట్టి నాహ్ది పనికొచ్చింది" అన్నాడు.
సుమతి కళ్ళు తుడుచుకుని, "ఇక్కడ ఆయన వుండకపోయినా, ఎక్కడో అక్కడ క్షేమంగా వుంటే అంటేచాలు. మీకు చాలా రుణపడ్డాను" అంది.
ఇంద్రనీల్ భ్రుకుటి ముడివేసి "అదేమిటీ? ఆయన ఇకక్డ వుండక ఎక్కడ వుంటున్నాడూ?" అన్నాడు.
సుమతి తలవంచుకుంది.
"నన్ను చెల్లెలి మొగుడిగా కాదు. ఒక తోడబుట్టిన వాడిలా అనుకుని వివరంగా చెప్పండి" అన్నాడు.
సుమతి సన్నని గొంతుతో, మధ్యమధ్యలో ఏడుస్తూ గిరి సంగతులన్నీ చెప్పింది.
"మొదట వాళ్ళ ఆఫీసులో పనిచేసే అమ్మాయని చెప్పి ఇంటికి తీసుకొచ్చేవారు. కానీ అది అబద్దం అని తర్వాత తెలిసింది. ఆఫీసు పని మీద రాజమండ్రి వెళ్లినప్పుడు పరిచయం అయిందట. దాన్ని అంటుకున్నారు. అది వదిలి పెట్టకుండా అడ్రస్ పట్టుకుని ఈ వూరు వచ్చింది. పెళ్ళి చేసుకోమని పోరు పెట్టిందిట. నన్ను విడాకులు ఇమ్మని బలవంత పెట్టారు. నేను ససేమిరా ఇవ్వనన్నాను. కొట్టారు, హింసించారు. నేను లొంగలేదు. దాంతో ఇంటికి రావడం, డబ్బులు ఇవ్వడం మానేశారు. మొదటిసారి వచ్చిన ధైర్యంతో ఈ తడవ నేను వెళ్ళి ధైర్యంగా అబార్షన్ చేయించేసుకున్నాను. ఈ మిషన్ మీద వచ్చే ఆదాయంతో ఎలాగో రోజులు వెళ్ళదీస్తున్నాను. ఆయన ముఖంచూసి కూడా చాలా రోజులయింది. కానీ..... ఈ సంగతులేవీ మా నాన్నకి తెలియనీయకండి. లక్షలు పోసి కూతురిని నరకంలోకి పంపించానని తెలిస్తే ఆయన తట్టుకోలేరు" అంది.