"మన కంపెనీ యానివర్సిరీడే సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది సర్. పి.ఆర్.ఓ.గా ఆ విషయం జ్ఞాపకం చెయ్యడం, నా రెస్పాన్స్ బులిటీ కద సర్! అందుకే..."

 

    "కంపెనీ యానవిర్సిరీ... నేనా విషయమే మర్చిపోయానోయ్. గుడ్ అయిడియా.. ఓ మంచి సిన్మా స్టార్ ని తీసుకొస్తే.. ఇంకా బాగుంటుంది కదోయ్... ఏవంటావ్..." కళ్ళెగరేస్తూ అన్నాడు అప్పలరాజు.

 

    "ఎస్..సర్!"

 

    "అయితే... ఎప్పుడు పెడదాం... డేటు కూడా నువ్వే ఫిక్స్ చెయ్యి."

 

    "డేటా... సర్..." ఆలోచనలో పడ్డాడు ఆంజనేయులు.

 

    యానివర్సిరీ పేరు మీద భుజంగరావు, భువనేశ్వరి, తరణిలను ఇటు తరలించాలని ఆంజనేయుల పధకం, మరి కాశీబాబు, కిడ్నాపింగు పధకం ఏ రోజు వేస్తాడో తెలీదు. ఎలాగ? ఏ విషయమూ ఇంటికెళ్తేనే తెలీదు.

 

    "డేటు సాయంత్రం ఫైనలైజ్ చేద్దాం సర్! చీఫ్ గెస్ట్ గా సినిమా యాక్టర్ విషయం మీరు ఫైనలైజ్ చెయ్యండి సర్... ఈలోపు... స్టాఫ్ కి సర్క్యులర్ పంపేద్దాం..."

 

    "ఓ.కే...ఓ.కే... సాయంత్రం అయిదు... అయిదు నిమిషాలకి నువ్విక్కడుండు. అప్పుడు డిసైడ్ చేద్దాం..." గబగబా లేచి బయటికెళ్ళి పోయాడు.

 

    గదిలోంచి బయటకొచ్చి, మేరీ వేపు నడిచాడు ఆంజనేయులు.

 

    "కల్సి మనం సిన్మాకెళ్ళినా, సినిమా కెళ్ళినట్టుగానేలేదు. పానకంలో పుడకలాగా బాస్ వచ్చాడు..." ఆంజనేయులు దగ్గరగా రాగానే మేరీ అంది.

 

    "అయిపోయిందానికి మాట్లాడకూడదు. జరగాల్సింది ఆలోచించాలి. టైమంతా మందే గదా... డోన్ట్ వర్రీ... మళ్ళీ సిన్మాకెప్పుడెళ్దాం?"

 

    ఆ మాట వినగానే ఎగిరి గంతేసింది మేరీ. సడన్ గా ఆంజనేయుల్లో ఈ మార్పేమిటో అర్ధం కాలేదామెకు.

 

    "మీ మనస్సు మార్చమని గత నాలుగు వారాలుగా చర్చికి వెళ్ళి, ప్రభువును ప్రార్ధిస్తున్నాను. ప్రభువు కరుణవల్ల మీ మనసు మారింది..." సంతోషంగా అంది మేరీ.

 

    "సడన్ గా నా 'హార్ట్' కూడా ఏదో మారినట్టనిపించింది. ఇదా కథా..." అంటూ ఆశ్చర్యాన్ని నటించాడు.

 

    "ఏ సిన్మా కెళ్దాం... ఎప్పుడెళ్దాం?" అడిగింది మేరీ.

 

    "రేపు, ఎల్లుండు, అవతలనాడు... ఈ మూడ్రోజులూ... మీరేం ప్రోగ్రాములు పెట్టుకోకండి..." సీరియస్ గా అన్నాడు ఆంజనేయులు.

 

    "ఈ మూడ్రోజులూ సిన్మాకెళ్దామా..." మళ్ళీ ఎగిరి గంతేస్తూ అంది మేరీ.

 

    "అలా... తరచూ ఎగిరి గెంతకండి. ఇక్కడ లాంగ్ జంప్, హైజంప్ పోటీలు పెడుతున్నారనుకుంటారు. మనం సిన్మాకెప్పుడెళ్తున్నామో రేపు చెప్తాను" అంటూ తన సీటులో కొచ్చాడు ఆంజనేయులు.

 

    సిటీబస్సును జ్ఞాపకం చేసుకున్నాడు. దొంతర్లు, దొంతర్లుగా కళ్ళ మీదకు నిద్ర ముంచుకొచ్చింది. ఆ ఆఫీసులో, ఆ సమయంలో సగం మంది పైగా అలాగే ఉన్నారు.


                              *    *    *    *


    అనుకోని సమయంలో ఆనందం అక్కడ ప్రత్యక్షం కావడంతో కాళ్ళూపుకుంటూ కూర్చున్న భుజంగరావు సడన్ గా కాళ్ళూపడం మానేసి, ఆశ్చర్యంగా అతనివేపు చూసి...

