"అదిగో శక్తి..." అంది అరుంధతి.
సుమతి ఎదురెళ్ళి చెల్లెల్ని కౌగిలించుకుంది.
అక్కలిద్దరూ సంతోషంగా వుండటం శక్తి గమనించింది.
"ఏవిటే, మీ ఇద్దరికీ లాటరీలో కోట్లు వచ్చిపడ్డాయా? లేక ఎలక్షన్స్ లేకుండా ప్రధానమంత్రి పదవి వచ్చిందా? ఇంత సంతోషంగా కనిపిస్తున్నారు?" అని పరిహాసం చేసింది శక్తి.
"అలాంటిదేం కాదు కానీ.... అంతకన్నా గొప్ప విషయం జరిగింది. నే చెప్తా ముందు" అని అరుంధతి తిరకాసు పెట్టింది.
"అబ్బా! ఇద్దరూ ఒద్దు నేను చెప్తాను వుండండమ్మా" అన్నాడు ఆనందంగా గోపాలరావు.
"అందరూ కలిసి కాకుండా ఎవరు చెప్పినా నాకు సమ్మతమే" అంది శక్తి.
"అయితే విను ఇంద్రనీల్ ఏం చేశాడో" అన్నాడు తండ్రి.
ఆ పేరు వినగానే శక్తి ఆతృతగా "ఏం చేశాడూ?" అంది.
సుమతి అందుకొని గిరి ఏక్సిడెంట్ నాటినుంచి ఇంద్రనీల్ ఆడిన నాటకం, అందువల్ల తన భర్తలో వచ్చిన మార్పూ అన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది. ఆ తరువాత నాటకం చెపుతుంటే అందరూ నవ్వు ఆపుకోలేక పోయారు.
"రెండుసార్లు దగ్గానంటే చాలు! మీ బావ ఠక్కున నోరు మూసేసు కుంటున్నాడు" అంది అరుంధతి.
"ఆ కమల్ తో లేచిపోవడానికి అసలు అతని మొహం అయినా గుర్తుందంటే నీకూ!" అని నవ్వింది శక్తి.
"మొత్తానికి మా మరిది భలే హీరోలే" అంది సుమతి.
"ఏం లాభం? మనకంటే చాలా తెలివైనదనుకుని మురిసిపోయాం మన చెల్లెల్ని చూసుకుని. ఇదేమో వజ్రాన్ని బొగ్గురాయనుకుని విసిరి పారేసింది. మనమే నయం.... బొగ్గుల్ని సానపెట్టి వాడుకుంటున్నాం...." అంది అరుంధతి.
"నిజమే! చాలా తెలివితక్కువగా ప్రవర్తించాను. నేను కళ్ళారా చూసింది అంతా అబద్దమని ఈరోజే తెలుసుకున్నాను" అంటూ మాధవి తనని కలిసి చెప్పిన విషయాలు చెప్పింది శక్తి.
"నే చెప్పలేదూ! ఇంద్రనీల్ బంగారం" అన్నాడు గోపాలరావు.
సుమతి హడావుడిగా ఇంద్రనీల్ అడ్రస్ కాయితం తీసుకొచ్చి ఇచ్చి "వెంటనే వెళ్ళు, అటువంటి వుత్తమున్ని పోగొట్టుకోకు ఏడ్చి లాభంలేదు" అంది.
గోపాలరావు కూడా "వెళ్ళమ్మా అతని గొప్పతనం నాకు తెలుసు. నిన్ను ఏమీ అనడు. బాబుకోసం ఎంతగా కలవరించిపోతున్నాడో.... తీసుకెళ్ళు" అన్నాడు.
శక్తి లేచి తండ్రి కాళ్ళకి నమస్కరించి బాబుని ఎత్తుకుని బయటికి రాగానే, విశ్వనాథ్ నవ్వుతూ "బెస్ట్ ఆఫ్ లక్" అన్నాడు.
"థాంక్యూ" అని శక్తి వేగంగా వెళ్ళిపోయింది.    
                                            * * *
'స్మైల్' ఆఫీసులో ఫోన్ దగ్గర వున్న అమ్మాయి "ఎస్ మేడమ్!" అంది శక్తిని చూసి.
"ఇంద్రనీల్ గారిని కలవాలి అని చెప్పండి. నా పేరు శక్తి" బాబుని భుజం మీద వేసుకుని జోకొడుతూ అంది శక్తి.
"వన్ మినిట్!" అంటూ రిసెప్షనిస్ట్ ఇంద్రనీల్ తో మాట్లాడి "లోపలికి రమ్మంటున్నారు, వెళ్ళండి మేడం" అంది.
శక్తి కాళ్ళు తడబడుతుండగా లోపలికి వెళ్ళింది.
ఇంద్రనీల్ తలవంచుకుని ఏదో రాస్తూ "ఎస్ మేడమ్.... మే ఐ హెల్ప్ యూ!" అన్నాడు.
"ఎస్... ఐ వాంట్ మై స్వీట్ హోమ్ బ్యాక్" అంది శక్తి.
ఇంద్రనీల్ తల ఎత్తాడు.
కన్నీళ్ళతో శక్తి అడుగులు ముందుకి వేసింది.
అతను నవ్వుతూ "హౌస్ కీపింగ్ ఈజ్ మై డ్యూటీ!" అని బాబుని ఆమె దగ్గర్నుంచి అందుకుని గుండెలకి హత్తుకున్నాడు.
అతని కళ్ళల్లో తదాత్మ్యతని అపురూపంగా చూసింది శక్తి.
"శక్తీ... నేను అదృష్టవంతుణ్ణి" అన్నాడు ఆమెని దగ్గరగా పొదువుకుంటూ.
"కాదు.... నేనే అదృష్టవంతురాల్ని" అంది.
"కాదు... నేనే!"
"కాదు... నేనే!"
"ఔను" అన్నాడు ఇంద్రనీల్.
"కాదు" అంది వెంటనే శక్తి.
ఆ ఇద్దరి పోట్లాటకి అర్ధం తెలియకపోయినా బాబు కిలకిలా నవ్వాడు. ఆ నవ్వుతో వాళ్ళిద్దరూ కూడా శృతి కలిపారు.
దూరంగా ఎక్కడో కోయిల వగరు మామిడిపూత తిన్నా తియ్యగానే కూస్తోంది.
        
                                   ---శుభం---