"కిరణ్ నీకో గుడ్ న్యూస్.....ఆదర్శనగర్ లో వున్న నా ఫ్లాట్ నీకు అమ్మెయ్యబోతున్నాను" అంది లూసీ.
    
    కిరణ్ నమ్మలేనట్లుగా చూశాడు.
    
    "నాకు రెండు ఇళ్ళు ఎందుకూ? ఎలాగూ నువ్వు కొనాలనుకుంటున్నావుగా? అందుకే నీ నిర్ణయం తీసుకున్నాను" అంది.
    
    "నా పరిస్థితి మీకు తెలుసు. అంత డబ్బు ఇప్పుడూ...." అన్నాడు కిరణ్. నాకు తెలుసు. ముందు ఓ పదివేలు పట్రా నీ పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తాను" అంది లూసీ.
    
    కిరణ్ కి కృతజ్ఞతతో ఏం మాట్లాడాలో తోచలేదు. గబుక్కున లేచి ఆమె రెండు చేతులూ పట్టుకుని వాటిలో తన ముఖాన్ని దాచుకొన్నాడు.
    
    కొన్నిసార్లు మాటలు వ్యక్తం చెయ్యలేని భావాల్ని చిన్నచిన్న చర్యలు విడమర్చి చెప్తాయి.
    
    ప్రేమకోసం అతను పడే తపన లూసీకి తెలుసు.
    
    లూసీ ఇదంతా ఎందుకు చేస్తోందో అతనికీ తెలుసు.
    
    తరచి చూస్తే విశ్వమంతా ప్రేమమయం కాదా మనసా.....
    
    కిరణ్ కి ఉద్విగ్నంగా వుంది. అలజడిగా వుంది. అంతకుమించి ఆనందంగా వుంది. కాళ్ళు ఒకచోట నిలవలేనంటున్నాయి. శరీరం యావత్తూ ఆమె దర్శనం కోసం తహతహలాడిపోతోంది.
    
    'కలల తేనె కలబోతల కనులు రెండు ఒకటాయె....
    
    వలపు గగన వీధులలో వెలుగుల వేలుపులాయె'.
    
    దూరం నుంచి చాయ వస్తూ కనిపించింది. ముఖంలో అదే గ్రేస్! రాజకుమార్తె నడిచి వస్తున్నట్లు! నేవీబ్లూ కలర్ చుడీదార్ మీద వైట్ చున్నీ వేసుకుంది. అతి వదులుగా వేసుకున్న జడలోంచి ముంగురులు రేగి ఆమె ముఖానికి మరింత అందాన్నిస్తున్నాయి. ఆమె కిరణ్ ని చూసింది ఆమె ముఖంలో ఏ మార్పూ లేదు.
    
    కిరణ్ ఆగలేనట్టు ముందుకి వెళ్ళి "చాయ....ఎన్నాళ్ళయింది నిన్ను చూసి...." అన్నాడు.
    
    "ఫ్యూన్ వచ్చి నాకోసం ఓ అబ్బాయి వచ్చాడని చెప్పగానే నువ్వేననుకున్నాను" అంది అతి మామూలుగా.
    
    "చాయా! నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. కానీ ఇక్కడ కాదు. నాతో బైటికిరా" ఆమె చెయ్యి పట్టుకుని గుప్పెటలో బంధిస్తూ అన్నాడు కిరణ్.
    
    "ఏమిటీ? మీ అంకుల్ తన ఆస్తంతా నీ పేరిట వ్రాసిపోయాడా ఏం?" ఆలస్యం చెయ్యకుండా అడిగింది చాయ.
    
    కిరణ్ కి ఆ మాటలు రుచించకపోయినా, ఆమె ఏం మాట్లాడినా భరించడమే తనకు అలవాటు అన్నట్లుగా పెద్దగా పట్టించుకోలేదు.
    
    "అదేం కాదు."
    
    "మరి?!"
    
    "ఓ చోటికి నాతో రావాలి నువ్వు."
    
    "ఓ.కె.....కారు తెచ్చావా?" అంది.
    
    కిరణ్ తప్పుచేసిన వాడిలాగా తల అడ్డంగా వూపాడు.
    
    "మరి ఎలా రమ్మంటావు? ఎత్తుకు తీసుకెళతావా?" కోపంగా అడిగింది.
    
    "నువ్వు ఒప్పుకుంటే...." కిరణ్ నవ్వుతూ ఆమెను చూశాడు.
    