 

    "రా...రా... నువ్వూ, మీ అంజిగాడూ ఈ మధ్య నల్లపూసై పోయారు" అన్నాడు.

 

    "ఎండలు ఎక్కువైపోయాయి అంకుల్... అందుకే నల్లపూసై పోయాం..." వెంటనే బదులిచ్చాడు ఆనందం.

 

    "నల్లపూసైపోవడమంటే, నల్లబడ్డం కాదురా! చిరాగ్గా అని, నల్ల పూసా అనగానేమి? ఈ పదము ఎందుకు వాడుకలోనికొచ్చెను?" అనే విషయ మ్మీద తధేకంగా ఉపన్యశిస్తూ, దానిని ఆనందం ఏమాత్రం వినడంలేదని తెలిసి...

 

    "చూడు... అంజిగాడికి నిజంగా పెళ్ళయింది కదూ... నువ్వయినా చెప్పరా బాబూ... ఆ అవుట్ హౌస్ ను నీకు పూర్తిగా రాసిచ్చేస్తాన్రా..." అని అడిగాడు బతిమిలాడుతున్నట్టు.

 

    "అంకుల్ మీరు పెద్దవారు... మీ లాంటి వారి దగ్గర అబద్ధం ఆడలేనండి... ఆడలేనంటే, ఆడలేనండి"

 

    ఆ మాటతో భుజంగరావు ముఖం సూర్యకాంతం పువ్వులా విచ్చుకుంది.

 

    "నువ్వు మంచోడివి... నాకా విషయం తెలుసు... చెప్పు... నిజం చెప్పు... ఆ అంజిగాడు నాటకాల రాయుడని చెప్పు..." ఆనందంగా అన్నాడు భుజంగరావు.

 

    "నిజమండి... అంకుల్... అంజిగాడికి పెళ్ళి కాలేదు..." ఆనందం నోట్లోంచి ఆ జవాబు వచ్చేసరికి...

 

    భుజంగరావుకి చిర్రెత్తుకొచ్చింది.

 

    "ఒరేయ్..." అని అరిచాడు.

 

    "మీరు మైకు పెట్టుకుని అరిచినా నిజాన్ని అబద్ధంగా మాత్రం మార్చలేరు. అర్ధమైందా?" ఆనందం కూడా గట్టిగా అరిచాడు.

 

    "అంజిగాడికి పెళ్లికాకపోతే, ఆ తరణి ఎవరు? ఆ అవుట్ హౌస్ లోని అమ్మాయిని చూపించు... లేకపోతే... ఆ ఫోటో ఇవ్వు. అని గంతులేసుకుంటూ తిరిగే ఆ కాశీగాడెవడు? అదైనా చెప్పి తగలడు."

 

    ముసిలాడు దారిలో కొచ్చాడనుకుని....

 

    "చూడండి బాబాయ్... ఇదంతా ఓ డిటెక్టివ్ సినిమా అన్నమాట. ఇందులో కాశీగాడు విలన్ అన్నమాట. ఆ కాశీగాడు అలా కనబడుతున్నాడా బాబాయ్ వాడి గురించి నేనో స్పెషల్ ఎంక్వయిరీ చేశాను. కొంతమంది పోలీస్ సి.ఐ.డీ. ఫ్రెండ్స్ నాకున్నారులెండి. రోజూ మేం టీలూ, కాఫీలూ తాగుతుంటాం. అది వేరే కథ... వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే మన సిటీలో అమ్మాయిల్ని ఎత్తికెళ్ళిపోయే దొంగల గ్రూప్ ఒకటి ప్రవేశించిందట... దానికి బాస్ కాశీగాడేనట... వీళ్ళేం చేస్తారంటే, ఫోటో స్టూడియోల్లోంచి అమ్మాయిల ఫోటోలు సంపాదించి, ఒక్కొక్కళ్ళ ఇళ్ళకు వెళ్ళి, ఆ ఫోటోలు చూపిస్తార్ట... ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నట్టు తెలీగానే, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తార్ట... ఆ గ్రూప్ లో మన పక్కింటి లాయర్ జిగురుమూర్తి వాడి అసిస్టెంట్ సుబ్రమణ్యం కూడా ఇటీవలే చేరార్ట."

 

    "హమ్మ... నిజమేనంటావా... ఆ కాశీగాడ్ని చూడగానే నాకప్పుడే అనుమానం వచ్చిందనుకో... లాయర్ గాడూ చేరాడా! పాపం కేసుల్లేకపోతే వాడేం చేస్తాడ్లే."

 

    "అంచేత బాబయ్యగారూ! అస్సలు వాళ్ళని మనింటికి రానివ్వకండి. అమ్మాయిలెవరూ ఇళ్ళల్లో లేకపోతే... వీళ్ళు మనింట్లో దోపిడీలు కూడా చేస్తాట్ర"