    "నాకు కావాల్సింది బాయ్ ఫ్రెండ్! బానిస కాదు!" గట్టిగా అంది చాయ.
    
    ఆమె అరిచినట్లుగా అనడంతో అక్కడే కూర్చున్న ఒకరిద్దరు అమ్మాయిలు తలలు తిప్పి ఆశ్చర్యంగా చూసారు.
    
    కిరణ్ నెమ్మదిగా- "చాయా.....ముందు బయటకు వెళదాం అక్కడ మాట్లాడుకుందాం" అన్నాడు.
    
    చాయ ఒక్కనిముషం ఆలోచించి- "సరే....పద" అంది.
    
    "చాయా.... ఇప్పుడు మనం మన ప్రేమమహల్ కి వెళ్ళబోతున్నాం. అర్ధంకాలేదా? నువ్వు కోరినట్లుగానే ప్లాట్ కొన్నాను. ఎంత అందమయిన లొకాలిటీ నో తెలుసా?" ఎక్సయిట్ అయిపోతూ అన్నాడు కిరణ్.
    
    "నిజంగా?" చాయ మెచ్చుకోలుగా చూసింది.
    
    అతని కళ్ళు గర్వంగా మెరిసాయి.
    
    "ఫుల్ ఫర్నిష్ డా?" ఆత్రంగా అడిగింది.
    
    కిరణ్ దెబ్బతిన్నట్లు - "లేదు కొత్తది" అన్నాడు.
    
    "నో..." అంది చాయ వెంటనే.
    
    అతను ఆశ్చర్యంగా చూసాడు.
    
    "సారీ కిరణ్.....ఇలా కాదు, నేను కోరుకున్న ప్రేమమహల్ ఇలా కాదు చూపించడం."
    
    "మరి ఎలా?" బలహీనంగా అన్నాడతను.
    
    "చెప్తా...." చాయ దూరంగా కనిపిస్తున్న ఏడంతస్తుల భవంతివేపు రెప్ప ఆర్పకుండా చూస్తూ అంది.
    
    "వన్ ఫైన్ మార్నింగ్ నువ్వు వచ్చి- "చాయా....మనఇల్లు రెడీ! అంటావు. నేను ఆశ్చర్యంగా చూస్తూ నీవెంట వస్తాను. గుమ్మానికి కట్టిన రిబ్బను నాచేత కట్ చేయిస్తావు. కళ్ళు మూసి లోపల అడుగుపెట్టిస్తావు. నీ చెయ్యి నా  కళ్ళమీద నుంచి తియ్యగానే నేను సంభ్రమంగా 'ఓహ్' అని వుండిపోతాను.
    
    ఎటు చూసినా అందం.....పోటీలు పడుతూ ఐశ్వర్యం....ఇన్ డోర్ ప్లాంట్లు.....వాల్ టు వాల్ కార్పెట్.....ఖరీదయిన విదేశీ ఫర్నీచర్.....మార్బుల్ టైల్స్....మన స్వప్న సౌధం రాజసంగా మనకోసం ఆహ్వానాలు పలుకుతూ వుంటుంది. ఏసీ నిశ్శబ్దంగా మనమధ్య దూకుతూ వుంటుంది. బెడ్ రూంలో వాటర్ బెడ్ మనకోసం ఎదురుచూస్తూ వుంటుంది.
    
    గాలి వీచినప్పుడల్లా పియానో రాగాలు పలికే కర్టెన్స్ ఎటుచూసినా అందాలు కనువిందు చేసే అద్దాలూ మననే ఆటపట్టిస్తుంటాయి.
    
    వంటింట్లో సోఫిస్టికేటెడ్ గా మైక్రోవేవ్ తో సహా అమర్చి పెట్టబడివుంటుంది.
    
    ఎక్కువసేపు వంటలో నా విలువయిన సమయం వృధాచేసుకోను- ఆ సమయాన్ని అందమైన బెడ్ రూంలో వలపు పంటలు పండిస్తాను....ఏవంటావ్?" అని అతని ముఖంలోకి చూసింది.
    
    కిరణ్ అప్పటికే ఆమెతో బాటుగా స్వప్నంలోకి నడిచి వాటర్ బెడ్ మీద వెల్లకిలా పడుకున్నాడు.
    
    "ఏయ్....ఎక్కడికెళ్ళిపోయావు?"
    
    అతని కనులముందు తన చేతిని ఊపుతూ అడిగింది చాయ.